అసాంజేను అమెరికాకు అప్పగించండి

అసాంజేను అమెరికాకు అప్పగించండి


యూకే కోర్టు తీర్పు.. తుది నిర్ణయం ఇంటీరియర్ మినిస్ట్రీదే
    వికీలీక్స్ తో యూఎస్ ప్రభుత్వాన్ని వణికించిన అసాంజే
    రెండేండ్లుగా బెల్ మార్ష్ జైల్లో

లండన్: వికీలీక్స్ ఎడిటర్ జూలియన్ అసాంజేను అమెరికాకు అప్పగించే ప్రక్రియ చివరి దశకు చేరుకున్నది. అతడిని యూఎస్ ప్రభుత్వానికి అప్పగించాలని లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. అయితే ఈ విషయలో తుది నిర్ణయం తీసుకునే అధికారం ఇంటీరియర్ మినిస్ట్రీకి ఇస్తున్నట్లు కోర్టు పేర్కొంది. అయితే, అసాంజేకు న్యాయపరమైన అవకాశాలు మూసుకొని పోలేదని అసాంజే తరపు లాయర్లు అంటున్నారు. హోం సెక్రటరీ ప్రీతీ పటేల్ తుది నిర్ణయం తీసుకునే ముందు అసాంజే లాయర్లు దీనిపై కౌంటర్ దాఖలు చేసుకోవడానికి 4 వారాల గడువు ఉందన్నారు. అంతేకాకుండా హై కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశమూ ఉందని అసాంజే లాయర్ మార్క్ సమ్మర్స్ తెలిపారు. యూఎస్ ప్రభుత్వానికి అసాంజేను అప్పగించవచ్చని కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ యూకే సుప్రీంకోర్టులో అసాంజే గత నెల పిటిషన్ దాఖలు చేశాడు. దీనిని సుప్రీం కోర్టు కొట్టేసింది. 

వికీలీక్స్​తో సంచలనం..

ఆస్ట్రేలియాకు చెందిన అసాంజే 2006లో వికీలీక్స్ ప్రారంభించాడు. యూఎస్ ఆర్మీ ఇంటిలిజెన్స్ అనలిస్ట్ చెల్సియా మానింగ్ ఇచ్చిన సీక్రెట్ డాక్యుమెంట్స్ ను 2010లో వికీలీక్స్ వెబ్​సైట్​లో అప్ లోడ్ చేశాడు. బాద్గాద్​పై దాడి, అఫ్గానిస్తాన్​పై యుద్దం, ఇరాక్ యుద్దానికి సంబంధించి వేలాది అమెరికన్ సీక్రెట్ డాక్యుమెంట్స్​తో పాటు యూఎస్ డిప్లమాటిక్ సీక్రెట్ మెసేజెస్ కూడా వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచాడు. దీంతో అమెరికా ప్రభుత్వం అసాంజేపై 17 కేసులు పెట్టింది. అప్పటికే స్వీడన్ పారిపోయిన అసాంజే రెండేళ్లు అక్కడే ఉన్నాడు.

ఎంబసీలోని ఓ చిన్న గదిలో ఏడేండ్లు నివాసం..

బ్రిటన్ ప్రభుత్వం తనను తిరిగి స్వీడన్​కు అప్పగిస్తుందనే భయంతో ఒక రోజు కొరియర్ బాయ్ లాగ మోటార్ సైకిల్​పై ఈక్వెడార్ ఎంబసీ కి వచ్చాడు. ఆఫీసులోకి వెళ్లి తనకు ఆశ్రయం ఇవ్వాలని కోరాడు. ఈ విషయాన్ని 2012 జూన్ 19న ఈక్వెడార్ ఫారిన్ మినిస్టర్ రికార్డో పాటినో మీడియాకు వెల్లడించడంతో అసాంజే ఎక్కడ ఉన్నాడో తెలిసింది. ఎంబసీలోని ఒక చిన్న ఇరుకు గదిలో అసాంజే ఏడేండ్లు ఉన్నడు. అయితే ఈక్వెడార్ ప్రభుత్వంపై అమెరికా నుంచి ఒత్తిడి రావడంతో అతడికి ఇచ్చిన రాజకీయ ఆశ్రయాన్ని విరమించింది. దీంతో అసాంజేను 2019లో అరెస్టు చేసి లండన్ లోని బెల్ మార్ష్ జైలులో ఉంచారు. అమెరికా పెట్టిన 17 కేసుల్లో నిందితుడిగా తేలితే అసాంజేకు 175 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని లాయర్లు చెప్తున్నారు.

జైల్లోనే పెండ్లి చేసుకున్నడు

ఈక్వెడార్ ఎంబసీలో ఉన్నప్పుడే స్టెల్లా మోరిస్ అనే లాయర్​తో అసాంజే రిలేషన్​షిప్ పెట్టుకున్నాడు. 2017లో వీరిద్దరికీ ఎంగేజ్ మెంట్ అవగా.. ఆ తర్వాత ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. అయితే 2020లో స్టెల్లా మోరిస్ బయటకు చెప్పే వరకు వీరిద్దరి రిలేషన్ షిప్ గురించి ప్రపంచానికి తెలియలేదు. కోర్టు అనుమతితో బెల్ మార్ష్ జైల్లోనే ఈ ఏడాది మార్చి 23న వీళ్లిద్దరూ పెండ్లి చేసుకున్నారు. అయితే గతంలోనే అసాంజేకు థెరెసా అనే మహిళతో పెండ్లి అయ్యింది. వారికీ 1989లో డేనియల్ అనే కొడుకు పుట్టాడు. అసాంజేకు కొందరు మహిళలతో ఉన్న సీక్రెట్ రిలేషన్​షిప్​వల్ల పలువురు పిల్లలు పుట్టినట్లు అతనితో పని చేసిన డేనియల్ అనే వ్యక్తి వెల్లడించాడు. అసాంజే కూడా తనకు ఫ్రాన్స్ కు చెందిన మహిళతో ఒక కొడుకు పుట్టినట్టు చెప్పాడు. అయితే ఇప్పటికీ అధికారికంగా అసాంజే కొడుకులు, కూతుర్లు 
ఎవరనేది తెలియలేదు.