
చంద్రగ్రహణం కారణంగా మూత పడ్డ తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. సంపూర్ణ చంద్రగ్రహణం తర్వాత సోమవారం (సెప్టెంబర్ 08) ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు తెరిచారు. చంద్రగ్రహణం అనంతరం ఆలయ శుద్ది చేసిన అర్చకులు.. తెల్లవారుజామున ఏకాంతంగా సుప్రభాతం నిర్వహించారు.
సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నందున శ్రీవారి ఆలయ తలుపులు శనివారం (సెప్టెంబర్ 06) మధ్యాహ్నం 3.30 గంటలకు మూసి వేశారు. సుమారు 12 గంటల అనంతరం ఆలయంలో శుద్ది, పుణ్యహవచనం అనంతరం పూజా కైంకర్యాలు నిర్వహించారు. ఆ తర్వాత ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తోంది టీటీడీ.
ఉచిత సర్వదర్శనం భక్తులను ఉదయం 6 గంటల నుండి క్యూలైన్లలోకి అనుమతించి దర్శనం కల్పిస్తోంది టీటీడీ. చంద్రగ్రహణం కారణంగా సుమారు 15 గంటల పాటు భక్తుల దర్శనాలు రద్దయ్యాయి. ఇక ఇవ్వాళ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ.
ప్రపంచ వ్యాప్తంగా కనువిందు చేసిన గ్రహణం:
ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ చంద్ర గ్రహణం కనువిందు చేసింది. ఇండియన్ టైమ్ ప్రకారం ఆదివారం రాత్రి 9.56 గంటలకు మొదలైన గ్రహణం అర్ధరాత్రి 1.26 గంటల వరకు కొనసాగింది. గ్రహణం సంపూర్ణ స్థాయి రాత్రి 11.01 గంటల నుంచి మొదలై 12.23 గంటల వరకు 82 నిమిషాలపాటు కనిపించింది. హైదరాబాద్ తోపాటు దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా, బెంగళూరు, జైపూర్, అహ్మదాబాద్, లక్నో, తదితర అన్ని ప్రాంతాల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం కనిపించగా, అనేక చోట్ల పున్నమి చంద్రుడు ఎరుపు రంగు పులుముకున్న ‘బ్లడ్ మూన్’లా కనువిందు చేశాడు.
ప్రపంచవ్యాప్తంగా ఉత్తర అమెరికాతోపాటు దక్షిణ అమెరికాలోని చాలా ప్రాంతాలు మినహాయిస్తే.. ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85 శాతం మంది నివసిస్తున్న ప్రాంతాల్లో ఈ చంద్ర గ్రహణం కనిపించింది. అయితే, ఉత్తర అమెరికాతోపాటు దక్షిణ అమెరికాలోని చాలా ప్రాంతాల్లో పగటి సమయం కావడంతో అక్కడి వారికి ఈసారి సంపూర్ణ చంద్ర గ్రహణం చూసే అవకాశం దక్కలేదు.
ఇక చంద్ర గ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం నుంచే దేశవ్యాప్తంగా ఆలయాలన్నీ మూతపడ్డాయి. గయలోని విష్ణుపాద టెంపుల్, ఉజ్జయినిలోని మహాకాలేశ్వర్ టెంపుల్, ఏపీలోని శ్రీకాళహస్తి టెంపుల్ మాత్రం తెరిచే ఉంచి, ప్రత్యేక పూజలు, క్రతువులు నిర్వహించారు. మూతపడిన ఆలయాలన్నీ సోమవారం తెల్లవారిన తర్వాతే తిరిగి తెరుచుకోనున్నాయి. కాగా, ఇది ఈ ఏడాది ఏర్పడిన రెండో చంద్ర గ్రహణం.