కాలేజీల దోపిడిపై సర్కార్ సప్పుడు జేస్తలేదు

కాలేజీల దోపిడిపై సర్కార్ సప్పుడు జేస్తలేదు
  • రూ. 11 కోట్లు దోచినా సర్కారు సప్పుడు జేస్తలేదు
  • పారామెడికల్ అక్రమాలపై ప్రభుత్వం సైలెంట్
  • ఎంక్వైరీ పేరిట 2 నెలలుగా కాలయాపన
  • మేనేజ్‌మెంట్లపై చర్యలు శూన్యం 
  • యథేచ్ఛగా కొనసాగుతున్న అడ్మిషన్ల ప్రక్రియ

హైదరాబాద్, వెలుగు: పారామెడికల్ కాలేజీల దోపిడిపై సర్కారు సప్పుడు జేస్తలేదు. ప్రభుత్వ ఖజానా నుంచి రూ.11 కోట్లు దోచుకున్నా, కాలేజీల యాజమాన్యాలపై ఇప్పటివరకు చర్యలు ప్రారంభించలేదు. ఎంక్వైరీ పేరుతో 2 నెలల నుంచి టైమ్‌ వేస్ట్ చేస్తోంది. మరోవైపు తమ దందాను రెగ్యులరైజ్ చేయించుకునేందుకు కాలేజీల యాజమాన్యాలు పైరవీలు చేయిస్తున్నట్టు సమాచారం. దీనిపై మే నెల చివరిలోనే ‘వెలుగు’ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో హెల్త్ సెక్రటరీ రిజ్వీ ఎంక్వైరీకి ఆదేశించారు. విచారణ నత్తనడకన సాగుతుండగా, 2019–20 అకడమిక్​ ఇయర్​అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. గడిచిన కాలానికి ఇప్పుడు ఎలా అడ్మిషన్ నోటిఫికేషన్‌‌ ఇచ్చారని, ఇప్పుడు కాలేజీల్లో చేరే స్టూడెంట్లకు 2019–20 విద్యా సంవత్సరంలో చదువులు ఎట్ల చెప్తారన్న ప్రశ్నలకు సర్కార్ వద్ద సమాధానం లేదు. అలా చేయడం సాధ్యం కాదంటున్న ఆఫీసర్లు, అడ్మిషన్ల ప్రక్రియను మాత్రం ఆపడం లేదు. ఇప్పటికే ఈ వ్యవహారంలో రూ.కోట్లు చేతులు మారగా, మరోసారి అదే దందా సాగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.  ఇందులో ప్రభుత్వ పెద్దల ప్రమేయముందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

అసలేం జరిగింది?
రాష్ట్రంలో సుమారు 206 కాలేజీలకు ప్రభుత్వ గుర్తింపు లేదు. పారా మెడికల్ బోర్డు ఇచ్చిన గుర్తింపుతోనే కొన్నేండ్ల పాటు ఇవి నడిచాయి. 2019లో ఈ విషయాన్ని గుర్తించిన అప్పటి పారా మెడికల్ బోర్డు సెక్రటరీ గోపాల్‌‌‌‌‌‌రెడ్డి.. ఆయా కాలేజీల్లో అడ్మిషన్లకు నిరాకరించారు. అయినా ఆ కాలేజీలు స్టూడెంట్లను చేర్చుకున్నాయి. అడ్మిషన్లు జరుగుతుండగానే బోర్డు సెక్రటరీ మారిపోవడం కాలేజీల యాజమాన్యాలకు కలిసొచ్చింది. పర్మిషన్ లేని కాలేజీలు స్టూడెంట్లను చేర్చుకున్న విషయాన్ని కొత్త సెక్రటరీ పట్టించుకోలేదు. సెకండ్ ఇయర్ స్టూడెంట్ల రియింబర్స్‌‌మెంట్‌‌, స్కాలర్‌‌‌‌షిప్‌‌ రెన్యువల్ కోసం బోర్డు ఇచ్చిన లాగిన్‌‌తో, దొడ్డిదారిలో చేర్చుకున్న స్టూడెంట్లకు కూడా రియింబర్స్‌‌మెంట్, స్కాలర్‌‌‌‌షిప్‌‌ల కోసం అప్లికేషన్లు పెట్టించారు. బోర్డు సెక్రటరీ ఈ విషయాన్ని గుర్తించలేదో, గుర్తించి కూడా కాలేజీల యాజమాన్యాలకు సహకరించారో తెలియాల్సి ఉంది. మొత్తానికి కనీసం పర్మిషన్ లేకుండానే సుమారు 5 వేల మంది స్టూడెంట్ల పేరిట రియింబర్స్‌‌మెంట్, స్కాలర్‌‌‌‌షిప్‌‌లు కాలేజీల యాజమాన్యాలకు విడుదలయ్యాయి. ఒక్కో స్టూడెంట్‌‌కు రూ.18 వేల రియింబర్స్‌‌మెంట్, రూ.4 వేల స్కాలర్‌‌‌‌షిప్‌‌ చొప్పున రూ.10  నుంచి రూ.11 కోట్ల దోపిడీ జరిగింది. సెకండ్ ఇయర్‌‌‌‌ రియింబర్స్‌‌మెంట్, స్కాలర్‌‌‌‌షిప్‌‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 

చర్యలు ఏవి?
పారామెడికల్ స్టూడెంట్లకు రెండేండ్లకు ఓసారి ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. దొడ్డిదారిలో చేరిన స్టూడెంట్లకు ఎగ్జామ్స్ పెట్టాలంటే, తొలుత ఆయా కాలేజీలకు పర్మిషన్ ఉండాలి. అలాగే అడ్మిషన్ నోటిఫికేషన్‌‌లో ఆయా కాలేజీల పేర్లు ఉండాలి. ఈ నేపథ్యంలో 2019–20 అకడమిక్ ఇయర్‌‌ అడ్మిషన్ నోటిఫికేషన్‌‌కు, ఎక్స్‌‌టెన్షన్ పేరిట 2 నెలల క్రితం బోర్డు నుంచి నోటిఫికేషన్ ఇప్పించుకున్నారు. రెండేండ్ల కింద చేర్చుకున్న స్టూడెంట్లనే ఇప్పుడు చేర్చుకుంటున్నట్టుగా డ్రామా నడిపిస్తున్నారు. ఇదంతా తెలిసి కూడా ఉన్నతాధికారులు, సర్కార్ పెద్దలు మౌనం వహిస్తుండడం గమనార్హం.