కల్వకుర్తి ఘటనపై ముందే హెచ్చరించినా పట్టించుకోని ప్రభుత్వం

కల్వకుర్తి ఘటనపై ముందే హెచ్చరించినా పట్టించుకోని ప్రభుత్వం

కల్వకుర్తిని నిర్లక్ష్యమే ముంచింది!

పాలమూరు బ్లాస్టింగ్స్‌‌పై నెల రోజుల ముందే హెచ్చరించిన ఎస్‌‌ఈ

పంపుహౌజ్, స్విచ్​యార్డుల్లో ప్రకంపనలు వస్తున్నాయంటూ లెటర్

ఏ మాత్రం స్పందించని రాష్ట్ర సర్కారు

ఈ నిర్లక్ష్యంతోనే పంపుహౌజ్​ మునిగిందంటున్న ఇంజనీర్లు

దీనిపై ట్వీట్​ చేసిన ఎంపీ రేవంత్‌‌రెడ్డి

హైదరాబాద్‌‌, వెలుగు: కల్వకుర్తి లిఫ్ట్‌‌ ఇరిగేషన్​ స్కీంలోని ఎల్లూరు పంపుహౌస్‌‌ను రాష్ట్ర సర్కార్​ నిర్లక్ష్యమే నిండా ముంచింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంపుహౌస్‌‌ కోసం చేస్తున్న బ్లాస్టింగ్‌‌లతో ఎల్లూరు పంపుహౌస్‌‌లో వైబ్రేషన్స్‌‌ వస్తున్నాయని కల్వకుర్తి ప్రాజెక్టు ఎస్‌‌ఈ స్వయంగా లెటర్​ రాసినా, కాంట్రాక్టు సంస్థ పలుమార్లు ఫిర్యాదు చేసినా సర్కారు పట్టించుకోలేదు. ప్రాజెక్టు విషయంలో సీఎం కేసీఆర్​ గుడ్డిగా వ్యవహరించడంతోనే పంపుహౌస్‌‌ మునిగిందన్న విమర్శలు వస్తున్నాయి. బ్లాస్టింగ్స్​ ఆపాలంటూ పాలమూరు- రంగారెడ్డి నాగర్‌‌ కర్నూల్‌‌ ఎస్‌‌ఈకి కల్వకుర్తి ఎస్ఈ సెప్టెంబర్‌‌ పదో తేదీన లెటర్​ రాశారు. బ్లాస్టింగ్స్‌‌ కారణంగా పంపు హౌస్‌‌తోపాటు స్విచ్‌‌ యార్డ్‌‌ కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని, ఆ లెటర్​ కాపీని ఎంపీ రేవంత్‌‌ రెడ్డి బుధవారం ట్వీట్‌‌ చేశారు.

రక్షణ చర్యలైనా తీసుకోలే..

కల్వకుర్తి లిఫ్ట్‌‌ స్కీంలో మొదటి పంపుహౌస్‌‌ ఎల్లూరు గ్రామంలోని రేగుమాన్‌‌ వద్ద ఉండగా.. దానికి 300 మీటర్ల దూరంలోనే డేగలబండ వద్ద పాలమూరు- రంగారెడ్డి మొదటి పంపుహౌస్‌‌ నిర్మిస్తున్నారు. వాస్తవానికి మొదట పాలమూరు పంపుహౌజ్​ను ఎల్లూరు నుంచి ఒకటింపావు కిలోమీటర్ల (1.25 కిలోమీటర్ల) దూరంలో ఓపెన్‌‌ కట్‌‌ పంపుహౌస్‌‌గా ప్రతిపాదించారు. కానీ అప్పుడు పనులు పొందిన వర్క్‌‌ ఏజెన్సీ నవయుగ సంస్థ అండర్‌‌ గ్రౌండ్‌‌లో చేపట్టేందుకు లాబీయింగ్‌‌ చేసి సర్కారును ఒప్పించింది. ఏడాది కింద ప్రభుత్వం నవయుగ నుంచి మేఘా ఇంజనీరింగ్‌‌ కంపెనీకి ఈ పంపుహౌస్‌‌ పనులను బదలాయించింది. అప్పటినుంచి మేఘా కంపెనీ సిబ్బంది రోజూ పంపుహౌస్‌‌, టన్నెల్‌‌ తవ్వకం కోసం భూగర్భంలో డైనమైట్లతో పేలుళ్లు జరుపుతున్నారు. ఈ పేలుళ్లతో కల్వకుర్తి పంపుహౌస్‌‌లో ప్రకంపనలు వస్తున్నాయంటూ ప్రాజెక్టు మెయింటెనెన్స్​ చూస్తున్న కాంట్రాక్టు సంస్థ పటేల్‌‌ ఇంజనీరింగ్‌‌ లిమిటెడ్‌‌ పలుమార్లు ప్రాజెక్టు ఎస్‌‌ఈకి కంప్లయింట్​చేసింది.

