ఉరివేసుకున్న యజమానిని కిందకు దింపేందుకు 4 గంటలు పోరాడిన శునకం

ఉరివేసుకున్న యజమానిని కిందకు దింపేందుకు 4 గంటలు పోరాడిన శునకం

కుక్కలు విశ్వాసానికి మారుపేరు. ఎవరైనా ఏదైనా తినడానికి పెడితే.. అవి ఆ మనుషుల పట్ల ఎంతో ప్రేమను చూపిస్తాయి. వారిని మరిచిపోవు. కొంచెం ఆప్యాయంగా చూసుకుంటే అవి యజమాని కోసం ప్రాణాలు ఇచ్చేందుకు కూడా వెనకాడవు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన కుక్కు విశ్వాసాన్ని మరోసారి చాటిచెబుతోంది. ఈ ఘటన అందర్నీ ఆలోచింపజేస్తూ.. కంటతడి కూడా పెట్టిస్తోంది. 

తనను ఇన్నాళ్లూ ఎంతో ప్రేమగా.. మరెంతో అప్యాయంగా చూసుకున్న యజమాని చనిపోవడంతో ఆ కుక్క (శునకం) విలవిల్లాడింది. అప్పటి వరకూ ఎంతో సంతోషంగా ఉన్న యజమాని.. ఉన్నట్టుండి ఉరి వేసుకోవడంతో దాదాపు 4 గంటలు పోరాడింది. చివరకు ఆ శునకం కూడా యజమాని తుదిశ్వాస విడిచిన గంటల వ్యవధిలోనే చనిపోవడం కలిచివేస్తోంది. 

ఉత్తర్‌ప్రదేశ్‌ ఝాన్సీలోని పంచవటి కాలనీలోని సంభవ్‌ అగ్నిహోత్రి(23) అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. అతడు సివిల్స్‌ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నాడు. సంభవ్ తండ్రి ఆనంద్‌ అగ్నిహోత్రి రైల్వేశాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలంగా తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స కోసం ఆమెను భోపాల్‌కు తీసుకెళ్లారు. 

పెంపుడు కుక్క అలెక్స్‌ తోడుగా సంభవ్‌ మాత్రం ఇంట్లో ఉన్నాడు. ఆస్పత్రికి వెళ్లిన తండ్రి ఆనంద్‌ ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా కుమారుడు సంభవ్‌ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ఇంటిపక్కన వారికి ఫోన్‌ చేసి, విషయం కనుక్కున్నాడు. స్థానికులు సంభవ్‌ ఇంటికి వెళ్లడంతో.. వారిపై అలెక్స్‌(కుక్క) దాడి చేసింది. అప్పటికే ఆ యువకుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులను సైతం కుక్క ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో వారు శునకానికి మత్తుమందు ఇచ్చి బంధించారు. ఆ తర్వాత సంభవ్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలెక్స్‌ కూడా కాసేపటికే మరణించింది. శునకానికి ఎక్కువ మోతాదులో మత్తు మందు ఇవ్వడం వల్లే చనిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

యజమాని పట్ల తన ప్రేమను చాటుకుందని శునకాన్ని గుర్తు చేసుకుని స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న  సంభవ్‌ అగ్నిహోత్రిని కిందకు దింపేందుకు దాదాపు 4 గంటలపాటు అలెక్స్ శ్రమించింది. ఆ సమయంలో స్థానికులు సహా పోలీసులను ఇంట్లోకి రానివ్వలేదు. కుమారుడి మరణతో సంభవ్‌ అగ్నిహోత్రి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. సంభవ్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంభవ్ మేనమామ వివరాల ప్రకారం.. 

5 సంవత్సరాల క్రితం నుంచి జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కను సంభవ్ పెంచుకుంటున్నాడని అతడి మేనమామ అభిషేక్ తెలిపారు. ఒక అధికారి అతనికి బహుమతిగా ఇచ్చాడని తెలిపారు. సంభవ్‌కిఅలెక్స్ అంటే చాలా ఇష్టం. అలెక్స్ ను వదిలి బంధువుల శుభకార్యాలకు కూడా కొన్నిసార్లు వెళ్లేవాడు కాదని తెలిపాడు.