డ్రిప్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ ను ప్రభుత్వం పట్టించుకోవట్లే

డ్రిప్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ ను ప్రభుత్వం పట్టించుకోవట్లే
  • దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్న లక్షల మంది రైతులు
  • ధరల పెరుగుదలతో డ్రిప్ మెటీరియల్ ఇయ్యలేమంటున్న కంపెనీలు
  • రైతులకిచ్చే రాయితీలో కొంత కంపెనీలకు చెల్లిస్తున్నా ముందుకు రావట్లే
  • సబ్సిడీలో కోతతో రైతులపై అదనపు భారం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో డ్రిప్‌‌‌‌ సాగు కోసం ఉద్యానవన శాఖకు దరఖాస్తు పెట్టుకున్న రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. డ్రిప్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ పెంచాలని రైతులకు రాయితీలిస్తూ ప్రోత్సహిస్తున్న రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌ ప్రస్తుతం పట్టించుకోవడం లేదు. డ్రిప్‌‌‌‌కు వినియోగించే పైపులు, మెటీరియల్‌‌‌‌ ధరలు ఇటీవల పెరగడంతో సర్కారు ఇచ్చే రేట్లకు రైతులకు డ్రిప్‌‌‌‌ సామగ్రి అందించలేమంటూ కంపెనీలు చేతులెత్తేస్తున్నాయి. అంతేకాకుండా డ్రిప్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ చేసే రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలో కొంతమేర కంపెనీలకు అందిస్తూ... రైతులకు డ్రిప్‌‌‌‌ను అందజేస్తున్నాయి. దీంతో రైతులకు సబ్సిడీ అందకపోవడంతో పాటు వారిపై అదనపు భారం పడుతోంది. ఈ క్రమంలో సబ్సిడీలను అందించాలని రైతులు.. యూనిట్‌‌‌‌ ధరలు పెంచాలని కంపెనీలు రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌ను కోరుతున్నాయి. 

దరఖాస్తులు పెరుగుతున్నయ్.. 
రాష్ట్రవ్యాప్తంగా డ్రిప్‌‌‌‌ కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు హార్టికల్చర్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ పూర్తి స్థాయిలో అందించకపోవడంతో అప్లికేషన్లు భారీగా పెండింగ్‌‌‌‌లో పడుతున్నాయి. డ్రిప్‌‌‌‌ కోసం రైతుల నుంచి అప్లికేషన్లు పెరుగుతుండటంతో ఆ శాఖపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో రైతులకు ఇస్తున్న రాయితీల్లో కోత పెట్టి కంపెనీలకు ఆర్డర్లు ఇస్తున్నాయి. అయినా ధరలు పెంచకపోవడంతో తమకు గిట్టుబాటు కావడంలేదంటూ డ్రిప్‌‌‌‌ను ఇవ్వడానికి కంపెనీలు ముందుకు రావడంలేదు. రాష్ట్రంలో డ్రిప్‌‌‌‌ కంపెనీలు సుమారు 32కు పైగా ఉన్నాయి. గతంలో ఒక్క యూనిట్‌‌‌‌ ఏర్పాటుకు రూ.లక్ష ఖర్చయితే, ఇప్పుడు ధరల పెరుగుదలతో లక్షన్నర ఖర్చవుతుంది. డ్రిప్‌‌‌‌ ఎకరాల వారీగా కాకుండా స్థలం కొలతల ద్వారా ఏర్పాటు చేస్తారు. దీంతో ఏరియా, పంటను బట్టి డ్రిప్‌‌‌‌ ధరల్లో మార్పులుంటాయి.

రాయితీల్లోనూ కోత పెట్టి మరీ 
డ్రిప్‌‌‌‌కు ప్రభుత్వం 90 శాతం వరకు రాయితీ ఇస్తుండగా, మిగతా 10 శాతం రైతులు భరించేవారు. వీటిలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా అందిస్తారు. కానీ ప్రస్తుతం పెరిగిన ధరలతో 90 శాతం ఇస్తున్న రాయితీని తగ్గించి, ఇందులో కొంత భాగం కంపెనీలకు ఇస్తున్నారు. రైతుల రాయితీలో కోత విధించడంతో, దాదాపు ప్రతి రైతుపై రూ.50 వేల వరకు అదనపు భారం పడుతోంది. కాగా,  రైతుల రాయితీల్లో కోత విధించి కంపెనీలకు చెల్లిస్తున్నా.. తమకు గిట్టుబాటు కావడం లేదని కంపెనీలు అంటున్నాయి.