
సుందరవనం అనే అడవికి రాజు సింహం. జంతువుల బాగోగులను చూస్తూ ప్రతి నెలా సమావేశం నిర్వహించేది సింహం. ఆ బాధ్యతలను మంత్రి అయిన ఏనుగుకు అప్పజెప్పింది. మంత్రి బాధ్యతను తీసుకొని అడవిలోని జంతువుల బాగోగులను ఎప్పటికప్పుడు రాజుకి తెలియజేస్తూ ఉండేది ఏనుగు.
అడవిలో ఉన్న నక్క, కుందేలు మంచి స్నేహితులు. అయితే నక్క ఒకరోజు కోతిని చూసి ‘కోతిబావా! కోతి బావా! నీ తోక ఏంటి? అంత పెద్దగా ఉంది. తోక నీ అందాన్ని చెడగొట్టింది’ అన్నది. దానికి కోతి చిన్నబుచ్చుకొని ‘నిజంగానే నా తోక అంత పొడుగు ఉందా ?’ అని ఆలోచనలో పడింది. ఆ రోజు నుంచి కోతికి మనఃశ్శాంతి లేకుండా పోయింది. మిత్రులందరిని ‘నా తోక అసహ్యంగా ఉందా?’ అని అడిగేది. అది చూసిన నక్క ‘హమ్మయ్య! ఈ రోజుకు నా కడుపు నిండింది. కోతి బావకి మనఃశ్శాంతి లేకుండా చేశా’ అని తన మిత్రుడు అయిన కుందేలుకి చెప్పింది. అది విన్న కుందేలు ‘ఎందుకు మిత్రమా! అలా చేశావు. దానివల్ల నీకేం లాభం’ అన్నా వినిపించుకోలేదు.
మరుసటి రోజు నక్కకి ఎలుగుబంటి ఎదురైంది. దాన్ని చూసి ‘ఈ అడవిలో అందరూ నిన్ను తెలివిగలది అంటున్నారు. అది నిజమే. కానీ.. నీ గురించి నాతో కొందరు మిత్రులు ‘అది తెలివిగలదే. కానీ, శరీరమంతా వెంట్రుకలతో వికారంగా ఉంది’ అన్నారు. నువ్వెప్పుడైనా నీ రూపం గురించి ఆలోచించావా? ! అంది నక్క. ఆ మాటలకు ఎలుగుబంటి మనసులోనే ఆలోచిస్తూ ‘నా మిత్రులు నాతో సరదాగా ఉంటారు. నా రూపం గురించి ఇలా మాట్లాడుతున్నారా’ అనే ఆలోచనలో పడింది. ఆలోచనలో పడిన ఎలుగుబంటిని చూసి మనసులోనే ముసిముసిగా నవ్వుకుంటూ మెల్లగా అక్కడినుండి జారుకుంది నక్క.
మరుసటి రోజు అడవిలో పూల చెట్ల మధ్యన చెంగు చెంగున ఎగురుతున్న జింకను చూసిన నక్క ‘జింక మిత్రమా, ఎలా ఉన్నావు? నిన్ను చూస్తుంటే ఆనందమేస్తుంది. ఒక చిన్న మాట చెప్తా. కానీ, ఏమీ అనుకోవు కదా!’ అంది. అప్పుడు జింక ‘చెప్పు మిత్రమా! ఏంటి సంగతులు? నువ్వెలా ఉన్నావు?’ అని అడిగింది. ‘నేను బాగానే ఉన్నా. కానీ, నీ గురించి కొందరు మిత్రులు నాతో ఒక మాట చెప్పారు. ‘అందంగా ఉంటాన’ని జింకకు చాలా పొగరు. అందం ఉంటే ఏం లాభం? దాని చూపులకు నిలకడే ఉండదు. ఎప్పుడూ చెవులను నిగిడ్చి ఉంటది అన్నారు. నీకు చెప్పొద్దనుకున్నా. కానీ, నిన్ను చూశాక చెప్పకుండా ఉండలేకపోయా’ అన్నది జింకతో నక్క. అది విన్న జింక సరే మిత్రమా! ‘నాక్కొంచెం పని ఉంది. ఇప్పుడే వస్తా’ అని అక్కడి నుంచి వెళ్ళింది. వెళ్ళనైతే వెళ్ళింది కానీ, ఆ జింక మనసంతా నక్క చెప్పిన మాటలపైనే. ఇదే విషయాన్ని తన మిత్రుడైన కుందేలుకు చెప్పింది నక్క. ‘నీ మాటలతో ఎదుటివాళ్లని బాధించడం తప్పు’ అని ఎంత చెప్పినా నక్క మాత్రం తన స్వభావాన్ని మార్చుకోలేదు.
ఒకనాడు మంత్రి అయిన ఏనుగు జంతువుల బాగోగులు తెలుసుకునేందుకు అడవిలోకి వెళ్ళింది. అందర్నీ కలిసి బాగోగులు తెలుసుకుంటూ ముందుకెళ్తోంది. అడవిలో కోతి, ఎలుగుబంటి, జింక జాడ కనపడలేదు. పక్కనే చెట్టుకొమ్మ మీద ఉన్న ఉడతని పిలిచి వాటి సమాచారాన్ని అడిగింది మంత్రి. ఉడత జరిగిన విషయమంతా చెప్పింది. మంత్రి, రాజు దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పింది.
‘మంత్రివర్యా! జిత్తుల మారి నక్క వంకర బుద్ధిని ఎలాగైనా మార్చాలి’ అని చెప్పింది. మంత్రి ఏనుగు బాగా ఆలోచించి ‘ఈ సమస్య పరిష్కారానికి ఆ నక్క మిత్రుడు కుందేలు సాయం కావాలి’ అంది. మంత్రి ఏనుగు వద్దకు కుందేలు రాగానే జరిగిన విషయాన్ని చెప్పి ‘నీవు మాతో సహకరించాలి’ అని కుందేలుకు చెప్పింది.
‘నా మిత్రుడిలో మార్పు వస్తుందంటే నాకూ సంతోషమే. మీరేం చెప్పినా చేస్తా’ అని కుందేలు చెప్పింది. వెంటనే ఒక ఉపాయాన్ని చెవిలో చెప్పి పంపించింది మంత్రి ఏనుగు. నక్క రాత్రి పడుకోగానే మంత్రి చెప్పినట్టుగానే నక్క నుదుటిపైన నల్లని గీతలు గీసింది. ఉదయం ఏమీ తెలియనట్లు ‘ఏంటి మిత్రమా! నీ నుదుటి పై నల్లని గీతలు. అందవికారంగా ఉన్నాయి’ అంది కుందేలు. నక్క అద్దంలో చూసుకుని బాధపడింది. ‘ఏం చేద్దాం? ఈ ముఖం పెట్టుకొని బయట ఎలా తిరగగలను?’ అని బాధపడింది. రాజు గారి ఆస్థానంలో మంత్రి ఏనుగుకు వైద్యం కూడా తెలుసు. మనం అక్కడికెళ్తే పరిష్కారం దొరకొచ్చ’ని కుందేలు చెప్పింది.
నక్కను తీసుకొని రాజు ఆస్థానానికి వెళ్లింది కుందేలు. రాజు, మంత్రిని పిలిపించి ‘మంత్రివర్యా! ఈ నక్క సమస్య పరిష్కరించడానికి మీ వద్ద వైద్యం ఉంటే.. చేయండి’ అంది. ‘ఆజ్ఞ ప్రభూ’ అని ఏనుగు ఒక బకెట్లో నీళ్లు తెప్పించి నక్క నుదుటి పైన పోసి, బాగా కడిగించింది. దాంతో నలుపు చారలు పోయాయి. నక్క చాలా సంతోషించింది.
‘చూడు నక్క మామా... నీ వంకర బుద్ధి ఇకనైనా మానుకో! నీ మిత్రుడు కుందేలు సాయంతో నీ నుదుటిపై నల్లని చారలు గీయించా. అవి చూసి నువ్వు చాలా బాధపడి, మా దగ్గరికి పరిగెత్తుకొచ్చావు. నీ సంతోషం కోసం కోతి, ఎలుగుబంటి, జింకను వాటి ఆకారం, రూపాలపై లేనిపోని మాటలని బాధ పెట్టావు. ఇకనైనా నీ బుద్ధి మార్చుకో! రూపం కాదు. మంచి మనసు ముఖ్యం. ఇకనైనా అందరితో కలిసి ఉండు. అందరి సంతోషమే మన సంతోషం కావాలి. అంతేకానీ, ఎదుటివాళ్లని మాటలతో బాధపెట్టి మనం సంతోషించకూడద’ని రాజు చెప్పగానే తన తప్పు తెలుసుకుంది. అక్కడే ఉన్న కోతి, ఎలుగుబంటి, జింకకి క్షమాపణలు చెప్పింది నక్క.
- జానకీరామ్