
ఎన్నికల అధికారులపై దాడి
ఈవీఎంలు, వీవీప్యాట్లు ధ్వంసం
23 మంది అరెస్ట్.. విజయపుర జిల్లాలో ఘటన
విజయపుర (కర్నాటక) : విజయపుర జిల్లా బసవన బాగేవాడి మండలంలోని మసబినాల్ గ్రామస్తులు ఎలక్షన్ అధికారులపై దాడి చేశారని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రెండు ఈవీఎంలు, మూడు వీవీప్యాట్(ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్)లు పగులగొట్టారని తెలిపింది. ఈవీఎంలు, వీవీప్యాట్లు మారుస్తున్నారనే పుకార్లు రావడంతో సెక్టార్ ఆఫీసర్ల వెహికల్‌ను గ్రామస్తులు అడ్డుకున్నారని వివరించింది. అధికారులతో గ్రామస్తులు గొడవకు దిగారని, వెహికల్లో ఉన్న మిషన్లను బయటపడేసి ధ్వంసం చేశారని ఈసీ ప్రకటించింది.
అడ్డొచ్చిన అధికారులపై కూడా అటాక్ చేసినట్లు వెల్లడించింది. విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా స్థాయి అధికారులను మసబినాల్ గ్రామానికి పంపినట్లు ఈసీ తెలిపింది. ఈవీఎంలు, వీవీప్యాట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారులపై దాడి చేసిన 23 మందిని అరెస్ట్ చేశారని వివరించారు. మిషన్లు మారుస్తున్నారనే పుకార్లు వ్యాప్తికి కారణమైన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఈసీ వెల్లడించింది.