బ్యాంకులో దాచుకున్న బంగారం మాయం

బ్యాంకులో దాచుకున్న బంగారం మాయం
  • కరూలు జిల్లా ఉయ్యాలవాడ ఏపీజీబీ బ్యాంకులో ఘటన
  • మొత్తం 17 మంది కస్టమర్లకు చెందిన 1300 గ్రాముల ఆభరణాలు గల్లంతైనట్లు గుర్తింపు
  • తనిఖీలు చేసి విచారణ చేపట్టిన అధికారులు, పోలీసులు

కర్నూలు: చాలా మంది తమ బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్లలో దాచుకుంటారు. సురక్షితంగా ఉంటాయనే నమ్మకమే దీనికి ప్రధాన కారణం. మరికొందరు అవసరాలకు అప్పు తీసుకునేందుకు బ్యాంకుల్లో తనఖా పెడతారు. తమ సొమ్ము ఎక్కడికీ పోదన్న నమ్మకంతోనే ప్రజలు బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. అయితే అలాంటి బ్యాంకుల్లోనే దాచుకున్న ఆభరణాలు మాయమైతే. ఏం చేయాలి. ఇప్పుడు ఇదే పరిస్థితి కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామంలో నెలకొంది. గ్రామంలో ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు స్థానిక ప్రాంతంలోని ప్రజలు, రైతులు, వ్యాపారులు అన్ని రకాల వారికి సేవలు అందిస్తోంది. మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోల్చితే ఏపీ గ్రామీణ బ్యాంకుల పనితీరు బాగుంటుంది. ఉద్యోగులు కూడా కస్టమర్లతో స్నేహపూర్వకంగా ఉండడంతో ఈ బ్యాంకు శాఖల్లో సేవలకు అలవాటు పడినవారు పక్క బ్యాంకుల వైపు కన్నెత్తి చూడరు. ఒకవేళ చూసినా వెంటనే తమ మాతృ బ్యాంకు అంటూ తిరిగొస్తారు. ఇంత నమ్మకం ఉండడం వల్లే కాబోలు ఉయ్యాలవాడ లాంటి మారుమూల ప్రాంతంలో ఉన్న  ఎపి జిబి బ్యాంకులో లావాదేవీలు, రుణాలు భారీగా ఉంటున్నాయి. శనివారం ఉదయం బ్యాంకు లోన్ రెన్యువల్ చేసుకునేందుకు వెళ్లిన రైతుకు చుక్కెదురైంది. తాను తాకట్టుపెట్టిన బంగారు ఆభరణాలు బ్యాంకులో కనిపించడం లేదని చెప్పడంతో షాకు గురయ్యాడు. వెంటనే బ్యాంకు మేనేజర్ మధుసూధన్ ఒకటికి నాలుగుసార్లు బ్యాంకు లాకర్ గాలించినా ఆభరణాలు కనిపించకపోవడంతో రీజనల్ మేనేజర్ ఎంజేఎల్ ఎన్ ప్రసాద్ కు సమాచారం ఇచ్చి ఖాతాదారుడ్ని బ్యాంకులోనే కూర్చోబెట్టారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న కస్టమర్ తనతోపాటు తాకట్టు పెట్టిన మరికొందరికి సమాచారం ఇవ్వడంతో వారు కూడా వచ్చి తాము కుదవపెట్టిన ఆభరణాల రశీదులు చూపించి తనిఖీ చేయమని కోరారు. ఇలా ఒకరితర్వాత ఒకరు బ్యాంకు కు వరుసపెట్టడం.. వారందరి నగలు బ్యాంకులో మాయం అయ్యాయన్న విషయం గ్రామంలో దావానలంలా పాకింది. పరిస్థితిని సరిదిద్దేందుకు ఆర్ఎం ప్రసాద్ హుటాహుటిన బ్యాంకుకు తరలివచ్చి స్వయంగా తనిఖీలు చేయగా మొత్తం 17 మంది ఖాతాదారులకు చెందిన 1300 గ్రాముల బంగారు ఆభరణాలు మాయం అయినట్లు గుర్తించారు. మేనేజర్ తో కలసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆళ్లగడ్డ డీఎస్పీ ఎ.రాజేంద్ర స్వయంగా బ్యాంకుకు వచ్చి వివరాలు ఆరా తీశారు. గతంలో పనిచేసి వెళ్లిన వారిపై అనుమానాలు రావడంతో ఇంటిదొంగలెవరో తేల్చేందుకు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.