సెక్రటేరియట్ కూల్చడానికి మాత్రమే పర్మిషన్​ తీసుకున్నాం

సెక్రటేరియట్ కూల్చడానికి మాత్రమే పర్మిషన్​ తీసుకున్నాం
  • సెక్రటేరియట్​ కూల్చివేతపై హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర సర్కారు
  • కొత్త నిర్మాణాలు చేయడానికి అనుమతులు తీసుకుంటాం
  • కేబినెట్​ నిర్ణయాన్ని సీల్డ్​ కవర్​లో కోర్టుకు సమర్పించిన ఏజీ
  • కూల్చివేతలకు పర్యావరణ అనుమతులు అవసరమా? కాదా?
  • క్లారిటీ ఇవ్వాలన్న కోర్టు.. కూల్చివేతలపై స్టే పొడిగింపు

హైదరాబాద్, వెలుగు‘‘కేబినెట్​ నిర్ణయం తర్వాత సెక్రటేరియట్​ కూల్చివేత ప్రక్రియ మొదలుపెట్టాం. శిథిలావస్థలోని బిల్డింగ్స్​ను కూల్చి వ్యర్థాలను తీసేసి జాగాను చదును చేయడానికి ప్రభుత్వం పర్మిషన్​ తీసుకుంది. ఇప్పుడు చట్టప్రకారమే కూల్చివేతలు జరుగుతున్నాయి. కూల్చేయడం అంటే కొత్త నిర్మాణాలు చేపట్టడం కాదు. పునాది గోతులు తవ్వడం దగ్గర నుంచి కొత్త నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. కొత్త నిర్మాణాలు చేయడానికి అనుమతులు తీసుకుంటాం”అని అడ్వొకేట్​ జనరల్​ బీఎస్​ ప్రసాద్​ హైకోర్టుకు తెలిపారు. కూల్చివేత మధ్యలో స్టే ఇవ్వడం వల్ల బిల్డింగ్స్​ వద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. నిర్మాణాలు–కూల్చివేతలు–వ్యర్థాల నిర్వహణకు 2016లో కేంద్రం ఇచ్చిన గైడ్‌‌లైన్స్‌‌ను ఉల్లంఘించి సెక్రటేరియట్‌‌ బిల్డింగ్స్‌‌ను రాష్ట్ర ప్రభుత్వం కూల్చేస్తోందంటూ తెలంగాణ జనసమితి నేత పీఎల్‌‌ విశ్వేశ్వర్‌‌రావు, ఇంటి పార్టీ నేత చెరుకు సుధాకర్‌‌ దాఖలు చేసిన పిల్స్‌‌ను చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డిలతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ బుధవారం విచారించింది. సెక్రటేరియట్​ కూల్చివేతకు సంబంధించి జూన్​ 30న కేబినెట్​తీర్మానం చేసిందని, ఆ నిర్ణయాన్ని గోప్యంగా ఉంచాలంటూ సీల్డ్‌‌ కవర్‌‌లో ఏజీ కోర్టుకు అందజేశారు. ఆ ప్రతిని పరిశీలించిన బెంచ్​ ఆ కవర్‌‌ను రిజిస్ట్రార్‌‌ జనరల్‌‌ వద్ద భద్రంగా ఉంచాలని ఆదేశించింది.

అనుమతులు అవసరమని తెలియదా?

చట్టప్రకారం 20 వేల చదరపు మీటర్ల నుంచి లక్షన్నర చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాలు చేయాలంటే పర్యావరణ అనుమతులు అవసరమని తెలియదా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. బిల్డింగ్స్‌‌ కూల్చి చదును చేయడానికి పర్మిషన్‌‌ తీసుకోకపోతే అది చట్టానికి వ్యతిరేకమని చెప్పింది. బిల్డింగ్స్‌‌ను కూల్చి జాగాను చదును చేయడానికి ప్రభుత్వం పర్మిషన్‌‌ తీసుకుందని, కూల్చివేత పనులు నిర్మాణాల్లోకి రావని ఏజీ చెప్పిన జవాబుతో బెంచ్​ సంతృప్తి చెందలేదు. ఒక వ్యక్తి ఎలాంటి నిర్మాణం చేయబోనని తన ఇంటిని కూల్చి స్థలాన్ని చదును మాత్రమే చేస్తున్నామని చెప్పి.. కూల్చివేతల తర్వాత కొత్త కట్టడాలకు జీహెచ్‌‌ఎంసీ నుంచి పర్మిషన్‌‌ తీసుకున్నామంటే ఆమోదిస్తారా? అని ప్రశ్నించింది. నిజంగా దీనిని ప్రభుత్వం సమర్థిస్తే చట్ట స్ఫూర్తిని నీరుగార్చినట్లేనని అభిప్రాయపడింది. కొత్తగా నిర్మాణం చేయాలంటే స్టేట్‌‌ లెవెల్‌‌ ఎక్స్‌‌పర్ట్‌‌ కమిటీ ఆ స్థలాన్ని పరిశీలించి ఎన్విరాన్‌‌మెంట్‌‌ పరంగా స్టడీ చేసి రిపోర్టు ఇచ్చాకే అనుమతులు మంజూరు అవుతాయని ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించింది.

అనుమతులపై క్లారిటీ ఇవ్వండి

పిటిషనర్‌‌ తరఫున లాయర్​ చిక్కుడు ప్రభాకర్‌‌ వాదిస్తూ.. ప్రభుత్వం చట్టప్రకారం కూల్చివేతలకు, నిర్మాణాలకు అనుమతులు పొందలేదన్నారు. అనుమతులు లేకుండానే నిర్మాణ పనులు చేస్తోందన్నారు. కూల్చివేత పనులంటే కొత్త నిర్మాణాలను ప్రారంభించడమే అవుతుందన్నారు. కూల్చివేత పనులకు పర్యావరణ అనుమతులు అవసరమా కాదా? క్లారిటీ ఇవ్వాలని ఇరు పక్షాలకు బెంచ్​ సూచించింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులు ఉంటే వాటిని, పర్యావరణ అనుమతులకు సంబంధించిన కాపీలను సమర్పించాలని పిటిషనర్ తరఫు లాయర్, ఏజీని ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా వేసిన కోర్టు.. అప్పటి వరకూ సెక్రటేరియట్​ బిల్డింగ్స్​ కూల్చివేతపై స్టేను పొడించింది.

కొత్త సెక్రటేరియెట్‌‌లో మసీదు నిర్మిస్తం

సెక్రటేరియట్‌‌ ప్రాంగణంలోని మసీదు కొత్తగా నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. సెక్రటేరియట్‌‌లోని అన్ని బిల్డింగ్స్‌‌ను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందులో భాగంగా 6,477 చదరపు గజాల్లోని మసీదును కూల్చేస్తోందంటూ జాకీర్‌‌ హుస్సేన్‌‌ అనే వ్యక్తి హైకోర్టులో రిట్‌‌ పిటిషన్​ దాఖలు చేశారు. దీనిని బుధవారం హైకోర్టు జడ్జి జస్టిస్‌‌ ఎ.అభిషేక్‌‌రెడ్డి విచారణ చేపట్టారు. కొత్త సెక్రటేరియట్​లో అన్ని హంగులతో మసీదును కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఈ మేరకు మెమో దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది.

ఉస్మానియా దవాఖానలో ఎటు చూసినా వరద..బురద