
- సర్వీసు నుంచి ఆ ముగ్గురు టీచర్ల తొలగింపు
- టెన్త్ తెలుగు క్వశ్చన్ పేపర్ లీకేజీలో ఇద్దరు
- హిందీ పేపర్ లీకేజీలో ఒకరిపై వేటు
హైదరాబాద్/వికారాబాద్, వెలుగు : టెన్త్ తెలుగు, హిందీ క్వశ్చన్ పేపర్ల లీకేజీ ఘటనలో ముగ్గురు టీచర్లపై విద్యా శాఖ వేటు వేసింది. తాండూరు ఘటనలో ఇద్దరు టీచర్లు, కమలాపూర్ ఘటనలో ఒక టీచర్‌ను సర్వీస్ నుంచి తొలగిస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీచేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులో తెలుగు ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో నిందితులుగా ఉన్న ఎస్.బందెప్ప, సమ్మప్పపై వేటు వేశారు. వికారాబాద్ నుంచి వచ్చిన ఎంక్వైరీ టీం ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరోపక్క హనుమకొండ జిల్లా కమలాపూర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో హిందీ ప్రశ్నపత్రం బయటకు వెళ్లడంపైనా విద్యాశాఖ సీరియస్ అయింది. ఈ ఘటనకు బాధ్యులుగా రూం ఇన్విజిలేటర్ సబియా మదావత్ ను సర్వీస్ నుంచి విద్యా శాఖ తొలగించింది. అలాగే పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ఎం.శివప్రసాద్, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ టి.శ్రీధర్‌ను కూడా సస్పెండ్ చేశారు. స్టూడెంట్ శివకుమార్‌ను కూడా ఐదేండ్ల పాటు డిబార్ చేశారు.
బందెప్ప, సమ్మప్పకు రిమాండ్
టెన్త్ తెలుగు ఎగ్జామ్ ప్రశ్నపత్రాన్ని లీక్ చేసిన టీచర్లు బందెప్ప, సమ్మప్పకు కోర్టు రిమాండ్‌కు పంపింది. ఎంఈవో వెంకటయ్య గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు మంగళవారం వారిని రిమాండ్‌కు తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తాండూరు పట్టణ సీఐ రాజేంద్రరెడ్డి తెలిపారు బందెప్ప, సమ్మప్పను అరెస్టు చేసి కోర్టు లో హాజరుపరిచి రిమాండ్ కు తరలించామని తెలిపారు. జవాబులను మైక్రో జిరాక్స్ చేసిన విద్యా బుక్ సెంటర్ నిర్వాహకుడు శివ పరారీలో ఉన్నాడని సీఐ చెప్పారు.
హిందీ ఎగ్జామ్‌కు 99.63 శాతం హాజరు
పదో తరగతి హిందీ పరీక్షకు 99.63 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన ఎగ్జామ్ మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 2,652 సెంటర్లలో 4,85,669 స్టూడెంట్లకు 4,83,860 మంది హాజరయ్యారు. వివిధ కారణాలతో1,809 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేటు స్టూడెంట్లు 324 మంది అటెండ్ కావాల్సి ఉండగా, 273 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు.