అన్​లాక్​ తప్పలే..ఇంకొన్నాళ్లు లాక్ డౌన్ ఉంటే ఎకానమీ మరింత పతనం

అన్​లాక్​ తప్పలే..ఇంకొన్నాళ్లు లాక్ డౌన్ ఉంటే ఎకానమీ మరింత పతనం

న్యూఢిల్లీవేసిన తాళాలను నిమ్మలంగా తెరుస్తోంది కేంద్ర సర్కార్​. లాక్​డౌన్​ను పొడిగిస్తూనే అన్​లాక్​ ప్లాన్లను శనివారం ప్రకటించింది. కొన్ని మినహా అన్ని పనులు చేసుకోవచ్చని చెప్పేసింది. ప్రార్థనా స్థలాలకూ ఓకే అనేసింది. నిజానికి లాక్​డౌన్​ పెట్టినప్పుడు దేశంలో ఉన్న కరోనా కేసులు 519, మరణాలు 10. కానీ, అన్​లాక్​1 ప్లాన్​ను ప్రకటించిన రోజుకు దేశంలో నమోదైన కేసులు 1.8 లక్షలకుపైనే, మరణాలు 5 వేలకు పైనే. రోజూ నమోదవుతున్న కొత్త కేసులు 8 వేల దాకా ఉంటున్నాయి. మరి, పరిస్థితి ఇంత సీరియస్​గా ఉన్నప్పుడే కఠినంగా ఉండాల్సిందిపోయి కేంద్ర ప్రభుత్వం ఎందుకు తాళాలు తెరుస్తోంది? ఇంకొన్ని రోజులు ఆగాల్సిందిపోయి ఎందుకు తొందరపడుతోంది?

లాక్​డౌన్​ను భరించలేం

కేంద్ర సర్కార్​ తొందరపడడంలో తప్పులేదనేది కొందరు నిపుణుల మాట. రెండు నెలలుగా ఉంటున్న లాక్​డౌన్​ను మనం భరించలేని పరిస్థితిలో ఉన్నామంటున్నారు. ‘‘రెండు నెలలుగా లాక్​డౌన్​ అమల్లో ఉంది. ఇన్ని రోజులు మూసేయడమంటే ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా మన దేశం భరించే స్థితిలో లేదు. కాబట్టి లాక్​డౌన్​ ఎత్తేయడానికి ఇదే కరెక్ట్​ టైం’’ అని అంటున్నారు మోడల్స్​ ఆఫ్​ ఇన్​ఫెక్షియస్​ డిసీజెస్​ ప్రొఫెసర్​, రీసెర్చర్​ గౌతమ్​ మీనన్​. లాక్​డౌన్​ పెట్టిన మొదటి రోజు నుంచే చాలా మంది పెద్ద ప్రభావం ప్రారంభమైంది. ముఖ్యంగా వలస కూలీల పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో మనం చూసే ఉంటాం. సప్లై చెయిన్లకు బ్రేకులు పడ్డాయి. కార్ల ఫ్యాక్టరీలు.. పెద్ద పెద్ద షాపింగ్​ మాళ్ల నుంచి ఓ మూలన చిన్న దుకాణాల వరకు మూతపడిపోయాయి. చాలా మంది ఉద్యోగాలు పోయాయ్​. దేశ వృద్ధి రేటు 30 ఏళ్ల తక్కువకు పడిపోయింది. అందుకే లాక్​డౌన్​ను వీలైనంత తొందరగా ఎత్తేయాలని, లేకుంటే మరింత నష్టం తప్పదని ఏప్రిల్​ చివర్లోనే ఆర్బీఐ మాజీ గవర్నర్​ రఘురామ్​ రాజన్​ చెప్పారు. గ్లోబల్​ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సీ కూడా ఇదే చెప్పింది. ఇన్​ఫెక్షన్లను కంట్రోల్​ చేస్తూనే ఎకానమీని సరిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

