పిల్లలకు ఆట.. పెద్దలకు ఆచారం.. ఆదివాసీ పల్లెల్లో ఆకర్షిస్తున్న మరుగోళ్ల ఆట !

పిల్లలకు ఆట..  పెద్దలకు ఆచారం.. ఆదివాసీ పల్లెల్లో ఆకర్షిస్తున్న మరుగోళ్ల ఆట !

పొలాల మాసం వచ్చిందంటే చాలు.. ఆదివాసీ పల్లెల్లో పిల్లలంతా వెదురు బొంగులతో రోడ్డెక్కుతారు. బొంగుల గుర్రం ఎక్కి ఎన్నో ఆటలు ఆడతారు. అదంతా పిల్లలకు ఒక సరదా. కానీ.. పెద్దలకు ఎన్నో ఏండ్ల నుంచి వస్తున్న ఆచారం. దాన్ని వాళ్లు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎన్నో ఆచారాల్లాగే దీని వెనుక కూడా ఒక ఆరోగ్య రహస్యం దాగి ఉంది. అదేంటంటే.. 

ఆదివాసీలకు పొలాల పండగ చాలా ప్రత్యేకం. పొలాల అమావాస్యకు నెల రోజుల ముందే  సందడి మొదలవుతుంది. నెల రోజులపాటు పిల్లలు వెదురు బొంగుల గుర్రం (మరుగోళ్ళు)తో ఆటలాడతారు. అయితే ఇది ఇప్పుడు వాళ్లకు ఆటే కావొచ్చు. కానీ.. ఒకప్పుడు ఆరోగ్యాన్ని కాపాడిన ఆచారం.  ఆదివాసీలు ఉండే గ్రామాల్లో ఒకప్పుడు రోడ్లు సరిగ్గా ఉండేవి కాదు. ఈ నెలలో కురిసే జోరు వానలకు చిత్తడి చిత్తడిగా అయ్యేవి. మొత్తం బురదతో నిండిపోయేవి. అలాంటి రోడ్ల మీద నడవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. పైగా.. అందులో నడిచినవాళ్లకు రకరకాల ఇన్ఫెక్షన్స్‌‌ వచ్చేవి. 

అందుకే కాళ్లకు బురద అంటుకోకుండా నడిచేందుకు ఇలా వెదురు బొంగుల గుర్రాలను వాడేవాళ్లు. అదే ఇప్పుడు పిల్లలకు ఆటగా, పెద్దలకు సంప్రదాయంగా మారిపోయింది. ప్రతి ఏడాది శ్రావణ మాసం చుక్కల అమావాస్య నుంచి పొలాల అమావాస్య వరకు ఈ మరుగోళ్ల ఆట ఆడతారు. దీన్ని ఆదివాసీలు వాళ్ల భాషలో ‘‘కోడంగ్” అని పిలుస్తారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్, కెరమెరి, వాంకిడి, తిర్యాణి, బెజ్జుర్, కౌటల, దహెగాం, చింతలమనేపల్లి, కాగజ్‌‌నగర్ మండలాల్లో ఈ సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే.. ఈ మరుగోళ్ల ఆటను మగవాళ్లు మాత్రమే ఆడటం ఆనవాయితీగా వస్తోంది.

ఇలా తయారు చేస్తారు

మరుగోళ్లను తయారు చేయడానికి వెదురు కర్రలను మాత్రమే వాడుతారు. ముందుగా గ్రామస్తులంతా కలిసి వెళ్లి అడవి లేదంటే పొలం గట్లపై ఉన్న వెదురు బొంగులను సేకరిస్తారు. వాటిని ఇళ్లకు తీసుకెళ్లి అందరూ కలిసి మరుగోళ్లు తయారు చేస్తారు. కర్రలపై కాలు పెట్టుకోవడానికి అనువుగా ఉండేలా తాళ్లతో వెదురు చెక్కలను కడతారు. ఇంట్లో ఎంతమంది మగ పిల్లలు ఉంటే అన్ని మరుగోళ్లు తయారు చేసివ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజు నుంచే పిల్లలు ఆటలాడటం మొదలు పెడతారు. అప్పటినుంచి కాళ్లకు బురద అంటకుండా తిరుగుతారు. చివరగా పొలాల అమావాస్య రోజున మరుగోళ్లను పూజిస్తారు.

రోగాల నుంచి కాపాడుకునేందుకు 

పొలాల పండుగ మరుసటి రోజు ‘‘బడగా” జరుపుకుంటారు. వర్షాకాలం దోమలు పెరగడం, పరిసరాల కలుషితం వల్ల పల్లె ప్రజలను అనేక రోగాలు పట్టి పీడిస్తుంటాయి. ముఖ్యంగా అలాంటి రోగాలు శ్రావణ మాసంలోనే జోరందుకుంటాయి. ఆదివాసీలు అదంతా దుష్టశక్తుల వల్లే జరుగుతుందని నమ్మేవాళ్లు. అందుకే బడగా రోజు ఉదయాన్నే వెదురు బొంగు గుర్రం కర్రతో ఇల్లంతా అంటే ఇంట్లో ఉన్న వస్తువులను ఆ తర్వాత వాకిట్లో ఉండే పందిరిని మరుగోళ్లతో కొడతారు. అలా చేయడం వల్ల దుష్ట శక్తులు పారిపోతాయని నమ్ముతారు. ఆ తర్వాత ప్రతి ఇంటి నుంచి ఇంటి పెద్ద ఆ కర్రలను తీసుకుని బయల్దేరతాడు. 

అలా అందరూ ఒకచోట కలిసి సద్ది అన్నం కట్టుకుని ‘జాగేయి మత్తర’ అని పెద్దగా అరుస్తూ ఊరి శివారులోని శివసంధు చెట్టు దగ్గరకు వెళ్తారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి మరుగో ళ్లను వదిలేస్తారు. తర్వాత అందరూ సమీపంలోని వాగులు, వంకలు తిరిగి వన మూళికలను ఇంటికి తెచ్చుకుంటారు. కొన్ని వనమూలికల ఆకుల నుంచి పసరు తీసి తాగుతారు. దానివల్ల వాళ్లు ఆరోగ్యంగా ఉంటారని విశ్వాసం. అంతేకాదు.. ప్రతి ఒక్కరూ కనీసం పది చెట్ల కొమ్మలు తీసుకొచ్చి ఇంటి గుమ్మంలో కడతారు. అవి ఉంటే దోమలు ఇంట్లోకి రావని చెప్తుంటారు. తర్వాత దేవతకు నైవేద్యం వండి పెడతారు. ఆ రోజంతా విందులు వినోదాలతో హాయిగా గడుపుతారు. 

మా ఆచారంతోనే మాకు గుర్తింపు

‘‘మా ముత్తాతల కాలంనాటి సంప్రదాయం ఇది. ఈ మరుగోళ్ళ ఆచారాన్ని ఆచరించినంత వరకే మాకు ఆదివాసీలుగా గుర్తింపు. అందుకే తూ.చా. తప్పకుండా పాటిస్తున్నాం. దీన్ని భవిష్యత్తు తరాలకు అందించడమే మా లక్ష్యం” అంటున్నాడు జంగాం గ్రామ పెద్ద కుమ్రం శ్యామ్ రావు.