కొత్త పింఛన్లపై ఊరించుడే

కొత్త పింఛన్లపై ఊరించుడే
  • 57 ఏండ్లు నిండినోళ్లకు ‘ఆసరా’ ఇస్తమని 2018 మేనిఫెస్టోలో హామీ
  • ఏడాది కింద జీవో విడుదల.. ఏప్రిల్​ నుంచి ఇస్తమంటూ మొన్న అసెంబ్లీలో ప్రకటన
  • రెండు, మూడు నెలల తర్వాత వస్తయన్న మంత్రి కేటీఆర్​
  • సర్కార్​ నుంచి ఆదేశాలు లేవని, ఎప్పుడిస్తమో చెప్పలేమంటున్న ఆఫీసర్లు
  • కొత్తగా 65 ఏండ్లు నిండినోళ్లకు కూడా పెన్షన్​ వస్తలే
  • 13.7 లక్షల మంది ఎదురుచూపులు

హైదరాబాద్​, వెలుగు: ఆసరా కొత్త పింఛన్లపై రాష్ట్ర సర్కార్​ మూడున్నరేండ్లుగా ఊరిస్తూనే ఉంది. రేపో మాపో ఇస్తామంటూ సాగదీస్తున్నది. దీంతో లక్షల మంది అర్హులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఎప్పుడు పెన్షన్​ ఇస్తరంటూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. వచ్చే నెల నుంచే కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని మొన్న అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాల్లో ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు దానిని ఇంకో మూడు నెలలు ముందుకు జరిపింది. అప్పటి నుంచైనా ఇస్తరా అంటే.. దానిపైనా క్లారిటీ లేదు. పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు వచ్చే నెల నుంచే పెండింగ్​ పెన్షన్లు అన్నీ ఇస్తామని అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాల్లో  చెప్పారు. ఆర్థిక మంత్రి  హరీశ్​రావు 57 ఏండ్లు పైబడిన వారికి ఈ ఆర్థిక సంవత్సరం నుంచి పెన్షన్లు ఇవ్వనున్నట్లు బడ్జెట్​ ప్రసంగంలో ప్రకటించారు. 

ఉన్నోళ్లకూ నెలఖారుకు ఇస్తున్నరు
ఆసరా పెన్షన్​ ఉన్నోళ్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం లేటుగా డబ్బులు ఇస్తున్నది. ప్రతినెలా మొదటి వారంలోపే పూర్తి కావాల్సిన ఆసరా పెన్షన్ల పంపిణీ గత కొన్ని నెలలుగా 20 తారీఖు తర్వాతే వస్తున్నాయి. ఈ నెలలో అయితే 23, 24 తేదీల్లో పంపిణీ చేశారు. ఒక్కో నెలలోనైతే 28,29 తేదీల్లో ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రతి నెలా రాష్ట్రవ్యాప్తంగా 38.41 లక్షల మంది ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారు. ఇందులో వృద్ధాప్య, వితంతువులకు పెన్షన్లే 28 లక్షలు ఉన్నాయి. 

అయితే ఇప్పటిదాకా ఆసరా అప్లికేషన్లపై ఎంక్వైరీ పూర్తి కాకపోవడం, ఆఫీసర్లు కూడా పైనుంచి ఆదేశాలు లేవని, ఎప్పుడిస్తామో చెప్పలేమని అంటున్నారు. ఇప్పుడున్న ఆసరా పెన్షన్లే ప్రతి నెలా 20వ తేదీ తరువాత ఇస్తున్నామని చెబుతున్నారు. ఇటీవల గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో జరిగిన ఓ పబ్లిక్​ మీటింగ్​లో మంత్రి కేటీఆర్​ మాట్లాడుతూ.. రెండు, మూడు నెలల్లో కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రకటించారు. అంటే.. వచ్చే నెల నుంచి కూడా కొత్త పెన్షన్లు వచ్చే పరిస్థితి లేదు.  57 ఏండ్లు నిండివాళ్లకు ఆసరా పెన్షన్లు ఇస్తామని 2018 ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్​ఎస్​ హామీ ఇచ్చింది. ఆ హామీ ఇప్పటి వరకు అమలు కాలేదు. పైగా ఈ మూడున్నరేండ్లలో 65 ఏండ్లు నిండినవాళ్లకు, ఒంటరైన మహిళలకు, దివ్యాంగులకు కూడా పెన్షన్​ రావడం లేదు.  బై ఎలక్షన్స్​ జరిగిన చోట్ల అప్పటి మందం కొందరికి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని, అసలు ఇస్తరా లేదా అని పబ్లిక్​ ప్రశ్నిస్తున్నారు. 

