రాత్రంతా 17 కి.మీ. నడిచి వెళ్లి మరీవార్డెన్​పై అమ్మాయిల కంప్లైంట్​

రాత్రంతా 17 కి.మీ. నడిచి వెళ్లి మరీవార్డెన్​పై అమ్మాయిల కంప్లైంట్​

రాంచీ: జార్ఖండ్‌లో 60మంది హాస్టల్ బాలికలు సాహసం చేశారు. వార్డెన్​పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి రాత్రంతా 17 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు. వార్డెన్‌పై డిప్యూటీ కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన సింగ్‌భూమ్ జిల్లాలోని ఖుంట్‌పాని కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్‌లో జరిగింది. హాస్టల్​ లో కొంతకాలంగా పాడైపోయిన ఆహారం పెడుతున్నారని, నేలపైనే పడుకోవాలని బెదిరిస్తున్నారని అమ్మాయిలు ఆరోపించారు. టాయిలెట్లను కూడా తమతోనే క్లీన్ చేయిస్తున్నారు. ఇదేంటని అడిగితే కొడుతున్నారని వార్డెన్​ పై కంప్లైంట్​ చేశారు. హాస్టల్ తనిఖీ కోసం వచ్చే అధికారులతో అంతా బాగానే ఉన్నట్లు అబద్ధాలు చెప్పమని బలవంతం చేస్తున్నారని చెప్పారు. దీంతో విసుగెత్తిపోయిన స్టూడెంట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.

11వ తరగతితో పాటు జూనియర్లు, సీనియర్లు మొత్తం కలిసి 60 మందికి పైగా బాలికలు చైబాసాలోని డిప్యూటీ కమిషనర్‌(డీసీ) ఆఫీసుకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఎక్కువ మంది ఉండటంతో అక్కడికి ఎలా వెళ్లాలో తెలియలేదు. అంతా కలిసి నడుచుకుంటూ వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అలా, అమ్మాయిలందరూ రాత్రంతా నడిచి సోమవారం ఉదయం 7 గంటలకు చైబాసాలోని డీసీ ఆఫీసుకు చేరుకున్నారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి బాలికలు అర్ధరాత్రి 17 కిలోమీటర్లు నడవడం సంచలనంగా మారింది. విషయం తెలుసుకున్న డిప్యూటీ కమిషనర్ అనన్య మిట్టల్‌ విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని జిల్లా విద్యాశాఖ సూపరింటెండెంట్ (డీఎస్‌ఈ)ని ఆదేశించారు. డీఎస్‌ఈ అభయ్‌కుమార్‌ షిల్‌ వెంటనే డీసీ ఆఫీసుకు చేరుకుని బాలికల సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఒక స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేస్తామని డీఎస్ఈ తెలిపారు. విచారణ జరిపి వార్డెన్‌పై చర్యలు తీసుకుంటామని బాలికలకు హామీ ఇచ్చారు.