అమ్మో దెయ్యం.. ఊరంతా ఖాళీ.. చివరకు ఏం జరిగింది

అమ్మో దెయ్యం.. ఊరంతా ఖాళీ.. చివరకు ఏం జరిగింది

అది పశ్చిమబెంగాల్ రాష్ట్రం నార్త్ 24 పరగణ జిల్లాలోని గోబర్దం గ్రామం. కొన్ని రోజులుగా ఆ ఊరిలోని శ్మాసన వాటికలో ఓ దెయ్యం తిరుగుతుందనే ప్రచారం ఉంది. కొంత మంది అయితే ఆ దెయ్యాన్ని చూశాం అని చెప్పటం మొదలుపెట్టారు. ఆ ప్రచారం అలా అలా జోరుగా సాగింది. అదే సమయంలో అర్థరాత్రి సమయంలో స్మశానం వైపు వెళ్లిన ఇద్దరు కుర్రోళ్లు దెయ్యాన్ని చూసి.. భయంతో కళ్లు తిరిగి పడిపోయారు. ఈ వార్తతో గ్రామంలో మరింత భయాందోళనలు నెలకొన్నాయి. కొంత మంది అయితే ఊరు విడిచి వెళ్లిపోయారు . గోబర్ధం గ్రామంలో దెయ్యం అంటూ ఊరూవాడా ప్రచారం జరిగింది. 

గ్రామానికి చెందిన నలుగురు యువకులు మాత్రం.. దెయ్యం అంతు చూడాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు ఓ రోజు అర్థరాత్రి సమయంలో శ్మశానం వైపు వెళ్లారు.. వాళ్లకు నిజంగా తెల్ల దుస్తుల్లో ఆకారం కనిపించింది. భయంతో వెనక్కి వచ్చారు. రెండో రోజు దైర్యం చేశారు. స్మశానంలోకి వెళ్లారు. ఆ రోజు కూడా దెయ్యం ఆకారం కనిపించింది. ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటూ అలాగే ముందుకు సాగారు. దాని దగ్గరకు వెళ్లారు. అప్పుడు తెలిసింది అసలు విషయం. అది దెయ్యం కాదు.. దెయ్యం రూపంలో ఉన్న ఓ యువకుడు. పట్టుకుని నాలుగు తగిలించారు. 

దెయ్యం వేషం వేసిన కుర్రోడి అసలు విషయం చెప్పాడు. యూట్యూబ్ కోసం వీడియోలు చేస్తున్నానని.. తన ఛానెల్ లైక్స్, షేర్లు, వ్యూస్ కోసం దెయ్యం వీడియోలు చేస్తున్నానని చెప్పాడు. మరి కెమెరా ఎక్కడ ఉంది అని అడిగితే.. మీరు నన్ను కొట్టటం చూసి కెమెరామెన్ పారిపోయాడని.. అతను నా ఫ్రెండ్ అని వివరించాడు. 

ఈ ఘటనపై గ్రామ యువకుడు ప్రసేన్ జిత్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా యూట్యూబ్ వీడియోల కోసం ఇలాంటి వేషం వేశానని.. మరో కారణం కాదని చెప్పాడు. అన్ని వివరాలు పరిశీలించిన తర్వాత.. యువకుడి భవిష్యత్ దృష్ట్యా వార్నింగ్ ఇచ్చి పంపించేశారు పోలీసులు. 

దెయ్యం వేషంలోని కుర్రోడు ఎలా ఉన్నాడో చూడాలని ఉందా.. ఈ ఫొటోనే ఇది.. యూట్యూబ్ వ్యూస్ కోసం ఎంతకైనా తెగించేస్తున్నారు కదా..