ఈ కుక్క ఆస్తి రూ. 36 కోట్లు

ఈ కుక్క ఆస్తి రూ. 36 కోట్లు
  • పెంపుడు కుక్కకు ఆస్తి రాసిచ్చిన అమెరికన్

టెన్నెసీ(అమెరికా): పెంపుడు జంతువును కన్న బిడ్డలా చూసుకున్న ఓ అమెరికన్, తను పోయాక వారసత్వం కూడా దానికే కట్టబెట్టిండు. తనకున్న ఆస్తిపాస్తులన్నీ తన కుక్క లులూకే చెందేలా ఏర్పాటు చేసిండు. ఏకంగా 5 మిలియన్​ డాలర్లు(మన రూపాయల్లో 36 కోట్ల పైమాటే) లులూకు ఇచ్చిండు. దీంతో ఎనిమిదేళ్ల వయసున్న ఆ కుక్క ఇప్పుడు ప్రపంచంలోనే రిచ్చెస్ట్​ డాగ్ అయింది. అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రం నాష్​విల్లేకు చెందిన బిల్​ డోరిస్​ బిజినెస్​ చేసి మస్తు సంపాయించిండు. కారణం తెల్వది కానీ పెళ్లి మాత్రం చేసుకోలే. తనకు తోడుగా ఓ కుక్కను తెచ్చుకుని, లులూ అని పేరుపెట్టి పెంచుకున్నడు. తన బిడ్డ లెక్క దానిని అపురూపంగా చూసుకున్నడు. అయితే, కిందటేడాది అనారోగ్యంతో డోరిస్​ చనిపోయిండు. తను పోయినంక లులూకు ఇబ్బంది కలగొద్దని ఆస్తినంతా దానికే చెందేలా వీలునామా రాసిండు. ఓ ట్రస్టు ఏర్పాటు చేసి, తన దోస్తు మార్తా బర్టన్ ను దానికి చైర్మన్​గా వ్యవహరించాలని అందులో పేర్కొన్నడు. లులూకు అవసరమైన తిండి, ఇతరత్రా అవసరాల కోసం ట్రస్టు నిధులను వాడాలని వివరంగా చెప్పిండు. ఇటీవల డోరిస్​ పర్సనల్​ లాయర్​ వచ్చి ఆ వీలునామాను మార్తాకు అందజేశాడు. దీనిపై మార్తా స్పందిస్తూ.. లులూను డోరిస్​ ఎంతో ప్రేమగా చూసుకునేవాడని, వేరే ఊరు వెళ్లాల్సి వస్తే తన దగ్గర వదిలేసి వెళ్లేవాడని చెప్పారు. అయితే, 5 మిలియన్​ డాలర్లు ఆ కుక్క ఖర్చు పెడుతుందా అంటే.. ఖర్చు చేసేందుకు ప్రయత్నిస్తామని మార్తా చెప్పారు