చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఈరోజు గ్రామానికి మృతదేహాలు

చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఈరోజు గ్రామానికి మృతదేహాలు

చిట్యాల, వెలుగు: చత్తీస్ గఢ్​లోని కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో మృతి చెందిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామానికి చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ అలియాస్ మురళి మృతదేహాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. ఆ ఎన్​కౌంటర్​లో 29మంది మావోయిస్టులు చనిపోగా, కాన్కేర్ జిల్లా మావోయిస్ట్ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న సుధాకర్ తో పాటు, అతడి భార్య రజిత అలియాస్ సుమన కూడా అందులో ఉన్నారన్న వార్తలు వచ్చాయి. 

స్థానిక పోలీసులు సుధాకర్ మృతిని అధికారికంగా ధ్రువీకరించకపోవడంతో..ఎన్​కౌంటర్​లో సుధాకర్ లేడనే ఆశ కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఉన్నారు. అయితే, బుధవారం రాత్రి సుధాకర్ కుటుంబసభ్యులు, గ్రామస్తులు కొందరు కాంకేర్ బయలుదేరి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం అక్కడికి చేరుకున్న తర్వాత, సుధాకర్ ముక్కుకు ఉన్న రంధ్రం, ఇతర ఆనవాళ్ల ఆధారంగా మృతదేహం సుధాకర్ దేనని గుర్తించారు. దీంతో ఎక్కడో మినుకుమినుకు మంటున్న ఆశలు ఆవిరయ్యాయి. పోస్టుమార్టం, ఇతర ఫార్మాలిటీస్​ముగిసిన తర్వాత సుధాకర్ మృతదేహాన్ని చల్లగరిగకు తరలిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున మృతదేహం స్వగ్రామానికి చేరుకోనుంది. సుధాకర్ భార్య రజిత మృతదేహాన్ని కూడా చల్లగరిగకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

 ముగిసిన ఉద్యమ ప్రస్థానం

మావోయిస్టు నేత సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ అలియాస్ మురళి 25 ఏండ్ల ఉద్యమ ప్రస్థానం కాంకేర్ అడవుల్లో జరిగిన ఎన్​కౌంటర్​తో ముగిసింది. సిరిపెల్లి ఓదెలు, రాజ పోచమ్మ దంపతులకు ఇద్దరు బిడ్డలతో పాటు కొడుకు సుధాకర్ ఉన్నాడు. సుధాకర్ చిన్నమ్మ కొడుకు కలికోట శంకర్ కూడా పీపుల్స్ వార్​లో పని చేస్తూ1996లో భూపాలపల్లిలో జరిగిన ఎన్​కౌంటర్​లో చనిపోయాడు. ఆయన స్ఫూర్తితో సుధాకర్ 15 ఏండ్ల వయసులో తన ఫ్రెండ్​రౌతు విజేందర్​తో కలిసి పీపుల్స్ వార్ పార్టీలో చేరిన సుధాకర్​సానుభూతిపరుడిగా, మిలిటెంట్ గా పని చేశాడు. 

నిజామాబాద్ ఏరియాలో దళసభ్యుడిగా మొదలుపెట్టి దండకారణ్యం బస్తర్ కమిటీలో కీలక నేత వరకు ఎదిగాడు. సుధాకర్ కొరకరాని కొయ్యగా తయారు కావడంతో అక్కడి ప్రభుత్వం అతడిపై రూ.25లక్షల రివార్డు ప్రకటించింది. బతికినంత కాలం ఉద్యమం, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన సుధాకర్ ఇంటి వైపు కన్నెత్తి చూడలేదు. సుధాకర్ తండ్రి, చిన్న చెల్లెలు 15 ఏండ్ల క్రితమే చనిపోయారు. అతడి మిత్రుడు రౌతు విజేందర్ అలియాస్ శ్రీకాంత్ అలియాస్ శ్రీను ఐదేండ్ల క్రితం గడ్చిరౌలిలో జరిగిన ఎన్​కౌంటర్​లో చనిపోగా, సుధాకర్ మృతితో చల్లగరిగ గ్రామానికి ఉన్న మావోయిస్టు ఉద్యమశకం ముగిసింది.