ఏడాది కింద జీవో ఇచ్చి..!
ఆసరా పెన్షన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 13.7 లక్షల మంది ఎదరుచూస్తున్నారు. నిరుడు జులైలో సిరిసిల్లలో పర్యటన సందర్భంగా 2018 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్న విధంగా ఆసరా పెన్షన్ల వయస్సును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించి పెన్షన్లు ఇస్తామని సీఎం ప్రకటించారు. అదే నెలలో ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. మీ సేవ కేంద్రాల ద్వారా అప్లికేషన్లు తీసుకుంది. ఇందులో 10.5 లక్షల మంది అప్లయ్​ చేసుకున్నారు. అంతకు ముందే 65 ఏండ్లు పైబడిన వాళ్లు దాదాపు మూడు లక్షల మంది దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. వీటిని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో ఇతర ఆఫీసర్లు ఎప్పటికప్పుడు వెరిఫై చేసి ప్రభుత్వానికి అప్పట్లోనే  రిపోర్ట్ చేశారు. ఆన్​లైన్​లో అప్లికేషన్లను అప్రూవ్డ్​గా చూపిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోవడంతో పెన్షన్​ శాంక్షన్ చేయడం లేదు. సర్కార్​ కొత్త అప్లికేషన్లు తీసుకోవడంతో 2021 సెప్టెంబర్​ నుంచే ఆసరా పైసలు వస్తాయని అందరూ ఆశించారు. కానీ ఇదిగో ఇప్పుడు, అప్పుడు అంటూ ఊరించుడే తప్ప కొత్తవాటికి అప్రూవల్స్​ ఇవ్వడం లేదు. బడ్జెట్​ సెషన్స్​ కంటే ముందు ఫిబ్రవరిలో మంత్రి కేటీఆర్ ఏప్రిల్​ నుంచి కొత్త పెన్షన్స్​ ఇస్తామని ప్రకటించారు. ఇటీవల జరిగిన ఇంకో మీటింగ్​లో ఆయన రెండు, మూడు నెలలు అని చెప్పారు. దీంతో అర్హులు ఇంకెప్పుడు ఇస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. మళ్లీ ఎలక్షన్స్​ వస్తేగానీ ఇవ్వరా అని మండిపడుతున్నారు. ​  

నాలుగేండ్లుగా ఎదురుచూస్తున్న 
నాలుగేండ్ల కిందట నా  భర్త చనిపోయిండు. వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న. ఏండ్లు గడుస్తున్నయ్. పింఛన్  మాత్రం  వస్తలేదు. ఆఫీసర్లను అడిగితే ఇప్పుడే రాదు.. వచ్చినప్పుడు ఇస్తం అంటున్నరు. వయసైపోయిన మాలాంటోళ్లు ఏం పని చేస్తరు. గవర్నమెంటు ఆలోచించాలె. ఇప్పటికైనా స్పందించి పింఛన్ త్వరగా వచ్చేలా చూడాలె.
‑ మామిడి రాములమ్మ, తుంగతుర్తి, సూర్యాపేట జిల్లా

ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా

నా  భర్త 2018లో చనిపోయిండు. ఆ తరువాత నాకు ఆసరా పింఛన్ ఇయ్యమని పంచాయతీ ఆఫీస్ ల, మండల ఆఫీస్ ల అప్లికేషన్ ఇచ్చిన. కానీ నాలుగేండ్లు అయినా నాకు పింఛన్ శాంక్షన్ కాలేదు. ఇప్పుడు, అప్పుడు అనుడే ఉన్నది. ఎప్పుడిస్తారో ఏమో!
- రంగంపేట లచ్చమ్మ, కౌడిపల్లి, మెదక్ జిల్లా