- దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేలా కాంగ్రెస్ తుక్కుగూడ సభ
- ఈ సభలోనే మేనిఫెస్టో విడుదల చేయనున్న పార్టీ
హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ పదేండ్ల నియంతృత్వ, దుష్పరిపాలనకు తెరదించి.. దేశంలో ప్రజాస్వామ్య వాతావరణాన్ని పునరుద్ధరించేందుకు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ సభను కాంగ్రెస్ వేదికగా మార్చనుంది. తాము అధికారంలోకి వస్తే దేశ ప్రజలకు ఏం చేయబోతున్నామో తెలియజేసే మేనిఫెస్టోను ఇక్కడి నుంచే విడుదల చేయనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినట్టుగానే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ జైత్ర యాత్రను కొనసాగించాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను, 14 స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, 30 వేల ఉద్యోగ నియామకాలు, 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు జమతో పాటు ఇతర అనేక కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి రెస్సాన్స్ వచ్చిందని పార్టీ నేతలు చెబుతున్నారు.
వీటి గురించి తుక్కుగూడ సభలో దేశ ప్రజలకు కాంగ్రెస్ అగ్ర నాయకత్వం వివరించనుంది. తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న ఈ పథకాలు, ఆరు గ్యారంటీల తరహాలోనే తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏం చేయనున్నామో చెప్పనుంది. గతేడాది సెప్టెంబర్ 17న ఇదే తుక్కుగూడలో విజయభేరి నిర్వహించి అప్పుడు చెప్పిన ప్రతి మాటను అధికారంలోకి వచ్చాక నెరవేర్చామని, అలాగే, కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని కాంగ్రెస్ అధిష్టానం చెప్పనుంది. కాగా, 10 లక్షల మందితో నిర్వహించనున్న ఈ జన జాతర సభను సక్సెస్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కృషి చేస్తున్నారు