రైతుబంధుకు కోతలు పెట్టేందుకు సన్నాహాలు

 రైతుబంధుకు కోతలు పెట్టేందుకు సన్నాహాలు
  • రాళ్లు, గుట్టలు, వాగులు ఉన్న ఏరియాలను గుర్తించే పనిలో సర్కార్
  • ధరణిలో, పాస్ పుస్తకాల్లో పూటు ఖరాబుగా నమోదు
  • ఆర్డీవోలకు సీసీఎల్ఏ ఆదేశాలు
  • దీని వల్ల ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వ భావన

హైదరాబాద్, వెలుగు: వ్యవసాయానికి పనికిరాని భూములకు రైతుబంధు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం గ్రామాల్లో వ్యవసాయ అవసరాలకు పనికి రాకుండా ఉండి, రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూములుగా కొనసాగుతున్న వాటి వివరాలను గుర్తించే పనిలో పడింది. ఇలాంటి భూములను గుర్తించి ప్రత్యేకంగా ‘పూటు ఖరాబు’గా నమోదు చేయాలని ఆర్డీవోలను సీఎస్, ఇన్​చార్జ్​ సీసీఎల్ఏ సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఫీల్డ్ విజిట్ చేసి ధరణి, పాస్ పుస్తకాల్లోనూ మార్పులు చేయాలని‌‌ సూచించారు. పట్టా భూముల్లోని గుట్టలు, రాళ్లు, వాగులు, కుంటలు, పశువుల మేతకు వదిలేసిన కంచెలకు ప్రస్తుతం ఇస్తున్న రైతుబంధును నిలిపివేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్రత్యేకంగా పూటు ఖరాబు కేటగిరీలోకి..
వాస్తవానికి రాష్ట్రంలో 1954–55లో సేత్వారీ రికార్డు రూపొందించిన సమయంలో వ్యవసాయానికి వినియోగించని భూములను రికార్డుల్లో పూటు ఖరాబు, పోరంబోకు, బంచరాయిగా నమోదు చేశారు. ఆ తర్వాతి నీటి వసతి పెరిగాక రైతులు ఇలాంటి భూములను అభివృద్ధి చేసి సాగుకు అనువుగా మార్చుకున్నారు. లేదంటే తోటల పెంపకం చేపట్టారు.

ఇంకా చాలా చోట్ల పట్టా భూముల్లోని గుట్టలు, వాగులు, నీటి కుంటలు, పశువుల మేతకు వదిలేసిన కంచెలు, ట్రాక్టర్, గొడ్ల షెడ్లు, కల్లాలు, పెంట కుప్పలు, నీటి కోతకు గురైన భూములు సాగుకు పనికి రాకుండా ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూములుగానే నమోదయ్యాయి. ఇలాంటి భూములను డీమార్కేషన్ చేసి ప్రత్యేకంగా పూటు ఖరాబు కేటగిరీలోకి చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ముందుగా రైతుల నుంచే అప్లికేషన్లు
సాగుకు వాడని భూములను పూటు ఖరాబు కింద చేర్చేందుకు రైతుల నుంచే అప్లికేషన్లు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీవోలను ఆదేశించింది. రైతు దరఖాస్తు పెట్టుకున్నాక సంబంధిత ఆర్డీవో ఫీల్డ్ విజిట్ చేసి పూటు ఖరాబు విస్తీర్ణాన్ని గుర్తించి డీమార్కేషన్ చేస్తారు. అనంతరం ధరణిలో సదరు రైతు వ్యవసాయ భూమి నుంచి ఆ మేరకు విస్తీర్ణాన్ని తొలగించి, పూటు ఖరాబుగా నమోదు చేస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు.
ఈ వివరాలను పట్టాదారు పాస్ బుక్ లోని రిమార్క్స్ కాలంలోనూ నమోదు చేస్తారు. తొలుత రైతుల నుంచే సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటున్నప్పటికీ.. ఆ తర్వాత దశలో ప్రత్యేక డ్రైవ్ ద్వారా ప్రభుత్వమే పూటు ఖరాబు భూములను గుర్తించే అవకాశముందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. దీంతో రైతుబంధు అనర్హులకు చేరకుండా చూడడంతో పాటు ఆర్థిక భారం కూడా తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.