న్యూఢిల్లీ: ఇరాన్‌లో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నామని అక్కడి నుంచి వచ్చిన మనోళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దేశంలో అనుక్షణం భయంభయంగా బతికామని వాపోయారు. ‘‘ఇరాన్ అంతటా తీవ్రమైన ఆందోళనలు జరుగుతున్నాయి. అడుగు బయటపెట్టే పరిస్థితి లేక.. వారాలకొద్దీ ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంటర్నెట్ కూడా అందుబాటులో లేకపోవడంతో బయట ఏం జరుగుతుందో తెలిసేది కాదు. మా కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడే అవకాశం కూడా లేకపోయింది. అసలు అక్కడి నుంచి బయటపడతామా? లేదా? అని భయమేసింది” అని కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇంటర్నెట్ సేవలను కొంతమేరకు పునరుద్ధరించడంతో ఇండియన్ ఎంబసీని కాంటాక్ట్ కాగలిగామని, వాళ్లు తమకు అనునిత్యం అండగా నిలిచారని చెప్పారు. ఎంబసీ సహకారంతో ఇరాన్ నుంచి బయటపడ్డామని, తమ కుటుంబసభ్యులను కలుసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇరాన్ నుంచి రెండు కమర్షియల్ ఫ్లైట్లు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. వాటిల్లో మనోళ్లు తిరిగొచ్చారు. అప్పటికే వాళ్ల కుటుంబసభ్యులు పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్టుకు చేరుకుని, తమవాళ్ల కోసం ఎదురుచూశారు. శనివారం తెల్లవారుజామున ఒక్కొక్కరుగా ఎయిర్‌పోర్టు నుంచి బయటకురాగానే కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. తమ వాళ్లను గుండెలకు హత్తుకుని ఆనందబాష్పాలు రాల్చారు.
ఒక్కొక్కరిది ఒక్కో కథ..
పెద్ద గండం నుంచి బయటపడ్డట్టు ఉన్నదని, ఇండియాకు రాగానే ఊపిరి పీల్చుకున్నానని ఓ స్టూడెంట్ తెలిపాడు. ‘‘ఇరాన్‌లో రానురాను ఆందోళనలు తీవ్రమయ్యాయి. వీధుల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇంటర్నెట్ కూడా బంద్ చేశారు. దీంతో మేం రూమ్‌లోనే బందీలుగా మారిపోయాం. మా వాళ్లతో మాట్లాడే మార్గం లేక కుమిలిపోయాం. ఆ దేవుడి దయ వల్ల అక్కడి నుంచి బయటపడ్డాం” అని వాపోయాడు.
ఇండియా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఎంబసీ నుంచి సమాచారం రాగానే ప్రాణం లేచొచ్చినట్టయిందని మరో స్టూడెంట్ చెప్పాడు. ‘‘ఇంటర్నెట్ బంజేయడంతో ఇరాన్‌లో ఉన్న మా అమ్మను కాంటాక్ట్ కాలేకపోయాం. అమ్మ ఎలా ఉందోనని చాలా ఆందోళన చెందాం. ఇంటర్నెట్ పునరుద్ధరించాక ఇండియన్ ఎంబసీ కాంటాక్ట్‌లోకి వచ్చింది. మా అమ్మను సురక్షితంగా పంపిస్తామని భరోసా ఇచ్చింది.
ఎలాంటి అడ్డంకులు లేకుండా అమ్మ తిరిగొచ్చింది” అని అబ్బాస్ అనే వ్యక్తి ఆనందం వ్యక్తం చేశాడు. ‘‘మేం కారులో బయటకు వెళ్లినప్పుడు.. నిరసనకారులు వచ్చి చుట్టుముట్టేవారు.. మమ్మల్ని ఇబ్బందులు పెట్టేవారు. ఇంటర్నెట్ లేకపోవడంతో ఎంబసీని కాంటాక్ట్ కాలేకపోయాం. ఇంట్లో వాళ్లకూ చెప్పలేకపోయాం” అని మరో వ్యక్తి వాపోయాడు. గత కొన్ని రోజులతో పోలిస్తే, ఇరాన్‌లో ఇప్పుడు పరిస్థితులు కొంతమేర మెరుగుపడ్డాయని చెప్పాడు.
ఇరాన్‌లో 9 వేల మంది మనోళ్లు..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. నిరసనలు తీవ్రం కావడంతో ఈ నెల 8 నుంచి ఇంటర్నెట్ సేవలను బంజేశారు. ప్రస్తుతం ఇరాన్‌లో దాదాపు 9 వేల మంది భారతీయులు ఉన్నట్టు కేంద్రం తెలిపింది. వాళ్లను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించింది. టెహ్రాన్‌లోని ఇండియన్ ఎంబసీ.. అక్కడున్న మనోళ్లతో నిత్యం టచ్‌లో ఉంటూ, వాళ్లను ఇండియాకు పంపించేందుకు సహకారం అందిస్తున్నట్లు పేర్కొంది.
