రైతులకు పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాల స్కీమ్​ను ఆపేసిన సర్కార్

రైతులకు పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాల స్కీమ్​ను ఆపేసిన సర్కార్
  • రైతుల నుంచే వడ్డీ వసూల్
  • పావలా వడ్డీ, వడ్డీ లేని క్రాప్​ లోన్లపై స్పందన లేని సర్కార్
  • నాలుగేండ్ల బకాయిలు రూ.978 కోట్లు.. ఈ రెండేళ్లలో మరో రూ.600 కోట్లు?
  • మొన్నటి ఎస్ఎల్​బీసీ మీటింగ్​లోనూ దాటవేత
  • రెండేండ్లుగా స్కీమ్​ అమలుకు ఆర్డర్లే ఇస్తలేరు
  • రైతుల నుంచే వసూలు చేస్తున్న బ్యాంకులు

హైదరాబాద్, వెలుగు: రైతులకు పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాల స్కీమ్​ను రాష్ట్ర సర్కార్ ఆపేసింది. బ్యాంకులు రైతుల దగ్గరనే ఆ లోన్ల వడ్డీ వసూలు చేసుకోవాలని చెప్పకనే చెప్పింది. రెండేండ్లుగా స్కీమ్ ​అమలుకు సంబంధించి సర్కార్ ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. మంగళవారం జరిగిన స్టేట్ లెవెల్​బ్యాంకర్ల కమిటీ మీటింగ్​లోనూ ఈ విషయాన్ని బ్యాంకర్లు సీఎస్ సోమేశ్​​కుమార్​ దృష్టికి తీసుకువచ్చినప్పటికీ, ఆయన స్పందించకుండా దాటవేసినట్లు తెలిసింది. కనీసం పెండింగ్ బకాయిలు ఎప్పుడిస్తారని అడిగితే, చూద్దాంలే అనే సమాధానం ప్రభుత్వం నుంచి వచ్చినట్లు బ్యాంకర్లు చెప్తున్నారు. ఇలాగైతే రైతుల దగ్గరే వసూలు చేయాల్సి ఉంటుందని చెప్పినప్పటికీ దీనిపై ఏం మాట్లాడలేదని సమాచారం. స్కీమ్​కొనసాగించేందుకు సర్కార్​కు వ్యవసాయ శాఖ ప్రపోజల్స్​పంపినా దానిపై నిర్ణయం తీసుకోలేదు. 2021–22కి సంబంధించి కూడా బడ్జెట్​లో వడ్డీలకు కేటాయింపులు చూపించలేదు. పేరుకుపోయిన పాత బకాయిలు, రెండేండ్లకు సంబంధించిన పంట రుణాల మిత్తిలను బ్యాంకులు రైతుల నుంచే వసూలు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు సర్కార్ ఫండ్స్ రిలీజ్ చేస్తుంది కదా అని ఇన్ని రోజులు ఆగినప్పటికీ, అక్కడి నుంచి సరైన రెస్పాన్స్ లేకపోవడంతో వాళ్లు కూడా రైతుల నుంచే మిత్తి వసూలు చేసేందుకు రెడీ అయ్యారు. అసలే కరోనా కష్ట కాలం కాగా, పంట రుణం వడ్డీ భారం కూడా మీద పడుతుండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. 

కేంద్రం వాటా ఇస్తున్నా.. రాష్ట్రం ఇస్తలేదు
2015–16 నుంచి 2018–19 వరకు వీఎల్ఆర్, పీవీ బకాయిలు మొత్తం రూ.978 కోట్లు ఉన్నాయి. అయితే 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాల లెక్కలు తీస్తే ఈ మొత్తం దాదాపు రూ. 1500 కోట్లు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు బ్యాంకులు ఈ బకాయిలన్నింటిని రైతుల నుంచే వసూలు చేస్తున్నాయి. సర్కార్ ఇస్తుంది కదా అని ఎవరైనా అడిగితే వాళ్లకు కొత్త లోన్ ఇస్తలేరు. పంట రుణాలు రెండు రకాలున్నాయి. ఇందులో లక్ష రూపాయాలలోపు తీసుకుంటే ఏడు శాతం వడ్డీ కట్టాల్సి ఉంటుంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఆర్​బీఐ నుంచి మూడు శాతం వడ్డీ చెల్లిస్తే, రాష్ట్ర ప్రభుత్వం నాలుగు శాతం చెల్లిస్తుంది. దీంతో రూ. ఒక లక్ష క్రాప్ లోన్ తీసుకున్న రైతు, ఏడాది లోపు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తే వడ్డీ మాఫీ వర్తిస్తుంది. ఇలా లక్షల మంది రైతులు ఏడాది లోపు తమ పంట రుణాలను ఎప్పటికప్పుడు రెన్యువల్​చేసుకుంటున్నారు. అయితే వడ్డీ మాత్రం బ్యాంకులు రైతుల మీదనే మోపుతున్నాయి. ఇక రూ.1లక్ష  నుంచి రూ.3 లక్షల వరకు తీసుకుంటే రైతులు పావలా వడ్డీ మాత్రమే కట్టాల్సి ఉంటుంది. ఇందులో ఒక శాతం రాష్ట్రం, మూడు శాతం కేంద్రం, మరో మూడు శాతం రైతులు భరించాలి. కేంద్ర నిధులు వస్తున్నా, రాష్ట్ర సర్కార్ మాత్రం విడుదల చేస్తలేదు. 

బడ్జెట్​లో పెడుతున్నరు కానీ రిలీజ్ చేస్తలేరు
వడ్డీ బకాయిలకు సంబంధించి ఏటా ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. 2015 నుంచి వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి బీఆర్​వోలు ఇచ్చింది. కానీ ఆర్థిక శాఖ నయా పైసా రిలీజ్ చేయలేదు.

54 వేలు కట్టించుకున్నరు
క్రాప్ లోన్ కింద రూ.50 వేలు తీసుకున్న. ఏడాది లోపు కడితే వడ్డీ మాఫీ అయితదని బ్యాంకుకు కట్టడానికి పోతే రూ.54 వేలు కట్టించుకున్నరు. రూ.4 వేలు ఎక్కువ ఎందుకని అడిగితే.. వడ్డీ కింద జమ చేసుకున్నమని చెప్పిండ్రు.
- రాజిరెడ్డి, యదాద్రి భువనగిరి జిల్లా