‘డబుల్’ నిర్మాణాల్లో ట్రబుల్స్

‘డబుల్’ నిర్మాణాల్లో ట్రబుల్స్

‘డబుల్’ నిర్మాణాల్లో ట్రబుల్స్
భారీగా పెరిగిన కన్ స్ట్రక్షన్ విలువ
డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించలేక చేతులెత్తేస్తున్న కాంట్రాక్టర్లు
గడవులోగా పూర్తి చేయడం కష్టమే

మహబూబాబాద్, వెలుగు : ఎనిమిదేండ్లుగా పేదలను ఊరిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పట్లో పూర్తయ్యేలా లేవు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించడంలో ప్రభుత్వం విఫలం అయింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇల్లు కట్టుకునేందుకు రూ.3లక్షలు ఇస్తామని సర్కారు చెప్పింది. అయితే ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వాటిని జనవరిలోగా పూర్తి చేసి, లబ్ధిదారులకు అందజేస్తామని పేర్కొంది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే పనులు ఆపేసిన కాంట్రాక్టర్లు.. ఆయా పనులు మొదలుపెట్టేందుకు జంకుతున్నారు. నిర్మాణ వ్యయం భారీగా పెరగడంతో ఇండ్లు కట్టలేమని చెబుతున్నారు.

ఆకాశంలో ధరలు..

ఇటీవల నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగాయి. ప్రస్తుతం సిమెంట్ రేటు బహిరంగ మార్కెట్ లో రూ.330 వరకు ఉంది. దీంతో గతంలో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ప్రకారం..  సిమెంట్ కంపెనీలు రూ.240 చొప్పున సరఫరా చేయడం లేదు. ఇక ఐరన్ క్వింటాలుకు బయటి మార్కెట్ లో రూ.6,200 ఉండగా... ప్రభుత్వం మాత్రం రూ.4,600 చెల్లిస్తోంది. మార్కెట్ కు తగ్గట్టుగా రేట్లు సవరించకపోవడంతో కాంట్రాక్టర్లు ఇండ్ల నిర్మాణాలకు ముందుకురావడం లేదు. మరోవైపు డబుల్ బెడ్ రూం ఇండ్లకు ఇసుక కూపన్లు కూడా ప్రభుత్వం రిలీజ్ చేయడం లేదు.

సంక్రాంతికి కష్టమే..

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతిలోగా పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తి చేయాలని ఆదేశించింది. కానీ ఎక్కడా పనులు మాత్రం మొదలు కాలేదు. ఒక్కో ఇంటికి రూ.50వేల వరకు వ్యయం పెరుగుతండడంతో వీటిని పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం కూడా నిర్మాణ వ్యయాన్ని పెంచడం లేదు. దీంతో ఇండ్ల నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పెండింగ్ బిల్లుల చెల్లింపులోనూ సర్కారు నిర్లక్ష్యం వహిస్తుండడంతో కాంట్రాక్టర్లలో నైరాశ్యం నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆశించిన స్థాయిలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు.  అనుకున్న టార్గెట్ లో 20 శాతం కూడా ఇండ్లు కట్టలేదు.

నష్టం జరగకుండా చూడాలి

పెరిగిన రేట్లతో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టలేకపోతున్నం. డీడీలు తీసినా సర్కారు నుంచి సిమెంట్ రావడం లేదు. ఐరన్ రేటు కూడా పెరిగింది. ఇసుక కూపన్లు ఇవ్వడం లేదు. ఇట్ల ఉంటే ఎలా పూర్తి చేయాలి? ఆఫీసర్లకు మా బాధలు చెప్తే పట్టించుకోవడం లేదు. ఒప్పందం ప్రకారం పూర్తి చేయాలని ఒత్తిడి చేస్తున్నారు.

- యుగేందర్, డబుల్ బెడ్ రూం ఇండ్ల కాంట్రాక్టర్