ఒలింపిక్స్‌‌కి తెలుగుదనం తెచ్చింది 

ఒలింపిక్స్‌‌కి తెలుగుదనం తెచ్చింది 

‘కబడ్డీ.. కబడ్డీ’ అంటూ గ్రౌండ్‌‌లో కూతపెట్టింది లింగంపల్లి రాధికారెడ్డి. ఆ తర్వాత మైక్‌‌పట్టి అదే ఆట ఎనాలిసిస్​ కూడా ఇచ్చింది. కబడ్డీ లీగ్‌‌లో ఆటతీరును తెలుగువాళ్లకు అర్థమయ్యేలా వివరంగా చెప్పింది. ప్రీమియర్‌‌‌‌ బ్యాడ్మింటన్‌‌ లీగ్‌‌లో లేడీ కామెంటేటర్‌‌‌‌గా దుమ్ముదులిపింది ఈ మాజీ స్పోర్ట్స్‌‌ఉమెన్‌‌. మొన్నటిదాకా జరిగిన 2020 ఒలింపిక్స్‌‌కు తెలుగుదనం తీసుకొచ్చింది ఈ హైదరాబాదీ. ఒలింపిక్స్‌‌కు పనిచేసిన మొదటి లేడీ తెలుగు కామెంటేటర్‌‌‌‌గా పేరు తెచ్చుకుంది. స్పోర్ట్స్‌‌ ఉమెన్‌‌గా మొదలైన జర్నీ కామెంటేటర్‌‌‌‌గా ఎలా టర్న్‌‌ తీసుకుందో లైఫ్‌‌తో చెప్పింది. 
ఒలింపిక్స్‌‌కు హోంవర్క్‌‌ ఎలా చేశారు? 
ప్రో కబడ్డీ, బ్యాడ్మింటన్‌‌ లీగ్‌‌లో ఒక్కో ఆట గురించి మాత్రమే కామెంటరీ చెప్తాం. ఒలింపిక్స్‌‌లో అలా కాదు. 33 ఆటలకు మొత్తం 339 ఈవెంట్స్‌‌ ఉంటాయి. కాబట్టి చాలా హోంవర్క్‌‌ చేయాల్సి వచ్చింది. 20 రోజుల ముందు నుంచే రీసెర్చ్‌‌ మొదలుపెట్టా. కొత్త ఈవెంట్స్‌‌కు సంబంధించి వీడియోలు చాలా చూశా. రూల్స్‌‌ ఏంటి? రెగ్యులేషన్స్‌‌ ఏంటి? ఇలా అన్నీ తెలుసుకున్నా. మన దేశం నుంచి వెళ్తున్న క్రీడాకారుల   పాత రికార్డులు ఏంటి? ఎప్పుడు ఏ పతకాలు గెలిచారు? అని రీసెర్చ్‌ చేశా. అథ్లెటిక్స్‌‌లో 40 ఈవెంట్స్‌‌ ఉంటాయి. పాత అథ్లెట్ల గురించి రిలేట్‌‌ చేస్తూ మాట్లాడాలి. ఒక్కో అథ్లెట్‌‌ ఒక్కో టెక్నిక్‌‌ వాడతారు దాని గురించి చెప్పాలి. అందుకే, వాటికి సంబంధించి చాలా  వర్క్‌‌ చేశా. వేరే దేశాలకు చెందిన ఫేమస్‌‌ క్రీడాకారుల పేర్లు, వాటిని ఎలా పలకాలి? అన్నీ చెక్‌ చేసుకోవాలి. అంతేకాకుండా ఎప్పుడు? ఏ ఈవెంట్‌‌? ఇస్తారో తెలియదు. కాబట్టి అన్ని ఈవెంట్స్‌‌కు ప్రిపేర్‌‌ అయ్యాను. ఒలింపిక్స్‌‌ వల్ల చాలా విషయాలు నేర్చుకున్నా.  “ ఒలింపిక్స్‌‌లో ఆడటం అనేది ప్రతి క్రీడాకారుడికి  డ్రీమ్‌‌. వాళ్లు అక్కడివరకు వెళ్లారంటే ముందు చాలా ఈవెంట్స్‌‌లో గెలిచి అక్కడికి వెళ్లుంటారు. కాబట్టి వాళ్ల అచీవ్‌‌మెంట్స్‌‌ చాలా ఉంటాయి. ఓడిపోయిన వాళ్ల గురించి చెప్పుకోవాల్సింది చాలా ఉంటుంది.’’
ఈ జర్నీ ఎలా మొదలైంది?
నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌‌లో. అమ్మ వాళ్లది మహబూబ్‌‌నగర్‌‌‌‌ జిల్లా ఆమన్‌‌గల్‌‌ దగ్గర. నాన్నది మాల్‌‌ దగ్గర్లోని  పల్లెటూరు. చదువంతా సిటీలోనే సాగింది. నాన్న కబడ్డీ ప్లేయర్‌‌‌‌. దాంతో నాకు కూడా స్పోర్ట్స్‌‌పైన ఇంట్రెస్ట్‌‌ వచ్చింది. ఇంట్లో వాళ్లు కూడా బాగా ఎంకరేజ్‌‌ చేసేవాళ్లు. అలా స్కూల్‌‌ లెవల్‌‌ నుంచే కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌‌ ఆడేదాన్ని. కింగ్‌‌కోఠిలోని హనుమాన్‌‌ వ్యాయామశాలలో నర్సింగరావు సార్​  దగ్గర ట్రైనింగ్‌‌ కూడా తీసుకున్నా. నేషనల్‌‌ లెవల్‌‌లో ఆడాను. ఆ తర్వాత ఉస్మానియాలో ఎంబీఏ చేసిన నేను 15 ఏండ్లు హెచ్‌‌ఆర్‌‌‌‌గా పనిచేశా.      
మరి కామెంటేటర్‌‌‌‌గా ఎలా?
హెచ్‌‌ఆర్‌‌‌‌ మేనేజర్‌‌‌‌గా 2014 వరకు చేసిన నేను రెండేండ్లు గ్యాప్‌‌ తీసుకున్నా. స్టార్‌‌‌‌ స్పోర్ట్స్‌‌  ఛానల్‌‌ వాళ్లు 2016లో ప్రో కబడ్డీతో తెలుగులోకి రావాలనుకున్నారు. అప్పుడే నేను కూడా ఇంటర్వ్యూకి అటెండ్‌‌ అయ్యా. ఆ తర్వాత ముంబైలో వర్క్‌‌షాప్స్‌‌ జరిగాయి. నేను కబడ్డీ ప్లేయర్‌‌‌‌ కావడంతో ఎనలిస్ట్‌‌గా సెలక్టయ్యా. ఆట గురించి అంతా తెలుసు. దాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పగల టాలెంట్‌‌ ఉంది దాంతో వర్క్‌‌ ఈజీగా చేయగలిగా.  వర్క్‌‌షాప్స్‌‌లో తీసుకున్న బేసిక్‌‌ ట్రైనింగ్‌‌ కూడా బాగా హెల్ప్‌‌ అయ్యింది. 
ఇప్పటివరకు ఏ ఈవెంట్స్‌‌ చేశారు? 
ప్రో కబడ్డీతో  కామెంటేటర్‌‌గా నా‌‌ కెరీర్‌‌‌‌ మొదలైంది. 2016 నుంచి ఇప్పటివరకు ఐదు సీజన్స్‌‌కు చెప్పాను. కబడ్డీ వరల్డ్‌‌ కప్‌‌, తెలంగాణ ప్రీమియర్‌‌‌‌ లీగ్‌‌ మూడు సీజన్లకు వర్క్‌‌ చేశా. ప్రీమియర్‌‌‌‌ బ్యాడ్మింటన్‌‌ లీగ్‌‌లో చేతన్‌‌ ఆనంద్‌‌తో కలిసి కామెంటరీ చెప్పా. అంతేకాకుండా ‘ఖేలో ఇండియా యూత్‌‌ గేమ్స్‌‌’ రెండు సీజన్స్‌‌కు కూడా పనిచేశా. 
ఇప్పటివరకు  క్రికెట్‌‌కు మాత్రమే కామెంటరీ చెప్పలేదు. త్వరలోనే దానికి కూడా చెప్పాలని అనుకుంటున్నాను. ఛాన్స్‌‌ వస్తే  వదులుకోను. 
ఒలింపిక్స్‌‌కు అవకాశం ఎలా? 
నేను ‘ఖేలో ఇండియా’కు కామెంటేటర్‌‌‌‌గా వర్క్‌‌ చేశా. అందులో ఒలింపిక్స్‌‌లో లాగానే దాదాపు అన్ని ఈవెంట్స్‌‌ ఉంటాయి. అది చూసిన సోనీ టీవీ వాళ్లు నన్ను సెలక్ట్‌‌ చేశారు. ఆ తర్వాత చిన్న ఇంటర్వ్యూ పెట్టి  ఓకే చేశారు. అలా 2020 టోక్యో ఒలింపిక్స్‌‌కి కామెంటేటర్‌‌‌‌గా పనిచేశాను. అన్ని భాషల్లో కలిపి 25 మంది కామెంటేటర్స్‌‌ ఉంటే.. వాళ్లలో నేను ఒక్కదాన్నే అమ్మాయిని. అందరూ చాలా రెస్పెక్ట్‌‌ ఇచ్చేవాళ్లు. చాలా బాగా చూసుకున్నారు. మొదటిసారి కామెంటేటర్‌‌‌‌గా సెలక్ట్‌‌ అయినప్పుడు కూడా అందరూ చాలా ఎంకరేజ్‌‌ చేశారు. 
ఎక్స్‌‌పీరియెన్స్‌‌ ఎలా అనిపించింది? 
అక్కడ చాలా నేర్చుకున్నా. నేను చెప్పాల్సిన ఈవెంట్‌‌ అయిపోయినా కూడా ఖాళీగా ఉండకుండా మిగతా మ్యాచ్‌‌లు చూశా. వేరే భాషల్లో కామెంటరీ విన్నా. 25 మందిలో చాలామంది సీనియర్స్‌‌ ఉన్నారు. వాళ్ల నుంచి చాలా నేర్చుకున్నా. ‘ఇక్కడ మనం ఎలా చెప్పాం?, వాళ్లు ఎలా చెప్పారు?” అనేది తెలుసుకున్నా. అలా చాలా విషయాలు నేర్చుకున్నా. 
ఫ్యామిలీ సపోర్ట్‌‌ ఎలా ఉంటుంది? 
నా భర్త శ్రీనివాసరెడ్డి కబడ్డీ ప్లేయర్‌‌‌‌, ఇంటర్నేషనల్‌‌ కబడ్డీ కోచ్‌‌ కూడా. కాబట్టి చాలా సపోర్ట్‌‌ చేస్తారు. స్పోర్ట్స్‌‌ పర్సన్స్‌‌ గురించి ఆయన నాకు చెప్తుంటారు. కాబట్టి మిగతా కామెంటేటర్స్‌‌ కంటే నేను కొంచెం ఎక్కువగానే చెప్పగలను. కబడ్డీ వరల్డ్‌‌కప్‌‌ అప్పుడు కూడా అన్ని దేశాల ప్లేయర్స్‌‌ గురించి ఆయన చెప్పారు. క్యాంప్స్‌‌ వెళ్లాల్సి వచ్చినప్పుడు  పాపను అత్తమ్మ చూసుకుంటారు. పాప కూడా ‘అమ్మా ఈ గేమ్‌‌కు చాలా బాగా చెప్పావు. ఆ పాయింట్‌‌ అలా చెప్పావు ఏంటి? ఈ పాయింట్‌‌ ఇలా చెప్పావు ఏంటి?” అని మెసేజ్‌‌ చేస్తుంది.  
మొదట్లో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? 
అంతగా ఏం ఇబ్బంది అనిపించలేదు. కబడ్డీ నాకు బాగా తెలిసిన ఆట. కాబట్టి బాగా ఎనలైజ్​ చేయగలిగాను. అందులో రూల్స్‌‌ ఏంటి? ఎలా ఆడతారు? ఏ ప్లేయర్‌‌‌‌ హిస్టరీ ఏంటి? అనేది అన్నీ తెలుసుకాబట్టి అంతగ ప్రాబ్లమ్‌‌ అవ్వలేదు.   
కామెంటరీ చెప్పేటప్పుడు ఫీలింగ్‌‌ ఎలా ఉంటుంది? 
గ్రౌండ్‌‌లో ప్లేయర్‌‌‌‌ ఎంత టెన్షన్‌‌గా ఉంటారో కామెంటేటర్స్‌‌ కూడా అలానే ఉంటారు. ప్లేయర్స్‌‌ ఎంత ఎమోషనల్‌‌గా ఫీలవుతారో మేం అంతే ఫీల్‌‌ అవుతాం. గెలిచినప్పుడు ఎమోషన్‌‌ తట్టుకోలేక ఏడ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నీరజ్‌‌ చోప్రా గోల్డ్‌‌ మెడల్‌‌ గెలిచినప్పుడు నేనే కామెంటరీ చెబుతున్నాను. ఆ మూమెంట్‌‌ నిజంగా చాలా ఎమోషనల్‌‌. గర్వంగా కూడా అనిపించింది. అతని మీద నాకు మొదటి నుంచి హోప్స్‌‌ ఉన్నాయి. చాలాసార్లు మా టీమ్‌‌తో అన్నాను కూడా. అలాంటిది గోల్డ్‌‌ మెడల్‌‌ రావడం, మన జాతీయ గీతం అక్కడ ప్లే అవ్వడం చాలా బాగా అనిపించింది. ఆ టైంలో నేను కామెంటరీ చెప్పడం ఒక స్పోర్ట్స్‌‌ ఉమెన్‌‌గా నేనే ఒలింపిక్స్‌‌ మెడల్‌‌ గెలిచినట్లు అనిపించింది.                                                                                                                                                                                         ::: తేజ తిమ్మిశెట్టి