చైనా ప్రధాన నగరాల్లో ఆంక్షల ఎత్తివేత

చైనా ప్రధాన నగరాల్లో ఆంక్షల ఎత్తివేత

తీవ్ర ఆందోళనలతో చైనా నిర్ణయం

బీజింగ్: చైనాలోని ప్రధాన నగరాల్లో కరోనా ఆంక్షలను అక్కడి ప్రభుత్వం ఎత్తేసింది. ఇటీవల ఒక అపార్ట్​మెంట్​లో మంటలు చెలరేగి పదిమంది చనిపోవడంతో జనం పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ప్రధాన నగరాలన్నింటిలో నిరసనలు తెలిపారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజులుగా చైనాలో డైలీ 30 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ ప్రజల ఆందోళనల నేపథ్యంలో కరోనా ఆంక్షలను చైనా సడలించింది. బీజింగ్, ఇతర సిటీల్లో జనం బస్సులు, సబ్​వేల్లో వెళ్లడానికి ఎలాంటి వైరస్​ టెస్ట్​ చేయించుకోనవసరంలేదని ప్రకటించింది. అయితే, జీరో కోవిడ్​ స్ట్రాటజీ ఇంకా అమలులోనే ఉంది.

నెగెటివ్​ టెస్ట్​ రిజల్ట్​ అవసరం లేదు

బీజింగ్, షాంఘై, జెంగ్జూ, షెన్​జెన్ తదితర నగరాల్లో పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​లో వెళ్లడానికి కరోనా టెస్ట్​ రిజల్ట్స్​ అవసరంలేదు. చెంగ్డూ, గువాంగ్జూ వంటి కొన్ని నగరాల్లో మాత్రం ఇది ఇంకా అమలులో ఉంది. బీజింగ్​లోని చాలా ప్రాంతాల్లో కరోనా టెస్టింగ్​ సెంటర్లను మూసివేసినా.. చాలా పబ్లిక్​ ఆఫీసుల్లో ఇప్పటికీ కరోనా టెస్టులు తప్పనిసరి అని అంటున్నారని జనం ఆరోపిస్తున్నారు. దీంతో ఉన్న కొద్ది టెస్టింగ్ సెంటర్ల దగ్గర భారీ సంఖ్యలో జనం క్యూ కడుతున్నారు. టెస్టింగ్​ తగ్గడంతో కొన్ని ఏరియాల్లో కరోనా కేసుల సంఖ్య కూడా తగ్గినట్టు కనిపిస్తోంది.

కరోనా.. మనిషి సృష్టించిందే

కరోనా వైరస్ మనిషి సృష్టించిందే అని అమెరికాకు చెందిన సైంటిస్ట్, చైనాలోని వుహాన్  ఇన్ స్టిట్యూట్  ఆఫ్  వైరాలజీ (డబ్ల్యూఐవీ) లో పనిచేసిన ఆండ్ర్యూ హఫ్  అన్నారు. డబ్ల్యూఐవీ ల్యాబ్ నుంచి ఆ వైరస్  లీక్  అయిందని ఆయన ఆరోపించారు. ‘ద ట్రూత్  అబౌట్ వుహాన్’  పేరిట బ్రిటిష్  న్యూస్ పేపర్ ‘ద సన్’ కు హఫ్ రాసిన వ్యాసంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. చైనాలో వైరస్ లపై పరిశోధనలకు అమెరికా ప్రభుత్వం ఫండింగ్ చేయడమే కరోనా వ్యాప్తికి కారణమైందని ఆరోపించారు. ‘‘చైనాలోని జెనెటిక్  ల్యాబ్, వుహాన్​ ల్యాబ్​లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా పరిశోధనలు చేశారు. అందువల్లే కరోనా వైరస్  లీకయింది”  అని హఫ్​ ఆ వ్యాసంలో వివరించారు.