ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీతో రైతుల్లో ఆందోళన 

ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీతో రైతుల్లో ఆందోళన 

మెదక్/తూప్రాన్, వెలుగు : రెండు రోజుల కింద ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీ కావడంతో మెదక్ ​జిల్లాలోని బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. దశాబ్దాలుగా తమకు జీవనాధారంగా ఉన్న భూములు పోతే తాము బతికేదెట్టా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రిపుల్​ఆర్ సమీపంలో హైదరాబాద్ మెట్రో డెవలప్​మెంట్​అథారిటీ (హెచ్​ఎండీఏ) పరిధిలోని ప్రాంతాల్లో ల్యాండ్​ పూలింగ్​ స్కీం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో గతంలో పేదలకు పంచిన అసైన్​మెంట్, లావణి భూములను స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు చేపట్టింది. 

జిల్లాలో 316 ఎకరాలు.. 

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ పక్క నుంచి రీజినల్​ రింగ్​ రోడ్డు నిర్మాణం జరుగనుంది. ఇస్లాంపూర్​ సమీపంలోని మాసాయిపేట స్టేషన్, తూప్రాన్​ పట్టణ శివారులో ఇంటర్​ చేంజ్ జంక్షన్​ ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో జంక్షన్, ఆర్ఆర్ఆర్​కు సమీపంలో సర్వే నంబర్ 14లో ఉన్న 316 ఎకరాల లావణి పట్టా భూములను ల్యాండ్ పూలింగ్ కోసం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత మార్చి, ఏప్రిల్​ లో రెవెన్యూ ఆఫీసర్లు ఆ భూములను సర్వే చేశారు. 14 సర్వే నంబర్ లో ఏ ఏ రైతుకు, ఎంత భూమి ఉందనేది గుర్తించి ప్రభుత్వానికి రిపోర్ట్ ​పంపారు. ఈ క్రమంలో ల్యాండ్​ పూలింగ్​ కోసం ఆ భూమిని సేకరించనున్నట్టు కలెక్టర్ ఇటీవల ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఆ సర్వే నంబర్ లో భూములు ఉన్న ఇస్లాంపూర్, పలుగుగడ్డ తండా, మాసాయిపేట గ్రామాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ భూములే తమకు ఆధారమని, అందులో పంటలు పండించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, అవి పోతే తాము ఆగమవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఇస్లాంపూర్​ గ్రామ రైతులు గత సోమవారం మెదక్​ కలెక్టరేట్​కు తరలివచ్చి ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు.

కొనుగోలు, అమ్మకాలపై బ్యాన్​ ​

ల్యాండ్ పూలింగ్​ కోసం భూసేకరణ నోటిఫికేషన్​ వెలువడినందున భూసేకరణ చట్టంలోని సెక్షన్​ 11(4) ప్రకారం ప్రతిపాదిత భూమి కొనుగోలు, అమ్మాకాలు, తాకట్టు పెట్టడానికి వీలులేదని నోటిఫికేషన్​లో పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్​ కోసం ప్రతిపాదించిన భూములకు సంబంధించి అభ్యంతరాలు ఉన్నట్టయితే నోటిఫికేషన్​ జారీ అయిన తేదీ నుంచి 60 రోజులలోపు కలెక్టర్​, భూసేకరణ అధికారికి రాత పూర్వకంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. 

మా భూములు మాకే ఉండాలె

నాకు సర్వే నెంబర్​ 14లో రెండకరాల లావాణి భూమి ఉంది. చాలా ఏండ్ల నుంచి ఆ భూమి సాగు చేసుకుంటూ బతుకుతున్నం. ఇప్పుడు ఆ భూమి సర్కారు తీసుకుంటదట. మా తండా రైతులకు సంబంధించి 30 ఎకరాల భూమిదాక పోతుంది. ఈ భూములు పోతే మేం ఎట్ల బతకాలె. మా భూములు మాకే ఉండాలె. పట్టా పాస్​ పుస్తకాలు ఇయ్యాలె.
- తులసీరాం, రైతు, పలుగుడడ్డ తండా, ఇస్లాంపూర్​