అవినీతి ఉద్యోగులతో అధికార పార్టీ నేతలకు పొత్తు

అవినీతి ఉద్యోగులతో అధికార పార్టీ నేతలకు పొత్తు

 

  •     గత రెండేండ్లలో 1147 మందిపై  చర్యలకు విజిలెన్స్ సిఫార్సు
  •     పక్కా ఎంక్వైరీ రిపోర్టులు ఇచ్చినా నో యాక్షన్​
  •     అవినీతి ఉద్యోగుల ప్రాసిక్యూషన్ కు సెక్రటేరియట్ ఆఫీసర్ల అడ్డుపుల్ల  
  •     ఏసీబీ కేసుల్లోనూ శిక్షలు పడింది తక్కువే
  •     రెండేండ్లలో 133 ట్రాప్ లు జరిగితే నాలుగు కేసుల్లోనే శిక్ష
  •     అవినీతి ఉద్యోగులతో అధికార పార్టీ నేతలకు పొత్తు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కార్ ఆఫీసుల్లో పైసలు ఇయ్యందే ఫైళ్లు ముందుకు కదుల్తలేవ్​. సంక్షేమ పథకాల పైసలు రావాలన్నా, సర్టిఫికెట్లు, భూమి సర్వే, ప్లాటు రిజిస్ట్రేషన్, కాంట్రాక్టర్లకు బిల్లు మంజూరు, బిల్డింగ్ పర్మిషన్.. ఇట్ల ఏది కావాలన్నా లంచం ఇయ్యాల్సిందే. ప్రజలతో నిత్యం సంబంధముండే కీలక శాఖల్లోని అధికారులు, సిబ్బంది చేయి తడపనిదే ఫైళ్లపై సంతకం పెట్టడం లేదు. బిల్లుల చెల్లింపుల్లో, నిధుల వినియోగంలో పర్సెంటేజీలు ఫిక్స్​చేసి మరీ వసూలు చేస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల మంజూరుకు ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల దాకా వసూలు చేసినట్లు విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి 4 నెలలైనా చర్యలు లేవు. ఉద్యోగుల అవినీతిలో చాలా చోట్ల అధికార పార్టీ నేతల భాగస్వామ్యం ఉండటం వల్లే ప్రభుత్వం సైలెంట్​గా ఉంటోందనే విమర్శలు ఉన్నాయి. 

ఎన్ని రిపోర్టులు ఇచ్చినా..

వివిధ ప్రభుత్వశాఖల్లో అధికారులు, సిబ్బంది అవినీతిని నిరోధించడం, ఫండ్స్ దుర్వినియోగాన్ని అరికట్టడం కోసం తెలంగాణ విజిలెన్స్ కమిషన్ ఎప్పటికప్పుడూ ఎంక్వైరీ చేస్తూ ప్రభుత్వానికి తగు సిఫార్సులు చేస్తుంటుంది. ఏసీబీ కేసులు, పత్రికల్లో వచ్చిన స్టోరీలు, ప్రజల నుంచి నేరుగా అందిన ఫిర్యాదులపై లోతుగా విచారణ జరిపి తదుపరి చర్యల కోసం సర్కార్ కు రిపోర్ట్ ఇస్తుంది. అందులో సదరు ఉద్యోగిపై తీసుకోవాల్సిన చర్యలను కూడా సిఫార్సు చేస్తుంటుంది. ఇలా నిరుడు జనవరి నుంచి సెప్టెంబర్ వరకు వివిధ శాఖల్లో 493 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, 109 మందిని ప్రాసిక్యూట్ చేయాలని, 19 మందిపై సస్పెన్షన్ వేటు వేయాలని రికమెండ్ చేసింది. అలాగే 2020లో 654 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు, 162 మంది ప్రాసిక్యూషన్ కు, 26 మంది సస్పెన్షన్ కు కమిషన్ సిఫార్సు చేసింది. విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నా సర్కార్ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సగానికి పైగా తగ్గిన ఏసీబీ ట్రాప్​లు

