వికారాబాద్, వెలుగు: అధ్వానంగా మారిన రోడ్లను బాగు చేయాలంటూ మంగళవారం తాండూరులో తాండూరు డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి ఆందోళన చేశారు. పట్టణంలోని విలియం మూన్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టగా మీర్జాగూడ బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.
మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వీరికి మద్దతు తెలిపారు. తాండూరు టు హైదరాబాద్ రోడ్డును బాగుచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని వాపోయారు. జోరు వర్షాన్ని లెక్కచేయకుండా నిరసనలో పాల్గొన్నారు. అనంతరం తాండూర్ తహసీల్దార్ తారా సింగ్ కు వినతిపత్రం అందజేశారు.
