అమెరికా టారిఫ్‌‌లతో కొన్ని సెక్టార్లకే ఇబ్బందులు: రేటింగ్ ఏజెన్సీ ఫిచ్‌‌

అమెరికా టారిఫ్‌‌లతో కొన్ని సెక్టార్లకే ఇబ్బందులు: రేటింగ్ ఏజెన్సీ ఫిచ్‌‌
  • ఫారిన్ కరెన్సీ ఇష్యూ రేటింగ్‌‌ బీబీబీ మైనస్‌‌: ఫిచ్‌‌

న్యూఢిల్లీ: అమెరికా విధించే  50శాతం టారిఫ్ ప్రభావం ఇండియాపై పెద్దగా ఉండదని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్‌‌  పేర్కొంది. కొంత ప్రమాదం ఉన్నా, అది  పరిమితమేనని తెలిపింది. ఈ నెల 27న అమలులోకి వచ్చే ఈ  టారిఫ్‌‌లు, జెమ్స్ అండ్‌‌ జ్యువెలరీ, టెక్స్‌‌టైల్స్, ఆటో పార్ట్స్, రొయ్యలు,  ఎంఎస్‌‌ఎంఈలు  వంటి రంగాలపై ప్రభావం చూపొచ్చు.  అయితే, అమెరికాకు ఎగుమతులు భారత్ జీడీపీలో కేవలం 2శాతం మాత్రమే కాబట్టి, మొత్తం ప్రభావం తక్కువగానే ఉంటుందని ఫిచ్‌‌ అంచనావేస్తోంది.

స్థిరంగా ఆర్థిక వ్యవస్థ 
భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి చెందుతున్నప్పటికీ,  ఆర్థిక పరమైన  ఒత్తిళ్లు లేకపోలేదని ఫిచ్ పేర్కొంది. ద్రవ్యలోటు ఎక్కువగా ఉండడం,  అప్పుల భారం, డెట్‌‌–సర్వీస్ రేషియో వంటి అంశాలు ‘బీబీబీ’ రేటింగ్ ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే  బలహీనంగా ఉన్నాయని తెలిపింది. జీడీపీ  పర్ క్యాపిటా, గవర్నెన్స్ మెట్రిక్స్ వంటి  ఇండెక్స్‌‌లు బలహీనంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ పెట్టుబడులు, వినియోగం నిలకడగా ఉండడం వంటివి ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో  తోడ్పడతాయని అభిప్రాయపడింది. 

దీని వల్ల మధ్యకాలంలో అప్పు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.  లాంగ్‌‌టెర్మ్‌‌  ఫారెన్  కరెన్సీ ఇష్యూ డిఫాల్ట్ రేటింగ్‌‌ను  ‘బీబీబీ మైనస్‌‌ -’ వద్ద  కొనసాగించింది. ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని తెలిపింది. 2025–26లో జీడీపీ వృద్ధి 6.5శాతంగా ఉండే అవకాశం ఉందని  అంచనా వేసింది.