
కంటోన్మెంట్లో లీజు భవనాల రిపేర్‌కు అనుమతివ్వట్లే
కంటోన్మెంట్, వెలుగు : కంటోన్మెంట్ బోర్డు అధికారుల నిర్ణయాలు స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కంటన్మెంట్పరిధిలో లీజుకు తీసుకున్న డొమెస్టిక్, కమర్షియల్ భవనాల రిపేర్లకు అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో బిల్డింగ్ యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా ఏండ్ల కిందట నిర్మించిన ఈ భవనాలకు రిపేర్లు చేయకపోవంతో గోడలు కూలిపోయే పరిస్థితికి చేరుకున్నాయని, ఫ్లోరింగ్, పెయింటింగ్ వంటి మరమ్మతులు చేసుకునేందుకు అనుమతులు ఇవ్వడం లేదని భవన యజమానులు పేర్కొంటున్నారు. అనుమతి కోసం వెళ్తే బోర్డు అధికారులు నిరాకరిస్తున్నారని వాపోతున్నారు. భవనాల రిపేర్లకు అనుమతించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. కంటోన్మెంట్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదని భవన యజమానులు ఆరోపిస్తున్నారు.
చిన్న చిన్న రిపేర్లకు కూడా..
కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన చాలా భవనాలను కమర్షియల్వాడకానికి లీజుకు ఇచ్చారు. అయితే, చాలా కాలంగా వీటికి ఎలాంటి రిపేర్లు లేకపోవడంతో అవి చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆయా భవనాల్లో చిన్న చిన్న రిపేర్లు, అంతర్గత మార్పులు, భవనం ప్యారాపెట్ గోడలు,
వైట్‌వాషింగ్, రీ- ఫ్లోరింగ్, ప్యాచ్‌వర్క్ తోపాటు మెట్ల రిపేర్లు చేపట్టాల్సి ఉంది. అయితే, ఇవి చేయాలంటే ముందుగా కంటోన్మెంట్ బోర్డు అధికారుల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అనుమతులు కోరినా బోర్డు అధికారులు స్పందించడం లేదని ఆయా భవన యజమానులు పేర్కొంటున్నారు. పర్మిషన్ లేకుండా రిపేర్లు చేపడితే వెంటనే అడ్డుకుంటున్నారని వాపోతున్నారు.
బోర్డు పనితీరుపై నిపుణుల కమిటీ..
బ్రిటీష్ కాలంలో నిర్మించిన బంగ్లాలు శిథిలావస్థకు చేరుకున్నాయని.. వాటికి రిపేర్లు చేయకుంటే ప్రమాదాలు జరిగే అవకాశముందని, కానీ అధికారులు అనుమతివ్వడం లేదంటూ దేశంలోని 62 కంటోన్మెంట్ బోర్డులకు చెందిన ఆల్ కంటోన్మెంట్స్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖను గతంలో ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ఆ శాఖ.. కంటోన్మెంట్ బోర్డుల పనితీరుపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి, సమస్యను అధ్యయనం చేయాలని కోరింది. దీంతో దాదాపు 3 నెలల పాటు ఈ కమిటీ అధ్యయనం చేసి ఓ నివేదికను రక్షణ శాఖకు అందజేసింది.
కంటోన్మెంట్ ప్రాంతాల్లోని భవనాల రిపేర్లు చేపట్టేందుకు లోకల్ మిలటరీ అథారిటీ, బోర్డు అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని సిఫార్సు చేసింది. దీంతో సిఫార్సుల ఆధారంగానే రక్షణ శాఖ స్పందిస్తూ ఎలాంటి అనుమతులు అవసరం లేదని 2019లో ఉత్తర్వులు జారీ చేసింది. లీజు భవనాల యజమానులను ఇబ్బందులకు గురిచేయొద్దని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆ ఆదేశాలను బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదని, బిల్డింగ్‌ల రిపేర్లు చేపడితే అధికారులు, సిబ్బంది పనులను అడ్డుకుంటున్నారని భవన యజమానులు వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా అనుమతులు ఇవ్వాలని డిమాండ్చేస్తున్నారు.