
పదమూడు వందల సంవత్సరాల క్రితమే ఓరుగల్లు కాకతీయుల రాజధానిగా విలసిల్లింది. ఒరిస్సా, తమిళనాడు, కర్నాటకలోని కొన్ని భాగాలు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలను 300 సంవత్సరాలకు పైగా పాలించిన ఘన చరిత్ర కలిగి ఉంది. నిజాం రాజ్యంలోగల ఐదు సుభాలలో ఇప్పటి సూర్యాపేట జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, కరీంనగర్, అదిలాబాద్ జిల్లాలు, వరంగల్ ఉమ్మడి జిల్లాతో కలుపుకొని వరంగల్ సుభాగా నిజాం పాలనలో ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందింది.
ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్ నగరం జోనల్ కేంద్రంగా ఎదిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాతనే పాలకులు తమ స్వప్రయోజనాల కోసం ప్రజలకు అనేక భ్రమలు, ఆశలు కల్పించి జిల్లాను ఆరు ముక్కలుగా విడదీశారు. 12 లక్షల జనాభా కలిగిన వరంగల్ మహానగరాన్ని కాకతీయుల చరిత్రను విస్మరించి రెండు ముక్కలుగా చేసి దీని సమగ్ర అభివృద్ధిని, రాజకీయ చైతన్యాన్ని, పారిశ్రామిక అభివృద్ధిని అడ్డుకోవడం జరిగింది.
ఈ మేరకు నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు మేధావులు అందరూ ఆవేదనపడుతున్న రోజులివి. జిల్లాల విభజనకు పూర్వం కూడా తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, సివిల్ సొసైటీ సభ్యులు నిరసనలు వ్యక్తం చేసినా నిరంకుశ పాలకులు పెడచెవిన పెట్టడం జరిగింది.
ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కొంతమంది ఆనాటి
ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేసింది మర్చిపోలేం. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి నాయకులు ముఖ్యంగా మాజీ పార్లమెంటు సభ్యులు ఇటుకాల మధుసూదన్ రావు, శాసనసభ్యులు టీఎస్ మూర్తి, ఎమ్మెస్ రాజలింగం, హయగ్రీవాచారి వరంగల్ నగర అభివృద్ధిలో కొంత చొరవ చూపించారనే దానికి ఆర్.ఇ.సి., కె.ఎం.సి.లాంటి అభివృద్ధి సంస్థలు ఇప్పటికీ ప్రజల ముందు కనిపిస్తున్నాయి.
చెన్నారెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వరంగల్ ప్రజలకు తాగునీటి కోసం కాకతీయ కెనాల్ మంజూరు చేయడం జరిగింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరులైన విద్యార్థుల త్యాగ ఫలితంగా కాకతీయ విశ్వవిద్యాలయం 1975లో ప్రారంభమైంది. ఆ తర్వాత కాలంలో ఉమ్మడి జిల్లా అన్ని రంగాల్లో ముఖ్యంగా పారిశ్రామికంగా, దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో విఫలమైంది. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగమే దిక్కైపోయింది.
విద్యావంతులు, గ్రామీణ యువకులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు మృగ్యమై పోయాయి. సంపద అంతా హైదరాబాద్‌కే పరిమితమైంది. హైదరాబాద్ నగరం అభివృద్ధి మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల అభివృద్ధిగా పరిగణించలేమని, అందులో 10 శాతం కూడా తెలంగాణ ప్రజలకు చెందేది కాదని ప్రభుత్వం, పాలకులు, పార్టీలు, నాయకులు, ఉన్నతాధికారులు గుర్తించాలి.తీవ్రంగా నష్టపోయిన వరంగల్ ఉమ్మడి జిల్లాగత 40 సంవత్సరాల కాలంలో వరంగల్ ఉమ్మడి జిల్లా తీవ్రంగా నష్టపోయిందని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి.
మీర్ ఉస్మాన్ అలీఖాన్
స్థాపించిన ఆజంజాహీ మిల్లు మూసివేసి ఆ భూములను విక్రయించారు.పేద మహిళలకు జీవనోపాధిని కల్పించే బీడీ పరిశ్రమ ఆధునికీకరణలో భాగంగా కాలగర్భంలో కలిసిపోయింది. అదేవిధంగా వేలమందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఆనాటి తోళ్ల పరిశ్రమ కనుమరుగైంది. కులవృత్తులపై ఆధారపడ్డ సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన కులాల ప్రజలు తమ వృత్తులను కోల్పోయారు. ములుగు కమలాపూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన త్యాపర్ గ్రూప్ రియాన్ ఫ్యాక్టరీ మూసివేశారు.
స్వర్ణాంధ్రలో భాగంగా హైదరాబాద్–- వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రకటనలకే పరిమితమైపోయింది. కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా వరంగల్ నగరానికి చుట్టూ నిర్మించవలసిన రింగ్ రోడ్డు నిర్లక్ష్యానికి గురి అయింది. కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఇంకా స్థానికులకు ఉద్యోగం కల్పించలేకపోయింది. పేరుగాంచిన వరంగల్ జైలు కూల్చివేశారు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత పట్టుమని వెయ్యిమంది కార్మికులకు ఉపాధి కల్పించే ఒక్క పరిశ్రమ కూడా రాలేదు.
