అన్ని వర్సిటీల్లో నియామకాలకు ఒకటే బోర్డు

అన్ని వర్సిటీల్లో నియామకాలకు ఒకటే బోర్డు
  • మెడికల్, వెటర్నరీ మినహా 15 వర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ
  • నలుగురితో కూడిన కామన్ బోర్డు ఏర్పాటు
  • అధ్యక్షుడిగా ఉన్నత విద్యామండలి చైర్మన్ 
  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కార్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు యూనివర్సిటీల్లో కామన్ రిక్రూట్మెంట్​ కోసం మరో అడుగు ముందుకు పడింది. ఇందుకు ప్రత్యేకంగా ‘కామన్ బోర్డు’ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనిద్వారా మెడికల్, వెటర్నరీ యూనివర్సిటీలు మినహా 15 యూనివర్సిటీల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపింది. నలుగురితో కూడిన బోర్డును సర్కారు ప్రకటించింది. దీనికి చైర్మన్​గా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్, కళాశాల విద్యాశాఖ కమిషనర్ మెంబర్ కన్వీనర్​గా, హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ/స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ సెక్రటరీ/ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మెంబర్లుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు గురువారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో నెంబర్ 16ను రిలీజ్ చేశారు. దీని ఆధారంగా రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధీ, అంబేద్కర్, పొట్టిశ్రీరాములు, జేఎన్ఏఎఫ్​ఏయూ, ఆర్జీయూకేటీతో పాటు అగ్రికల్చర్, హార్టికల్చర్, మహిళా, అటవీ వర్సిటీల్లో నియామకాలు చేపట్టనున్నారు. అవసరం మేరకు కోఆప్షన్ మెంబర్లుగా కామన్ బోర్డులోకి తీసుకొవచ్చని జీవోలో పేర్కొన్నారు. బోర్డుకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యాశాఖ కమిషనరేట్​కు సర్కారు సూచించింది. బోర్డుకు అయ్యే ఖర్చును ముందుగా హయ్యర్ ఎడ్యుకేషన్ భరించాలని, ఆ తర్వాత యూనివర్సిటీల నుంచి తీసుకోవాలని ఆదేశించింది. కామన్ బోర్డు గైడ్​లైన్స్​ను త్వరలో ఇవ్వనున్నట్టు జీవోలో పేర్కొంది. కామన్ రిక్రూట్మెంట్ కోసం అవసరమైన సవరణలను యూనివర్సిటీ యాక్ట్​లలో చేయనున్నట్టు తెలిపింది.

పోస్టులపై స్పష్టత కరువు
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో 3,500 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు. వీటిలో ఎన్ని పోస్టులకు ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ క్లియరెన్స్ ఇస్తుందో క్లారిటీ లేదు. ఇందులో ఎన్ని టీచింగ్, ఎన్ని నాన్ టీచింగ్ అనేది వెల్లడించలేదు. ఏ వర్సిటీలో ఎన్ని పోస్టులనే దానిపై స్పష్టత రాలేదు. ఉన్నత విద్యామండలి ఇప్పటికే 11 వర్సిటీలకు సంబంధించిన పోస్టుల వివరాలను ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​కు పంపించింది. ఆ శాఖ మాత్రం భర్తీకి క్లియరెన్స్ ఇవ్వలేదు. మరోపక్క నాన్ టీచింగ్ పోస్టుల భర్తీని కూడా కామన్ బోర్డు నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి.

మమ్మల్ని రెగ్యులరైజ్ చేశాకే నోటిఫికేషన్ ఇవ్వాలె
ప్రభుత్వం ముందుగా విద్యాశాఖ పరిధిలోని 11 వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలి. ఆ తర్వాతే వర్సిటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలి. 2015లోనే వర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలని సర్కారు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వం అందరినీ రెగ్యులరైజ్ చేయాలె.
- శ్రీధర్ కుమార్ లోధ్, ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్టు లెక్చరర్ల జేఏసీ కన్వీనర్