
వెంకటాపురం/భద్రాచలం, వెలుగు : తుమ్మల నాగేశ్వర్ రావు పార్టీ మారుతున్నానని వస్తున్నవి ఊహాగానాలేనని, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని మాజీ మంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పూర్వ టీడీపీ, టీఆర్ఎస్ ముఖ్య నేతలు, అనుచరులు, అభిమానులతో వాజేడు మండలం పూసూరు బ్రిడ్జి వద్ద గురువారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సుమారు 3వేల మంది, భారీ కాన్వాయ్‌తో పర్యటన చేయడం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ తాత్కాలిక నిర్ణయాలతో ఇబ్బందులు వస్తాయన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేయాలని అనుచరులకు పిలుపునిచ్చారు. తన వల్ల పదవులు పొంది ఎదిగినవారు ఎక్కడో ఉన్నారని, తాను ఏమీ చేయనివారు తనతో ఉన్నారన్నారు. అంతకుముందు భద్రాచల రామయ్యను దర్శించుకుని దుమ్ముగూడెం, చర్ల మీదుగా వాజేడు వచ్చారు. దుమ్ముగూడెం మండలంలో సీతారామప్రాజెక్టు నిర్మాణం చేపట్టే ప్రదేశం వద్ద కొద్దిసేపు ఆగి మాట్లాడారు. సీనియర్ లీడర్లు ఎస్ఏ రసూల్, యశోద, రాంబాబు ఉన్నారు. కాగా తుమ్మల పర్యటనకు ఎవరూ వెళ్లొద్దని వ్యతిరేక వర్గం నుంచి ఫోన్లు వెళ్లడంతో పలువురు టీఆర్ఎస్ లీడర్లు డుమ్మా కొట్టారు.