ఒక్క ఫైఓవర్ కూడా కట్టలేదు
వరంగల్ మహానగరంలో ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు, లారీల రవాణా అనేక రెట్లు పెరిగి తీవ్రస్థాయిలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడినప్పటికీ నగరంలో కనీసం ఒక్క ఫ్లైఓవర్ కూడా కట్టలేదు. స్వరాష్ట్రంలో కూడా కాకతీయ యూనివర్సిటీ ఆదరణ లేక నాణ్యమైన చదువులేక నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మారిపోయింది.
వరంగల్ నగరం పేరుకు మాత్రమే స్మార్ట్ సిటీ అంటాం. అన్ని పార్టీలకు చెందిన నాయకులంతా వరంగల్ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం అని చెప్పుకుంటారు. వరంగల్ నగరం ఉద్యమగడ్డ అని కొనియాడుతారు. కానీ, నాయకుల తీరు విశ్లేషిస్తే కేవలం వరంగల్ పట్ల శూన్య హస్తాలు అన్నట్లుగా ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు. హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం అంటాం కానీ, లోపల చూస్తే ఈనాటి యువతను అంధకారం, నిరాశ, నిస్పృహలే వెక్కిరిస్తున్నాయి.
రాష్ట్రంలో వరంగల్ కంటే అతి చిన్న పట్టణాలు కూడా నగరాలుగా ఎదిగిపోతున్నాయి. కరీంనగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం నిర్మాణం అయిపోయింది. ఖమ్మం పట్టణం అభివృద్ధిపథంలో పరుగులు తీస్తున్నది. కల్వకుంట్ల పాలకుల చలవతో సిద్దిపేట, గజ్వేలు పట్టణాలుగా ఎదిగిపోతున్నాయి. కానీ, వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఆరు జిల్లాల అభివృద్ధి అధోగతి పాలయింది.
వరంగల్ మహా నగరాన్ని ఒకే జిల్లా చేయాలి
వరంగల్ ఉమ్మడి జిల్లా మరింత దిగజారిందనే దానికి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అనేక గణాంకాలే సజీవ సాక్ష్యాలు. ఉత్తర తెలంగాణతోపాటు వరంగల్ ఉమ్మడి జిల్లా సమగ్ర అభివృద్ధికి వరంగల్ మహా నగరాన్ని ఒకే జిల్లాగా చేసి ఒక అభివృద్ధి ఇంజిన్‌గా రూపొందించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరం రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు అభివృద్ధి కేంద్రంగా ఏర్పడినట్లే.. వరంగల్ నగరం కూడా ఖమ్మం, కరీంనగర్ అదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని పాలకులు గుర్తించాలి.
ఇకనైనా ఉత్తర తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకత్వం ఈ చారిత్రాత్మక నిర్లక్ష్యం చేయకూడదు. లక్షల కోట్లలో ఆకర్షించిన దేశీయ, విదేశీయ పెట్టుబడులను కేవలం రంగారెడ్డి ఇతర జిల్లాల్లో ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాలకు పరిమితం చేస్తున్నారు.
కాజీపేట రైల్వే జంక్షన్ తోపాటు జాతీయ రహదారులు, విద్యాసంస్థలు అభివృద్ధి చెందిన మానవ వనరులు విస్తారమైన ఖనిజ సంపద, భూవనరులు కలిగిన ఉత్తర తెలంగాణలోని వరంగల్ నగరాన్ని కేంద్రంగా చేసుకొని ఉపాధి, ఉద్యోగ, ఆదాయ అవకాశాలను కల్పించాలి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల జిల్లాల అభివృద్ధికి కృషి చేసినప్పుడే రైజింగ్ తెలంగాణ అని చెప్పుకోవడానికి మనందరికీ అర్హత ఉంటుందని భావిద్దాం.
వరంగల్‌ను ముక్కలు చేశారు
వరంగల్ నగరాన్ని విభజించడం ఇష్టంలేకున్నా తమ నాయకునికి ఏమాత్రం ఎదురు చెప్పలేని ఉమ్మడి జిల్లా నాయకులు కిమ్మనకుండా అంగీకరించి ఇప్పుడు ఆవేదన చెందుతున్నారు. వరంగల్ నగరం ముక్కలు చేసిన ఉదంతం వరంగల్ ప్రజల, నిరుద్యోగుల పేద ప్రజల దౌర్భాగ్యం అనుకోవాలి.
బంగారు తెలంగాణలో పాలకులకు వారి వందిమాగధులకు వేలాది ఎకరాల భూములు, కార్పొరేట్ వైద్య, విద్య, నిర్మాణ సంస్థలు, ఫాంహౌస్‌లు, దుబాయ్, లండన్ లాంటి విదేశాల్లో విల్లాలు, ఆస్తులు సమకూరాయి. కానీ, ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలకు మాత్రం ఒరిగిందేమీ లేదు.
అందుకే ఉమ్మడి జిల్లా ఓటర్లు గత శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికార మార్పిడి కోసం
12 స్థానాలలో 10స్థానాలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ప్రస్తుతం అధికారం పొందిన ఉమ్మడి జిల్లా నాయకులు ప్రజాప్రతినిధులు మహానగర ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని ఉమ్మడి జిల్లా, మహానగరం అభివృద్ధికి తమ సర్వశక్తులు ఉపయోగించాలని ఉద్యమకారులు, పేద ప్రజలు, నిరుద్యోగులు కోరుతున్నారు.
- ప్రొఫెసర్ , కూరపాటి వెంకట్ నారాయణ-