
- కామన్ రిక్రూట్మెంట్ బోర్డు రద్దుకు సర్కారు యోచన
- ప్రొఫెసర్ల నియామక ప్రక్రియపై త్వరలోనే నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఏండ్ల నుంచి ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. అయితే, కామన్ రిక్రూట్మెంట్ ఆలోచనను పక్కన పెట్టి.. వర్సిటీలవారిగానే నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలోని11 వర్సిటీల్లో 2,837 శాంక్షన్డ్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. కొత్తగా ప్రారంభించిన మహిళా వర్సిటీకి ఇంకా పోస్టులను మంజూరు చేయలేదు. అయితే, శాంక్షన్డ్ పోస్టుల్లో సుమారు 2 వేల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. గత బీఆర్ఎస్ సర్కారు వర్సిటీల్లో పోస్టులను భర్తీ చేస్తామంటూ ఐదేండ్ల కింద 1,061 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించింది. కానీ ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి వర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డు వేయాలని 2022 ఏప్రిల్లో రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఆ తర్వాతి రెండు నెలల్లోనే బోర్డు చైర్మన్గా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్, కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్ సెక్రెటరీగా, పలు శాఖల కార్యదర్శులను సభ్యులుగా ప్రకటించింది. దీనికి ఆమోదం కోసం అప్పట్లో గవర్నర్కు పంపించగా, ఆమె దాన్ని రాష్ట్రపతి భవన్కు పంపించారు. అప్పటి నుంచి ఆ ఫైల్ అక్కడే ఉంది. అయితే, ఆ తర్వాత దాని గురించి బీఆర్ఎస్ సర్కారు పట్టించుకోలేదు.
కామన్ రిక్రూట్మెంట్ బోర్డు రద్దు
గవర్నమెంట్ వర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ సర్కారు ఇదివరకే ప్రకటించింది. పది, 15 రోజుల్లో వీసీలను నియమిస్తామని, ప్రొఫెసర్ల నియామక ప్రక్రియను ప్రారంభిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే, యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డుపై స్పష్టత వస్తేనే నియామక ప్రక్రియ ముందుకు పోయే పరిస్థితి ఉంది. ప్రస్తుతం బోర్డు అంశం రాష్ట్రపతి పరిధిలో ఉంది. మరోపక్క బోర్డు ద్వారా రిక్రూట్మెంట్ చేస్తే.. వర్సిటీల స్వయం ప్రతిపత్తి పోతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బోర్డును రద్దు చేసి రాష్ట్రపతి భవన్కు ప్రభుత్వం సమాచారం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఆపై గతంలో మాదిరిగా యూనివర్సిటీల పరిధిలోనే నియమకాలు చేపట్టాలని యోచిస్తోంది. దీనికి అనుగుణంగా విద్యాశాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు.