వెలుగు, నెట్ వర్క్: సుమారు రెండు నెలలపాటు లిక్కర్ షాపులు బంద్ ఉండి, తెరుచుకున్నంక మందు తాగుతున్నవారి బిహేవియర్ లో తేడా కనిపిస్తోంది. తాగిన మత్తులో ప్రమాదాలకు దగ్గరగా వెళ్లి మరీ చనిపోతున్న ఘటనలు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్నాయి. లాక్ డౌన్ రోజులతో పోలిస్తే సూసైడ్స్, మర్డర్స్ ఎక్కువయ్యాయి. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి చేసేందుకు పనిలేని కొందరు దొరికిన వస్తువల్లా అమ్ముకొని తాగుతుండడంతో కుటుంబ కలహాలు తీవ్రమవుతున్నాయి. లాక్ డౌన్ రోజుల్లో 23.63 శాతం క్రైంరేట్ తగ్గినట్లు పోలీసుల రికార్డులు చెబుతుండగా, లిక్కర్ దుకాణాలు తెరుచుకోవడంతో మళ్లీ పాత పరిస్థితులే రిపీట్ అవుతున్నాయి.
ఇలా షాపులు తెరుచుకోగానే..
మే 6న లిక్కర్ షాపులు తెరుచుకోగా, మే 8న తాగిన మైకంలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం దేవుల గూడకు చెందిన దారావత్ సుఖ్లాల్ అనే వ్యక్తి కత్తితో పొడుచుకున్నాడు. క్రైం రేట్ అతితక్కువగా ఉండే ఈ చిన్న జిల్లాలో లాక్ డౌన్ తర్వాత మద్యం మత్తులో సుఖ్ లాల్ తోపాటు చప్పిడి సాయి (18), తెలిగె శ్రీనివాస్ ( 40), చదువుల రవీందర్ (50), షేక్ నసీం (50) అనే ఐదుగురు చనిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో నాలుగైదు రోజుల వ్యవధిలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు సూసైడ్ చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఆత్మహత్యలకు లెక్కలేదు.
ఇక లిక్కర్ షాపులు తెరిచిన మూడోరోజు జగిత్యాల జిల్లా కోరుట్లలో ఓ 35 ఏళ్ల వ్యక్తి మద్యం మత్తులో రోడ్డుపై నానా హంగామా చేశాడు. ట్రాన్స్ ఫార్మర్ దగ్గరకు వెళ్లి ఫ్యూజ్ బాక్స్ ఓపెన్ చేసి, అందులోని వైర్లు పట్టుకొని చచ్చిపోయాడు. మే 22న ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మేకలతండాలో ఫుల్లుగా మద్యం తాగిన ఓ మహిళ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. కుటుంబ కలహాలతో తాను భర్తను చంపేశానని, శవాన్ని చూపెడతానని వారిని పలుచోట్ల తిప్పించింది. మత్తు వదిలాక పోలీసులకు అసలు సంగతి బోధపడింది. ఆ మహిళ తన భర్తను చంపలేదని, అతను బతికే ఉన్నాడని తెలిసింది. గద్వాల మండలం మేళ్లచెరువులో ఇజ్రాయిల్(40) అనే వ్యక్తి తాగిన మత్తులో చొక్కమ్మ బావి(కోనేరు) పక్కనే పడుకొని, తెల్లారేసరికి అందులో పడి చనిపోయాడు. గోదావరిఖనిలోని ఇందిరానగర్ కు చెందిన చెల్ల మల్లమ్మ (55) లిక్కర్ లేనన్ని రోజులు ప్రశాంతంగానే ఉంది. మద్యం షాపులు మొదలయ్యా రోజూ తాగివచ్చి, మత్తులో అందరినీ అకారణంగా తిట్టడం మొదలుపెట్టింది. ఓపిక నశించిన మల్లమ్మ బంధువులైన ఇద్దరు మహిళలు ఆమెను కొట్టడంతో చనిపోయింది. దీంతో మూడు కుటుంబాలు మానసికంగా సఫర్ అవుతున్నాయి.
దొరికిన వస్తువల్లా అమ్ముతున్నరు
రామగుండం కార్పొరేషన్ పరిధిలో నివాసముండే 45 ఏళ్ల వ్యక్తికి లాక్ డౌన్ వల్ల పనిలేకుండా పోయింది. చేతిలో డబ్బు లేదు. తాగడానికి ఒక్కరూపాయి దొరకలేదు. భార్యను బతిమిలాడినా పైసా ఇవ్వలేదు. దీంతో బీరువాలో ఉన్న ఆమె బంగారు మాటీలను ఎత్తుకెళ్లి ఓ ఆసామి దగ్గర రూ.2 వేలకు కుదవ బెట్టిండు. రోజూ తాగి వస్తుండడంతో అనుమానం వచ్చిన భార్య బీరువాలో చూస్తే మాటీలు లేవు. దీంతోఆమె లబోదిబోమంది. మంచిర్యాల జిల్లాలోని ఓ కాలనీలో 35 ఏళ్ల వ్యక్తి చేతిలో మిక్సర్ గ్రైండర్ పట్టుకొని రిపేరింగ్ షాపుకు వచ్చాడు. ‘ఏమి ప్రాబ్లమ్ ?’ అని అడిగిన మెకానిక్ కు, ‘మందుకు డబ్బుల్లేవ్ . దీన్ని సెకండ్ హ్యాండ్ కింద కొంటరా?’ అంటూ వచ్చిన ఎదురు ప్రశ్నతో ముక్కున వేలేసుకున్నాడు. పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నప్పటికీ చాలావరకు బయటకు రావడం లేదు.
కేసులు పెరుగుతున్నయ్
దాదాపు రెండు నెలల పాటు మద్యం తాగకుండా ఉండి, ఇటీవల ఒక్కసారిగా వైన్ షాపులు ఓపెన్ చేయడంతో చాలామంది ఫుల్ గా తాగి, ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. లిక్కర్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. పిల్లల స్కూల్ ఫీజుల కోసం, పెద్దల వైద్యం కోసం దాచిన డబ్బులను, బంగారాన్ని ఎత్తుకెళ్తున్నారు. ఇటీవల ఇలాంటి కేసులు నా దగ్గరికి ఎక్కువగా వస్తున్నాయి. బాగా తాగాక సూసైడ్ ఆలోచనలూ వస్తాయి. అందువల్ల బాగా తాగేవారిపై ఓ కన్నేసి ఉంచాలి. ‑ డాక్టర్ రావులపాటి సతీష్ బాబు, సైకియాట్రిస్ట్, ఖమ్మం
తండ్రి లేదు.. కొడుకు లేదు
మద్యం మత్తులో కుటుంబ కలహాలు పెరుగుతున్నాయి. హత్యలకు దారితీస్తున్నాయి. లిక్కర్ లేని రెండు నెలల టైంలో గొడవలు తగ్గి, ఫ్యామిలీ మెంబర్స్ నడుమ అనుబంధం బలపడినట్లు వార్తలు వచ్చినా లిక్కర్ స్టార్ట్ అయ్యాక పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. 6న మద్యం షాపులు తెరుచుకోగానే 7న మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ మల్లికార్జున్ నగర్ కు చెందిన పుల్లూరి సురేశ్ అనే ఆటో డ్రైవర్ మద్యం మత్తులో భార్య సంధ్యారాణిని హత్య చేశాడు. ఈ నెల 13న కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం తిప్పాపూర్ కు చెందిన తాటిపల్లి మేలయ్య తాగివచ్చి ఇంట్లో నానా హంగామా చేశాడు. భరించేలేక ఆయన కొడుకు గొడ్డలితో నరికాడు. 22న గోదావరిఖని యైటింక్లయిన్ కాలనీలో శారదానగర్ కు చెందిన గణేశ్ (35) తప్పతాగి గొడవ చేస్తుండడంతో ఆయన తండ్రి మల్లయ్య ఇటుకపెల్లతో చంపేశాడు. ఫలితంగా ఓ భార్యకు భర్త, తల్లికి కొడుకు దూరమయ్యారు. తండ్రి కటకటాలపాలయ్యాడు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్లలో లక్ష్మణ్(25) అనే యువకుడు ఈ నెల 23న మద్యం మత్తులో తాగి ఇంటికి వచ్చి తల్లి దండ్రులు, సోదరునితో గొడవ పడ్డాడు. కుటుంబ సభ్యులు నెట్టేయడంతో కిందపడి చనిపోయాడు.
