కొనసాగుతున్న గూడెం లిఫ్ట్​ రిపేర్లు 

కొనసాగుతున్న గూడెం లిఫ్ట్​ రిపేర్లు 

మంచిర్యాల,వెలుగు: ఈ ఏడాది జూలైలో వచ్చిన గోదావరి వరదలకు గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పూర్తిగా నీటమునిగింది. టర్బైన్ మోటార్లు, కంట్రోల్ ప్యానళ్లు, విలువైన ఇతర పరికరాలు దెబ్బతినడంతో సుమారు రూ.10.50 కోట్ల నష్టం జరిగింది. గత ఐదు నెలలుగా లిఫ్ట్ బంద్ అయ్యింది. దీంతో వానాకాలం సీజన్​కు కాల్వనీళ్లు అందక పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం యాసంగి సీజన్ మొదలైంది. ఈసారైనా పంటలకు సాగునీరు అందుతుందా, లేదా అని ఆందోళన చెందుతున్నారు.  

ముంచెత్తిన వరదలు... 

గతంలో ఎన్నడూ లేనంతగా జూలైలో గోదావరికి వరద పోటెత్తడం వల్ల గూడెం లిఫ్ట్​కు భారీ నష్టం వాటిల్లింది. గోదావరి నీటి మట్టానికి 150 మీటర్ల ఎత్తులో లిఫ్ట్​ను ఏర్పాటు చేయగా, 154.45 మీటర్ల ఎత్తులో వరద వచ్చి ముంచేసింది. దీంతో నీటిని ఎత్తిపోసే రెండు టర్బైన్ మోటార్లు, జనరేటర్, కంట్రోల్ ప్యానెళ్లు బుదరలో కూరుకుపోయాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న విలువైన పరికరాలు పూర్తిగా దెబ్బతిని పనికి రాకుండాపోయాయి.  

కొనసాగుతున్న రిపేర్లు...

గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం రిపేర్ల పనులు మూడు నెలలుగా కొనసాగుతున్నాయి. వరద ప్రభావం తగ్గిన తర్వాత ఇరిగేషన్ ఇంజనీర్లు రంగంలోకి దిగి రిపేర్లకు పూనుకున్నారు. ఈ లిఫ్ట్​ను నిర్మించిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్​ఫ్రాస్ర్టక్చర్ కంపెనీకే 15 సంవత్సరాల పాటు ఆపరేషన్స్, మెయింటనెన్స్ పనులు అప్పగించారు. దీంతో ఆ సంస్థ ఇంజనీర్లతోనే రిపేర్లు చేయిస్తున్నారు. దెబ్బతిన్న మోటార్లు, కంట్రోల్ ప్యానెల్స్​తో పాటు ఇతర పరికరాలను గతంలో బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్నారు.

మళ్లీ వాటిని తెప్పించడానికి చాలా టైమ్ పట్టే అవకాశం ఉండడంతో రాష్ర్టంలోని వివిధ ప్రాజెక్టుల్లో అదనంగా ఉన్నవాటిని తెచ్చి పనులు నడిపిస్తున్నారు. దుమ్ముగూడెం నుంచి ఎగ్జాటేషన్ ప్యానల్స్, చనాఖ– కొరాట, రాజీవ్​సాగర్ ప్రాజెక్టుల నుంచి మరికొన్ని తెచ్చి బిగిస్తున్నారు. కేబుల్స్​ పనులు కూడా స్పీడ్​గా సాగుతున్నాయి. వీటిని విదేశాల నుంచి తెప్పిస్తే రూ.కోట్లలో ఖర్చయ్యేదని, లోకల్​గా అందుబాటులో ఉన్నవాటిని సర్దుబాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. రిపేర్లకు రూ.కోటి వరకు ఖర్చవుతోందని అన్నారు.  

యాసంగికి నీళ్లు పారేనా..? 

లిఫ్ట్ రిపేర్ల పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయని ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. రెండు మోటార్లలో ఒకదానికి రిపేర్లు పూర్తికావడంతో సోమవారం డ్రై రన్​ నిర్వహించారు. మరో మోటార్​కు రిపేర్లు కొనసాగుతు న్నాయి. అది కూడా డ్రై రన్ సక్సెస్ అయితే ఈ యాసంగి సీజన్​కు యథావిధంగా సాగునీరు అందిస్తామని అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు టెయిల్ ఎండ్​ను స్థిరీకరించేందుకు గూడెం లిఫ్టును నిర్మించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్​ వాటర్​ నుంచి 3 టీఎంసీలు దీనికి వాడుకుంటున్నారు.

ఈ లిఫ్ట్​ను 2015లో ప్రారంభించగా దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల్లోని 30 వేల ఎకరాల చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నారు. వరదలతో లిఫ్ట్ దెబ్బతినడంతో ఈ వానాకాలం సీజన్​లో నీళ్లందక రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం యాసంగి సీజన్ మొదలు కావడంతో లిఫ్ట్ అందుబాటులోకి వస్తేనే పంటలు వేస్తామని ఎదురుచూస్తున్నారు.