రవీంద్రనగర్లోని కర్జెల్లీ ఫారెస్ట్ ఆఫీస్ ముందు దిందా పోడు రైతుల ధర్నా

రవీంద్రనగర్లోని కర్జెల్లీ ఫారెస్ట్ ఆఫీస్ ముందు దిందా పోడు రైతుల ధర్నా
  • గ్రామస్తుడిని అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్​అధికారులు
  • వ్యతిరేకిస్తూ గ్రామస్తుల ఆందోళన

కాగజ్ నగర్, వెలుగు: చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన డగే సురేశ్ అనే వ్యక్తిని గురువారం ఫారెస్ట్ ఆఫీసర్లు అదుపులోకి తీసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఉదయం 11 గంటల సమయంలో సురేశ్ తన భార్యతో కలిసి చింతల మానేపల్లికి బైక్​పై వెళ్తుండగా.. ఖర్జెల్లి అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డగించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. సురేశ్ గ్రామంలో స్లాబ్ ఇల్లు కట్టుకున్నాడు. అయితే రిజర్వ్ ఫారెస్ట్ భూమిని ఆక్రమించి ఇల్లు కట్టారని, ఫారెస్ట్ ​ఆఫీసర్లు నోటీస్ ఇచ్చారు. సురేశ్ నోటీస్ తీసుకోకపోవడంతో ఇంటికి నోటీస్ ఫ్లెక్సీ కట్టారు. 

ఈ క్రమంలోనే ఫారెస్ట్ ఆఫీసర్లు అతడిని అదుపులోకి తీసుకు న్నారు. విషయాన్ని భార్య మంగళ గ్రామస్తులు, కుటుంబీకులకు తెలియజేయడంతో.. గ్రామస్తులు, పోడు రైతులు మూకుమ్మడిగా రవీంద్రనగర్​లోని కర్జెల్లీ  ఫారెస్ట్ రేంజ్ అఫీస్ వద్దకు చేరుకొని ధర్నా చేపట్టారు. అప్పటికే ఆఫీస్ టైమ్ అయిపోవడంతో ఆఫీస్​కు తాళం వేసి వెళ్లినా.. గ్రామస్తులు మాత్రం అక్కడే ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న కౌటాల సీఐ ముత్యం రమేశ్ అక్కడికి చేరుకొని వారికి సర్దిచెప్పినా వినలేదు. సురేశ్​ను అదుపులోకి తీసుకున్న విషయమై కాగజ్ నగర్ ఎఫ్​డీఓ సుశాంత్ సుఖ్​దేవ్​ను వివరణ కోరగా.. నిబంధనల మేరకు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.