- ఆప్షన్లు ఇచ్చేందుకు ఏప్రిల్ 15 వరకు గడువు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీ లో ఎలక్ట్రిక్ బస్సులు పెరుగుతుండడంతో ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్‌లు, హెల్పర్లు, శ్రామికులకు కష్టాలు మొదలయ్యాయి. కండక్టర్లు మినహా మిగతా ఉద్యోగులందరూ ఈవీ సంస్థ నుంచే ఉంటున్నారు. దీంతో ఆర్టీసీ కార్మికులకు పని లేకుండా పోతోంది.
ఈ నేపథ్యంలో సిటీ ఆర్టీసీ పరిధిలో పని చేస్తున్న కార్మికులందరికీ వారి విద్యార్హతల ఆధారంగా కండక్టర్లుగా అవకాశం కల్పించాలని యాజమాన్యం నిర్ణయించింది. మిగిలినవారు హైదరాబాద్ వదిలి వేరే జోన్లో ఉద్యోగాలు కొనసాగించవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్ 15వ తేదీలోగా కార్మికులు తమ నిర్ణయాన్ని తెలియజేస్తూ అధికారులకు లేఖలు సమర్పించాలని స్పష్టంచేసింది.
- ఆందోళనలో 8 వేల మంది కార్మికులు
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 300 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. రాబోయే రెండేండ్లలో దశలవారీగా మరో 2,500 బస్సులు వస్తాయని యాజమాన్యం చెబుతోంది. ఆర్టీసీ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం 8 వేల మంది డ్రైవర్లు, మెకానిక్‌లు, హెల్పర్లు, శ్రామికులు పనిచేస్తున్నారు.
ఇంత మందిని ఒక్కసారిగా ఆప్షన్లు పెట్టుకోమని యాజమాన్యం ఆదేశించడంతో కార్మికులు గందరగోళంలో పడ్డారు. పదో తరగతి లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉన్నవారికి ఇక్కడే కండక్టర్లుగా ఆప్షన్ఇచ్చే అవకాశం ఉంది. అంతకన్నా తక్కువ విద్యార్హత ఉన్న కార్మికుల పరిస్థితి మాత్రం గందరగోళంగా మారింది. వారు హైదరాబాద్ జోన్ వదిలి కరీంనగర్ జోన్ పరిధిలోకి మారాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ కార్మికులంతా హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాలవారే. దశాబ్దాలుగా తమ కుటుంబాలతో హైదరాబాద్లో నివాసముంటున్నారు.
ఇప్పటికిప్పుడు కరీంనగర్ జోన్లోకి మారాలంటే కష్టాలు తప్పవని వాపోతున్నారు. మరోవైపు దశలవారీగా వచ్చే బస్సుల కోసం అందరి నుంచి ఒక్కసారే ఆప్షన్లు ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని కార్మికులు అంటున్నారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలపై నిషేధం ఉండడంతో వీరి తరుపున మాట్లాడే వాయిస్ లేకుండా పోయింది.