రెండేండ్లలో ఏసీబీ ట్రాప్ లు సగానికి పైగా తగ్గాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన అధికారులపై రైడ్స్​ కూడా పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. ఏసీబీ గణాంకాల ప్రకారం 2016లో 89 ఏసీబీ కేసులు నమోదు కాగా, 2017లో 65 ట్రాప్ లు,2018లో 152 ట్రాప్ లు, 2019లో 168 ట్రాప్ లు, 2020లో 65 ట్రాప్ లు, 2021లో 68 ట్రాప్ లు జరిగాయి. అయితే కిందటేడు నలుగురికి మాత్రమే శిక్ష పడినట్లు తెలుస్తోంది.

సెక్రటేరియెట్‌‌లో ఏండ్లకేండ్లు పెండింగ్

పక్క రాష్ట్రం ఏపీలో నెల రోజుల్లోనే ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇస్తుండగా, ఇక్కడ మాత్రం ఐదేండ్లు, పదేండ్లు గడిచినా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఎవరైనా ఒక అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడితే లేదా అక్రమాస్తులు ఉన్నట్లు తేలితే కేసు ఫర్ ప్రాసిక్యూషన్ అంటూ ఆ శాఖ అధికారులు విజిలెన్స్ కమిషన్ కు రాస్తుంటారు. వాళ్లు కూడా కేసు వివరాలు పరిశీలించి ప్రాసిక్యూషన్ చేయమని సర్కార్​కు సిఫార్సు చేస్తారు. విజిలెన్స్ అధికారులే స్వయంగా విచారణ జరిపిన కేసుల్లో శాఖాపరమైన చర్యలు, పెనాల్టీలు, ప్రాసిక్యూషన్, సస్పెన్షన్ లాంటి చర్యలకు రెకమెండ్ చేస్తారు. అంత వరకు బాగానే ఉన్నా, ఫైలు సెక్రటేరియెట్ కు వచ్చాక ఏండ్ల తరబడి పెండింగ్ లో ఉండిపోతోంది. అవినీతి ఉద్యోగులతో సెక్రటేరియెట్ సెక్షన్ అధికారులు, ప్రభుత్వ పెద్దలు లాలూచీ పడుతున్నారనే అనుమానాలు ఉన్నాయని ఎఫ్​జీజీ సెక్రటరీ పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. 

జడ్జి లేని ట్రిబ్యూనల్​కు కేసులు

గతంలో ఏసీబీ కేసులు, విజిలెన్స్ కేసుల విచారణ కోసం  ట్రిబ్యూనల్  ఫర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్​(టీడీపీ) ఉండేది. తీవ్రమైన అవినీతి కేసులను విచారించే ఈ  ట్రిబ్యూనల్  కు  ఓ జడ్జిని నియమించాల్సి ఉంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత  ఈ పోస్టు ఖాళీగానే ఉంది. ఇప్పటికే ఈ  ట్రిబ్యూనల్  లో 1500పైగా కేసులు పెండింగ్ లో ఉన్నట్లు తెలిసింది. ట్రిబ్యూనల్ లో జడ్జి లేకపోయినా ఇప్పటికీ కేసులు పంపుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నిర్ణయంతీసుకోవాలె..

ఏసీబీ, ఇతర అవినీతి కేసుల్లో ఇతర రాష్ట్రాల్లోలాగే నెల రోజుల్లో సర్కార్ నిర్ణయం తీసుకోవాలి. ప్రాసిక్యూషన్ విషయంలో సెక్రటేరియట్ లో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలి. ఐదేండ్లు, పదేండ్లు నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టడం సరికాదు. సదరు అవినీతి అధికారులు రిటైర్​ అయ్యాక.. రిటైర్​ అయిపోయారని చేతులెత్తేయడం సరికాదు. రామచంద్రాపురం మండలం కొల్లేరులోని భూదాన్ భూముల ఆక్రమణల్లో బాధ్యులైన తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లపై చర్య తీసుకోవడంలో ఇలాగే జాప్యం చేశారు.
- ఎం.పద్మనాభరెడ్డి, సెక్రటరీ, 
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్