బార్డర్​లో తగ్గిన టెన్షన్​..జమ్మూ, రాజస్థాన్, పంజాబ్, పఠాన్‌‌‌‌కోట్‌‌‌‌లో తగ్గిన ఉద్రిక్తతలు

బార్డర్​లో తగ్గిన టెన్షన్​..జమ్మూ, రాజస్థాన్, పంజాబ్, పఠాన్‌‌‌‌కోట్‌‌‌‌లో తగ్గిన ఉద్రిక్తతలు
  • ఇంకా కొన్ని ఏరియాల్లో తెరుచుకోని స్కూళ్లు, కాలేజీలు

న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో దాదాపు వారం పాటు కొనసాగిన ఉద్రిక్తతలు సోమవారానికి తగ్గుముఖం పట్టాయి. షెల్లింగ్, డ్రోన్‌‌‌‌ బాంబుల పేలుడు శబ్దాలు, ఎమర్జెన్సీ చర్యలు వంటివేవీ లేకపోవడంతో ఎల్‌‌‌‌వోసీ(లైన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌) గ్రామాల్లోని ప్రజలు క్రమంగా బయటకు వస్తున్నారు. ఉద్రిక్తతలతో సొంత గ్రామాలను, ఇండ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లినవారు తిరిగి తమ గ్రామాలకు చేరుకుంటున్నారు. జనం తమ పొలాలకు వెళ్లి ఎప్పటిలాగే వ్యవసాయం షురూ చేశారు. తమ వ్యాపారాలను, ఉద్యోగాలను తిరిగి ప్రారంభించారు. పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఉన్న జమ్మూ, రాజస్థాన్, పంజాబ్, పఠాన్‌‌‌‌కోట్‌‌‌‌లో ఇప్పుడు జనజీవనం పూర్తిగా సాధారణ స్థితికి వస్తున్నది. 

అంతా ఓకే..

జమ్మూకాశ్మీర్, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ఇతర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి ఎటువంటి కాల్పులు, పేలుడు ఘటనలు నమోదు కాలేదని భారత సైన్యం సోమవారం ఉదయం ఒక ప్రకటనలో తెలిపింది. రాజస్థాన్‌‌‌‌లోని సరిహద్దు జిల్లాల్లో మాత్రం ముందుజాగ్రత్త చర్యగా బ్లాక్‌‌‌‌అవుట్ పాటించామని వెల్లడించింది. పంజాబ్‌‌‌‌లోని కొన్ని జిల్లాల్లో పాఠశాలలు, కాలేజీలు ఇంకా తెరుచుకోలేదని అధికారులు చెప్పారు.

పాకిస్తాన్‌‌‌‌తో సరిహద్దును ఆనుకుని ఉన్న ఫిరోజ్‌‌‌‌పూర్, ఫాజిల్కా, పఠాన్‌‌‌‌కోట్, అమృత్‌‌‌‌సర్, తారన్ తారన్, గురుదాస్‌‌‌‌పూర్ జిల్లాల్లోని పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు ఇంకా రీఓపెన్ చేయలేదని వివరించారు. జమ్మూ, రాజస్థాన్, పంజాబ్, పఠాన్‌‌‌‌కోట్‌‌‌‌లోని ఏరియాల్లో ఇప్పుడు పరిస్థితులు సాధారణంగా కనిపిస్తున్నాయన్నారు. దాంతో ఆయా ప్రదేశాల్లోని మార్కెట్లు, దుకాణాలు ఇతర వ్యాపార సముదాయాల వద్ద రద్దీ నెలకొందని తెలిపారు. 

పాక్‌కు భారత్ గట్టి పాఠం నేర్పింది: స్థానికులు 

ఉద్రిక్తత పరిస్థితుల తర్వాత శాంతి నెలకొనడంపై సరిహద్దు ప్రాంతాల ప్రజలు స్పందించారు. పాకిస్తాన్‌‌‌‌కు భారత్ గట్టి పాఠం నేర్పిందని.. బలమైన సందేశం పంపడంలో విజయం సాధించిందని ప్రశంసించారు. పాకిస్తాన్ ఇక మన దేశాన్ని కన్నెత్తి చూడటానికి ధైర్యం చేయదన్నారు. జమ్మూ, రాజస్థాన్, పంజాబ్, పఠాన్‌‌‌‌కోట్‌‌‌‌లో పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్ బాంబులను, ఇతర పేలుడు పదార్థాలను భారత భద్రతా దళాలు విఫలం చేశాయని తెలిపారు.

కాల్పుల విరమణ ఒప్పందంతో శాంతి నెలకొల్పడాన్ని స్వాగతిస్తున్నామని వెల్లడించారు. ప్రధాని మోదీ నిర్ణయంతో జనజీవనం ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చిందన్నారు. భద్రతాపరమైన ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ, అన్నిచోట్లా త్వరలో శాంతి నెలకొంటుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.