ఒమిక్రాన్ ప్రభావం దేశంలో తక్కువే

ఒమిక్రాన్ ప్రభావం దేశంలో తక్కువే

ఒమిక్రాన్ బుగులు పుట్టిస్తున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒమిక్రాన్ ప్రభావం దేశంలో తక్కువగానే ఉంటుందని కేంద్రం ప్రకటించింది. డెల్టా వేరియంట్ వ్యాప్తి వల్ల చాలా మందికి యాంటీబాడీలు ఏర్పడ్డాయని, దీనికి తోడు వ్యాక్సిన్ స్పీడప్ చేసినందుకు కొత్త వేరియంట్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అంచనా వేస్తోంది. అయినా ప్రతి ఒక్కరు మాస్కులు పెట్టుకోవాలని.. కరోనా రూల్స్ పాటించాలని సూచిస్తోంది. మరోవైపు దేశంలో 40 ఏండ్లు..ఆపై వయసున్న వాళ్లు బూస్టర్ డోస్ టీకాలు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని కేంద్రానికి.. ఇండియన్ సార్స్ కరోనా వైరస్ 2 జీనోమిక్స్ కన్సార్షియం సిఫార్సు చేసింది. శాస్త్రవేత్తల సిఫార్సును బట్టి బూస్టర్ డోస్ పై నిర్ణయం తీసుకుంటామని కేంద్రం తెలిపింది.

సౌతాఫ్రికాతో పాటు ఇతర దేశాల్లో ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలకు ఈ వేరియంట్ శరవేగంగా విస్తరిస్తోంది. భారత్ లోనూ రోజురోజుకు ఒమిక్రాన్ అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. విదేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్ పోర్టుల్లో విస్తృత పరీక్షలు చేస్తున్నారు.. లక్షణాలు ఉంటే క్వారంటైన్ లో ఉంచి.. జీనోమ్ సీక్వెన్స్ కోసం ల్యాబ్ కు పంపుతున్నారు. ఇప్పటి వరకు ఢిల్లీలో ఒమిక్రాన్ అనుమానిత కేసులు 12కు చేరాయి. వీళ్లందరి శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్స్ కు పంపించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కర్ణాటకలో రెండు ఒమిక్రాన్  కేసులు ఉన్నాయి.