మునుగోడులో జరగబోయేది ధర్మయుద్ధం

మునుగోడులో జరగబోయేది ధర్మయుద్ధం

చౌటుప్పల్/ మునుగోడు, వెలుగు: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే అవకాశం మునుగోడు ప్రజలకు వచ్చిందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి అన్నారు. మునుగోడులో జరగబోయేది ధర్మయుద్ధమని పేర్కొన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని ఎస్ లింగోటం గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణకు హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​తో కలిసి ఆయన హాజరయ్యారు. వివిధ గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు బీజేపీలో చేరారు. కోమటి రెడ్డి రాజగోపాల్​రెడ్డి మాట్లాడుతూ.. ఏ గ్రామంలోకి వెళ్లినా పార్టీలకు అతీతంగా జనం బీజేపీకి జై కొడుతున్నారని తెలిపారు. టీఆర్​ఎస్​ పతనం మునుగోడు నుంచే మొదలవుతుందని పేర్కొన్నారు. మునుగోడు అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, ఈ  ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలను మార్చేస్తుందని ఆయన అన్నారు.

ఇంటెలిజెన్స్ తో గ్రామాల్లో సర్వేలు

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ వాటిపైన బతుకుతున్న పార్టీ టీఆర్ఎస్​ అని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఛీత్కరిస్తున్న పార్టీ, ఆరిపోయే పార్టీ ఏదైనా ఉంది అంటే అది టీఆర్ఎస్ మాత్రమేనని ఆయన అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని చెప్పారు.  ఎక్కడ ఉప ఎన్నిక  జరిగినా ఇంటెలిజెన్స్ పోలీసులను టీఆర్​ఎస్​ దించి ప్రతి గ్రామంలో సర్వేలు చేయించి ప్రతి కుటుంబం తీసుకుంటున్న సంక్షేమ పథకాల వివరాలను సేకరిస్తోందని అన్నారు. ‘‘ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్​లో చేరితే తప్పు లేదు కానీ, టీఆర్ఎస్​ పార్టీ నచ్చక వేరే పార్టీలోకి నాయకులు వెళ్తే మాత్రం తప్పా? వేరే పార్టీలోకి వెళ్లిన నేతల దిష్టిబొమ్మలు దహనం చేస్తూ శవయాత్రలు నిర్వహిస్తూ బెదిరించుడేంది?” అని ఈటల మండిపడ్డారు. హుజూరాబాద్ లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో, మునుగోడులో కూడా అదే తీర్పు పునరావృతం అవుతుందన్నారు. ఉప ఎన్నిక ఉన్నందునే బీజేపీతో టచ్​లో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు ఇంకా పార్టీ మారడం లేదని తెలిపారు. కార్యక్రమాల్లో  మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ మెంబర్, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి పాల్గొన్నారు. బీజేపీలో చేరినవారిలో చౌటుప్పల్ మండలం ధర్మాజీ గూడెం టీఆర్ఎస్ సర్పంచ్, మునుగోడు మండలంలోని కల్వకుంట్ల గ్రామానికి చెందిన సీపీఎం సర్పంచ్ తదితరులు ఉన్నారు. కాగా, చౌటుప్పల్ కేంద్రంలో జరిగిన ముదిరాజ్​ల ఆత్మీయ సమ్మేళనానికి ఈటల రాజేందర్​ హాజరయ్యారు.