నవంబర్ 21న కాదు..20నే ఫిఫా వరల్డ్ కప్ మొదలు

నవంబర్ 21న కాదు..20నే ఫిఫా వరల్డ్ కప్ మొదలు

సాకర్ అభిమానులను ఫిఫా వరల్డ్ కప్ ఒక రోజు ముందుగానే పలకరించనుంది. నవంబర్ 21న మొదలు కావాల్సిన ఫిఫా వరల్డ్ కప్..20 తేదీనే స్టార్ట్ కానుంది. ఈ మేరకు ఫిఫా ప్రకటించింది. 20వ తేదీన ఆతిధ్య ఖతార్ తొలి మ్యాచ్ ఆడుతుందని వెల్లడించింది. ఈక్వెడార్తో ఫస్ట్ మ్యాచ్లో పాల్గొంటుందని పేర్కొంది. ఒక రోజు ముందుగానే సాకర్ ప్రారంభం కానుండటంతో..టోర్నీ సాగే రోజుల సంఖ్య 28 రోజుల నుంచి 29 రోజులకు పెరిగింది. 

ఫిఫా వరల్డ్ కప్ ను ఒక రోజు ముందుకు జరిపేందుకు ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్‌ఫాంటినో,  ఆరు ఖండాంతర సాకర్‌ సమాఖ్యల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. మీటింగ్ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఈ మార్పు వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని వాటిని పరిష్కరిస్తామన్నారు. 

ముందుగా ప్రకటించిన డ్రా ప్రకారం..ఫస్ట్ మ్యాచ్ 21న ప్రారంభం కావాల్సి ఉంది. నెదర్లాండ్స్‌తో సెనెగల్‌, రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో ఇరాన్‌ తలపడాల్సింది. ఖతార్‌-ఈక్వెడార్‌ మధ్య మూడో మ్యాచ్‌కు ముందే ఆరంభ వేడుకలు నిర్వహించాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక రోజు ముందుగానే ఖతార్‌ మ్యాచ్‌  మొదలవుతుంది. 

ఫిఫా నిర్ణయంతో స్పాన్సర్లకు, ఫ్యాన్స్ కు ఇబ్బంది అవుతుందని  మాజీ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ రికార్డో ఫోర్ట్‌ తెలిపాడు. అతిథులను ఆహ్వానించిన స్పాన్సర్లు వాళ్ల కోసం ఆతిథ్యాన్ని కూడా ఏర్పాటు చేశారని... విమాన టికెట్లు, హోటళ్లు ఇప్పటికే బుక్‌ అయ్యాయన్నారు.  మ్యాచ్‌లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక..తాజా నిర్ణయంతో వాటన్నింటినీ మార్చాలంటే ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు.