తొలిసారిగా భూస్థిర కక్ష్యలోకి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్

V6 Velugu Posted on Aug 08, 2021

  • శ్రీహరికోట నుంచి ప్రయోగానికి సిద్ధమవుతున్న 'జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌10'
  • ఈ నెల 12న ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు

నెల్లూరు: తొలిసారిగా భూ స్థిర కక్ష్యలోకి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ను ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయత్నాలు చేస్తోంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ నెల 12వ తేదీన తెల్లవారుజామున 5.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌10 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. 
ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ప్రయోగానికి సన్నాహాలు  చేస్తున్నారు. కరోనా కారణంగా  దాదాపు రెండేళ్లుగా షార్‌లో ప్రయోగాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. తొలిదశ అన్ లాక్ ప్రక్రియ పూర్తయి కార్యకలాపాలు యధావిధిగా నడిచిన సమయంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం జరిగింది. ఇదే ఊపు కొనసాగుతుందని ఆశిస్తున్న తరుణంలో మరోసారి కరోనా విజృంభించడంతో ప్రయోగాలకు బ్రేక్‌ పడింది. 
2020లో పలు కారణాలతో నాలుగు సార్లు వాయిదా పడిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌10 ప్రయోగం ఐదో ప్రయత్నంలో విజయవంతం చేయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు సన్నద్ధమవుతున్నారు. షార్‌ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని చేయనున్నారు.
దేశ భద్రత, రక్షణ అవసరాలు తీర్చడంలో కీలక మలుపు 
దేశ భద్రత, రక్షణ అవసరాలు తీర్చడంలో కీలక మలుపు తిప్పే అవకాశం ఉన్న ఈ ప్రయోగంపై ఉత్కంఠ నెలకొంది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఇది 79వ ప్రయోగం.. అలాగే జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాల్లో 14వ ప్రయోగం.. సొంత క్రయోజనిక్ టెక్నాలజీలో ఇది 8వ ప్రయోగంగా నిలుస్తుంది. దేశ భద్రత, రక్షణ వ్యవస్థల అనుసంధానం, ప్రకృతి విపత్తులు, ఉపద్రవాలు సంభవించేటప్పుడు ముందస్తు సమాచారం తెలుసుకునేందుకు ఉపయోపడుతుంది. 
జీఎస్ఎల్వీఎఫ్ 10 ప్రత్యేకతలేంటంటే..
జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌10 (జీఎస్‌ఎల్‌వీ మార్క్‌2) రాకెట్‌ ద్వారా 2,268 కిలోల బరువు కలిగిన ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ (ఈవోఎస్‌–03) అనే ఈ నూతన ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో ఆర్బిట్‌ (భూస్థిర కక్ష్య)లోకి ప్రవేశపెట్టనున్నారు. భూమిని పరిశోధించేందుకు ఇప్పటి దాకా రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్స్‌ (దూర పరిశీలనా ఉపగ్రహాలు) భూమికి 506 నుంచి 830 కిలో మీటర్లు ఎత్తులో ఉన్న సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌ (సూర్యానువర్థన ధృవ కక్ష్య)లోకి మాత్రమే పంపించేవారు. ఈసారి ఈవోఎస్‌–03 అనే రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌ను మొట్టమొదటిసారిగా భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఈవోఎస్‌–03 రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. 
 ఈ ఉపగ్రహంలో మల్టీ–స్పెక్ట్రల్‌ విజబుల్‌ అండ్‌ నియర్‌–ఇన్‌ఫ్రారెడ్‌ (6 బాండ్స్‌), హైపర్‌–స్పెక్ట్రల్‌ విజబుల్‌ అండ్‌ నియర్‌–ఇన్‌ఫ్రారెడ్‌ (158 బాండ్స్‌), హైపర్‌–స్పెక్ట్రల్‌ షార్ట్‌ వేవ్‌–ఇన్‌ఫ్రారెడ్‌ (256 బాండ్స్‌) పేలోడ్స్‌గా అమర్చారు.  ఈ ఉపగ్రహం భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తు నుంచి భూమిపై జరిగే మార్పులను ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి పంపుతుంది. అత్యంత పవర్‌ఫుల్‌ కెమెరాలు వాడడం వల్ల 50 మీటర్ల నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో భూమిపై జరిగే మార్పులను ఎప్పటికప్పుడు ఛాయా చిత్రాలను తీసి పంపుతుంది. దాదాపు 10 ఏళ్లు ఈ ఉపగ్రహం తన సేవలను అందిస్తుంది.
 

Tagged isro, Nellore district, indian space research organization, ap today, , Sriharikota Sullurupeta, Isro Latest updates, Satish Dhawan Space Center, GSLV F10, remote sensing satellite, geostationary orbit

Latest Videos

Subscribe Now

More News