తల్లిని కాపాడబోయి చనిపోయిన కొడుకు

తల్లిని కాపాడబోయి చనిపోయిన కొడుకు

హుజూరాబాద్,వెలుగుతల్లిని కాపాడబోయి ఓ కొడుకు ప్రమాదవశాత్తు కాలువలో పడి చనిపోయాడు. హుజూరాబాద్​ మండలం ధర్మరాజులపల్లికి చెందిన జక్కుల సారమ్మ, సారయ్యలకు ఇద్దరు కొడుకులు. రెండో కొడుకు జక్కుల రవి(26) గ్రామంలోనే  దినసరి కూలీగా పనిచేస్తున్నాడు.  గ్రామ శివారులోని ఎస్సారెస్పీ సబ్​కెనాల్​లో ఉట్టలు ఉతికేందుకు తల్లి సారమ్మను రవి సోమవారం బైక్​ మీద తీసుకెళ్లాడు. సారమ్మ బట్టలను ఉతుకుతుండగా చీరె కొట్టుకొని పోయింది, దాన్ని  పట్టుకునే ప్రయత్నంలో ఆమె కాలువలో పడ్డది. ఆమెను కాపాడేందుకు రవి కాలువలో దూకాడు. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకొపోయాడు.  ఒడ్డుకు చేరిన సారమ్మ కేకలు వేయగా  పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు అక్కడకు వచ్చి రవిని బయటికి తీశారు. అయితే అప్పటికే అతడు చనిపోయాడు. రవి  అన్న భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు టౌన్​సీఐ వాసంశెట్టి మాధవి తెలిపారు.  రవికి భార్య లావణ్య, ఒక పాప ఉంది.  తన కళ్ల ముందే కొడుకు కొట్టుకుపోయాడని, రైతులు పరుగెత్తి అతన్ని బయటకు లాగినా ప్రాణాలు దక్కలేదని తల్లి సారమ్మ గుండె పగిలేలా ఏడుస్తోంది. రవి బిడ్డ ఏడుస్తూ తన దిక్కు చూస్తుంటే దుఖం ఆగడంలేదని వాపోయింది. రవి శవాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.