అగ్రి చట్టాలతో రైతుకు హక్కులొచ్చినయ్​

అగ్రి చట్టాలతో రైతుకు హక్కులొచ్చినయ్​

ఈ రీఫార్మ్స్​తో 10 కోట్ల మంది రైతులకు ప్రయోజనం: కోవింద్
చర్చల తర్వాతే కొత్త చట్టాలను తీసుకొచ్చాం
రిపబ్లిక్ డేని అగౌరవపర్చడం దురదృష్టకరమని కామెంట్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రెసిడెంట్ స్పీచ్
బాయ్​కాట్ చేసిన పలు పార్టీలు
తర్వాత సభలోకి వచ్చి వెల్​లో కాంగ్రెస్, డీఎంకే, లెఫ్ట్ ఆందోళన

న్యూఢిల్లీ: అగ్రి చట్టాల వల్ల రైతులకు కొత్త అవకాశాలు, హక్కులు వచ్చాయని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ చెప్పారు. వ్యవసాయ సంస్కరణల వల్ల రైతులకు గతంలో ఉన్న హక్కులు, సౌకర్యాలు ఏ విధంగానూ ప్రభావితం కాబోవని  చెప్పారు. మూడు చట్టాలతో రైతులను కేంద్రం ఎంపవర్ చేసిందన్నారు. పార్లమెంట్​ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రెండు సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ శుక్రవారం ప్రసంగించారు. కొత్త చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్పందిస్తూ.. అపెక్స్ కోర్టు నిర్ణయం ఏదైనా ప్రభుత్వం శిరసావహిస్తుందని చెప్పారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రీఫార్మ్స్​వల్ల దాదాపు 10 కోట్ల మంది సన్నకారు రైతులకు ప్రయోజనం కలిగిందని చెప్పారు. చర్చల తర్వాతే కొత్త చట్టాలను తెచ్చామని, ఈ సంస్కరణలను గతంలో పలు పార్టీలు సపోర్ట్ చేశాయని చెప్పారు. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.1.13 లక్షల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకి వేశామని రాష్ట్రపతి చెప్పారు.

జాతీయ జెండాకు అవమానం

ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీలో చెలరేగిన హింసను కోవింద్ ఖండించారు. రాజ్యాంగం.. మనకు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును ఇచ్చిందని.. అలాగే చట్టాలు, రూల్స్​ను పాటించాలని చెబుతోందని చెప్పారు. ‘‘ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్​ప్రెషన్​ను మా ప్రభుత్వం గౌరవించింది. శాంతియుతంగా నిరసనలు తెలిపేందుకు అనుమతిచ్చింది. కానీ జాతీయ జెండాను అవమానించడం, రిపబ్లిక్ డేని అగౌరవపరచడం దురదృష్టకరం’’ అని పేర్కొన్నారు. సరిహద్దుల్లో స్టేటస్​ కోను మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలను భద్రతా దళాలు అడ్డుకుంటున్నాయని కొనియాడారు. ఇండియా సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. గల్వాన్​ లోయలో జరిగిన గొడవలో వీరమరణం పొందిన 20 మంది సోల్జర్లకు, కిందటేడాది మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మరో ఆరుగురు ఎంపీలకు నివాళులర్పించారు.

అతిపెద్ద వ్యాక్సినేషన్.. మనకు గర్వకారణం

కరోనాతో పోరాడేందుకు సమయానికి తగ్గట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, లక్షలాది ప్రాణాలను కాపాడిందని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఇండియా నిర్వహిస్తుండటం గర్వకారణమన్నారు. ఇందులో వేస్తున్న 2 వ్యాక్సిన్లు దేశీయంగా తయారయ్యాయని చెప్పారు. కరోనా, వరదలు, భూకంపాలు, తుఫానులు, మిడతల దాడి, బర్డ్ ఫ్లూ.. ఇలా మన దేశం ప్రతి సంక్షోభాన్ని ధైర్యంగా ఎదుర్కొందని చెప్పారు. కరోనా సమయంలోనూ బడ్జెట్ సెషన్ నిర్వహించడాన్ని ప్రస్తావిస్తూ.. ఎలాంటి సవాళ్లయినా సరే ఇండియాను ఆపలేవన్నారు. ఇండియా కలిసికట్టుగా ఉన్నప్పుడల్లా.. అసాధ్యమైన లక్ష్యాలను సాధించిందని చెప్పారు. లక్షలాది కరోనా వ్యాక్సిన్ డోసులను అనేక దేశాలకు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు.

ప్రెసిడెంట్ స్పీచ్ బాయ్​కాట్

ప్రెసిడెంట్ ప్రసంగాన్ని కాంగ్రెస్ సహా 19 పొలిటికల్ పార్టీలు బాయ్​కాట్ చేశాయి. కొత్త అగ్రిచట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న నిరసనలకు మద్దతుగా బహిష్కరించాయి. కోవింద్ ప్రసంగం సందర్భంగా ‘జై జవాన్, జై కిసాన్’ అంటూ కాంగ్రెస్ ఎంపీ రణ్వీత్ సింగ్ బిట్టు నినాదాలు చేశారు. మరింత మంది ప్రతిపక్ష ఎంపీలు కూడా నినాదాలు చేశారు. కాంగ్రెస్, 15 పార్టీలు కలిసి ప్రొటెస్ట్ చేయగా, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ), ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ వేర్వేరుగా నిరసనలు తెలిపాయి. పార్లమెంట్ కాంప్లెక్స్​లోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రొటెస్టు చేశారు. అక్కడే కూర్చుని నిరసనలు తెలిపారు.

ప్రతిపక్షాల తీరు దురదృష్టకరం: బీజేపీ

రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రతిపక్షాలు బాయ్​కాట్ చేయడం దురదృష్టకరమని బీజేపీ కామెంట్ చేసింది. దేశ రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి.. రాజకీయాలకు అతీతమని చెప్పింది. కాంగ్రెస్‌‌ అహంకారమే నిజమైన సమస్య అని ఫైర్ అయింది.

రైతుల పక్షాన నిలబడుతున్నం

ప్రెసిడెంట్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేయడమంటే.. ఆయన్ను అవమానించ డం కాదు. మేం రైతుల పక్షాన నిలబడుతు న్నాం. 3 చట్టాలను రద్దు చేయాలంటున్నం. అందుకోసమే రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్​కాట్ చేసినం. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవా దాలు తెలిపే చర్చలో మేం పాల్గొంటాం.

– కాంగ్రెస్ లీడర్ అధిర్ రంజన్ చౌధరి

లోక్​సభలో ప్రతిపక్షాల నినాదాలు

అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు లోక్​సభలో నినాదాలు చేశారు. కాంగ్రెస్, డీఎంకే, లెఫ్ట్ పార్టీలకు చెందిన లీడర్లు వెల్​లోకి దూసుకెళ్లి నిరసనలు తెలిపారు. శివసేన సభ్యులు తమ సీట్లలోనే కూర్చుని స్లోగన్లు ఇచ్చారు. అగ్రి చట్టాలను రద్దు చేయాలని, నిరసనల సందర్భంగా చనిపోయిన రైతులకు సభలో నివాళులర్పించాలని డిమాండ్ చేశారు.