నష్టాన్ని గుర్తించి లెటర్​ రాసినా..

కల్వకుర్తి ఎస్‌‌ఈ, ఎల్లూరు పంపుహౌస్‌‌ ఫీల్డ్‌‌ ఇంజనీర్లు కూడా పాలమూరు పేలుళ్ల టైంలో పంపుహౌస్‌‌ కంట్రోల్‌‌ రూమ్‌‌లో ప్రకంపనలను గుర్తించారు. పాలమూరు పంపుహౌస్‌‌ వర్క్‌‌ ఏజెన్సీ భూగర్భంలో తరచూ పేలుళ్లు జరుపుతోందని.. దానివల్ల స్విచ్‌‌ యార్డ్​తోపాటు పంపుహౌస్‌‌లో ప్రకంపనలు వస్తున్నాయని పేర్కొంటూ పాలమూరు ఎస్‌‌ఈకి లెటర్​ రాశారు. కల్వకుర్తి పంపుహౌస్‌‌కు నష్టం వాటిల్లకుండా ఉండాలంటే.. పేలుళ్లను వెంటనే ఆపేయడంతోపాటు రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. సెప్టెంబర్‌‌ 15న ఈ లెటర్​ను రిసీవ్‌‌ చేసుకున్న మహబూబ్‌‌నగర్‌‌ ప్రాజెక్టుల సీఈ.. పాలమూరు ప్రాజెక్టు ఎస్‌‌ఈకి ఫార్వర్డ్‌‌ చేశారు. తర్వాత ఆ లెటర్​ ఉన్నతాధికారులకు చేరింది. అయినా సర్కారు నుంచి ఎలాంటి రెస్పాన్స్​ రాలేదు. ఇప్పుడు అదే పేలుళ్ల ఎఫెక్ట్​తో పంపుహౌస్‌‌ నీటిలో మునిగిపోయిందని సీనియర్​ ఇంజనీర్లు చెప్తున్నారు.

ఘటనపై రిపోర్టు ఇవ్వండి

బీసీ కమిషన్​ మెంబర్​ ఆచారి ఆదేశం

కల్వకుర్తి పంపు హౌస్​ ప్రమాదంపై రిపోర్టు ఇవ్వాలని ఆఫీసర్లను జాతీయ బీసీ కమిషన్​ మెంబర్​ టి.ఆచారి ఆదేశించారు. బుధవారం పంపుహౌస్​ను ఆయన పరిశీలించారు. ఎత్తిపోతల పథకాల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, కల్వకుర్తి ఇంచార్జీ సీఈ అంజయ్య, నాగర్​ కర్నూల్​ అదనపు కలెక్టర్​ హన్మంతరెడ్డి తదితరులు ఘటన జరిగిన తీరును ఆచారికి వివరించారు. పంప్​హౌజ్​లోకి చేరిన నీటి తోడివేత ప్రక్రియ ప్రారంభించామని ఇప్పటికి దాదాపు 10 మీటర్ల వరకు నీటిని తోడిపోసినట్లు చెప్పారు.

ఇది కల్వకుంట్ల ధనదాహం: రేవంత్

కల్వకుర్తి పంపుహౌజ్​ విషయంగా రాష్ట్ర సర్కా రు, సీఎం కేసీఆర్​ తీరుపై ఎంపీ రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ‘‘ఇరిగేషన్‌‌ ప్రాజెక్టుల గురించి తన కన్నా తెలిసినోడు ఎవడని చెప్పే కేసీఆర్‌‌ తీరుతోనే కల్వకుర్తి పంపుహౌస్‌‌ మునిగిపోయింది. ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్‌‌కు ఏపాటి జ్ఞానం ఉన్నదో కల్వకుర్తి ఎస్‌‌ఈ రాసిన హెచ్చరిక లేఖతోనే తేలిపోయిం ది. ఇది కల్వకుంట్ల అజ్ఞానమా.. ధనదా హమా..?’’అని ఎంపీ రేవంత్‌‌రెడ్డి ట్వీట్‌‌ చేశారు. పాలమూరు లిఫ్ట్‌‌ పనులతో కల్వకుర్తి పంపుహౌస్‌‌లో ప్రకంపనలు వస్తున్నాయని పేర్కొంటూ సర్కారుకు కల్వకుర్తి ఎస్‌‌ఈ రాసిన లెటర్‌‌ను కూడా పోస్ట్‌‌ చేశారు.

For More News..

‘ధరణి’లో వ్యవసాయేతర ఆస్తులను ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చు

డబ్బు పంచకుండా గెలవగలవా? సీఎం కేసీఆర్‌కు వివేక్ సవాల్