ఉచిత పోలీస్ ​శిక్షణ అర్హత పరీక్షకు స్పందన

ఉచిత పోలీస్ ​శిక్షణ అర్హత పరీక్షకు స్పందన

హైదరాబాద్, వెలుగు: పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఆదివారం నిర్వహించిన అర్హత పరీక్షకు మంచి స్పందన వచ్చింది. కొత్తపేటలోని పనినీయ ఇనిస్టిట్యూట్ఆఫ్ డెంటల్ సైన్స్ హాస్పిటల్​కేంద్రంలో నిర్వహించిన పరీక్షకు దాదాపు 3 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాన్ని ఫౌండేషన్ సలహాదారు, డీసీపీ పరవస్తు మధుకర్ స్వామి పరిశీలించారు. ఫౌండేషన్ కార్యదర్శులు సందీప్ హరి, గద్దె భాస్కర్​మాట్లాడుతూ.. సోమవారం ఫలితాలు, సెలక్షన్ జాబితాను విడుదల చేస్తామన్నారు. అలాగే 3వ తేదీన ఎంపిక చేసిన అభ్యర్థులు వంటిమామిడిలోని శిక్షణా కేంద్రంలో రిపోర్ట్ చేయాలన్నారు. అర్హత సాధించిన వారికి ఉచిత వసతి, భోజన సదుపాయం, డ్రస్, స్టడీ మెటీరియల్ అందజేస్తామన్నారు. మరో 500 మందికి ఆన్​లైన్​లో ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గ్రీన్‌‌ ల్యాండ్స్ అధ్యక్షురాలు లక్ష్మీకుమారి, కార్యదర్శి గురుసేవ, బంజారాహిల్స్ లయన్ క్లబ్ గ్రేటర్ అధ్యక్షుడు ఉపేందర్, పరవస్తు ఫౌండేషన్ సభ్యులు వలీ, భవాని, శ్రీలత, రఘునందన్ పాల్గొన్నారు.