లాక్​డౌన్​ పర్పస్​ అదే

నిజానికి లాక్​డౌన్​ను పెట్టింది కరోనాను కట్టడి చేయడానికి కాదు.. దానిని లేట్​ చేయడానికి అనే నిపుణులూ లేకపోలేదు. ‘‘లాక్​డౌన్​ అనేది కరోనా ఇన్​ఫెక్షన్లను లేట్​ చేయడం కోసం. మహమ్మారిని డీల్​ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాలన్నదే లాక్​డౌన్​ ఉద్దేశం. అన్నీ ఉంటే కేసులు ఎన్ని వచ్చినా హ్యాండిల్​ చేయగలం’’ అని ప్రజారోగ్య నిపుణుడు డాక్టర్​ ఎన్​ దేవదాసన్​ అన్నారు. లాక్​డౌన్​ టైంను ఇండియా బాగానే వాడుకుందని అంటున్నారు. ఆ గ్యాప్​లో స్టేడియాలు, స్కూళ్లు, ట్రెయిన్​ కోచ్​లను క్వారంటైన్​ సెంటర్లుగా మార్చిందని చెప్పారు.ఆస్పత్రుల్లో కరోనా వార్డులను ఏర్పాటు చేయడం, ట్రీట్​మెంట్​కు అవసరమైన వసతులు కల్పించడం, డాక్టర్లు, నర్సులు ఇతర వైద్య సిబ్బందికి పీపీఈ (రక్షణ కవచాలు) కిట్లు సమకూర్చుకోవడం వంటివి చేసిందంటున్నారు. కొన్ని చోట్ల కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వం అవసరమైనంత మేరకు సిద్ధమైందన్న మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఇక జనం భుజాలపైనే

అన్నింటినీ అంచనా వేసిన కేంద్రం​.. లాక్​డౌన్​ ఎత్తేయకపోతే చాలా కష్టమని భావించి లాకులు ఓపెన్​ చేసేస్తోంది. అయితే, అన్ని అధికారాలను మాత్రం రాష్ట్రాలకే వదిలేసింది. స్థానిక పరిస్థితులకు తగ్గట్టు లాక్​డౌన్​ రూల్స్​ పెట్టుకోవచ్చని సూచించింది. ప్రభుత్వాలు సడలింపులు ఇచ్చాయి కదా అని జనాలూ నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా ఉండడానికి లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మరింత బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా ముప్పు మోసుకొచ్చినట్టే అవుతుందని చెబుతున్నారు. మాస్కులు పెట్టుకుంటూ, సోషల్​ డిస్టెన్స్​ పాటిస్తూ, చేతులు కడుగుతూ జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అది ఎంత వరకు సాధ్యమవుతుందన్నదే ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న!!!

హెర్డ్​ ఇమ్యూనిటీ.. డెత్​రేట్​, రికవరీ రేట్​

హెర్డ్​ ఇమ్యూనిటీ.. బాగా వినిపిస్తున్న పదం ఇది. అంటే జనమందరికీ కరోనాను తట్టుకుని నిలబడే శక్తి రావడం. చాలా దేశాలు దాని బాట పట్టాయి. స్వీడన్​ దీని మీద ప్రయోగం కూడా చేసింది. లాక్​డౌన్​ లేకుండానే ఇన్నాళ్లూ నెట్టుకొచ్చింది. ఆ దేశ చర్యలపై విమర్శలు కూడా వచ్చాయి. కానీ, ఇదంతా హెర్డ్​ ఇమ్యూనిటీ కోసమేనని ప్రకటించింది ఆ దేశం. దానికి సంబంధించి ఫస్ట్​ రిజల్ట్స్​నూ రెండు రోజుల క్రితమే విడుదల చేసింది. అందులో ఏప్రిల్​ చివరి నాటికి దాదాపు 7.3 శాతం మందికి కరోనా యాంటీబాడీలు డెవలప్​ అయినట్టు గుర్తించింది. చాలా దేశాలూ ఆ ఫార్ములాను ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు మన దేశంలోనూ ఆ హెర్డ్​ ఇమ్యూనిటీ కోసమే అన్​లాక్​ చేస్తున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. దానిపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు. దేశంలో కరోనా మరణాల రేటు తక్కువగా ఉండడమూ అడ్వాంటేజ్​ అని నిపుణులు చెబుతున్నారు. కేసులు ఎక్కువగా ఉన్న మరణాల రేటు మాత్రం 3 శాతం కన్నా తక్కువగానే ఉంది. కరోనా నుంచి కోలుకుంటున్నోళ్ల సంఖ్య కూడా రోజూ పెరుగుతోంది. దేశంలో రికవరీ రేట్​ దాదాపు 48 శాతం ఉంది. ప్రపంచ సగటుతో పోలిస్తే ఆ రెండింట్లో ఇండియా మెరుగ్గా ఉంది. అన్​లాక్​ చేయడానికి ఆ రెండూ కారణాలేనంటున్నారు కొందరు నిపుణులు. మరోవైపు ఈ రెండు నెలల లాక్​డౌన్​ టైంలో ఇళ్లలో చిన్న చిన్న తగాథాలూ జరిగాయి. గృహ హింస కేసులు పెరిగాయి. మామూలు టైంతో పోలిస్తే ఎక్కువ గృహ హింస కేసులు నమోదయ్యాయి.

దేశంలో ఒక్కరోజే 8677 కేసులు..221 మంది మృతి