ఇక ప్రతి ఏటా జనవరిలో డీఎస్సీ

ఇక ప్రతి ఏటా జనవరిలో డీఎస్సీ
  •     ఏడాదికి ఒక్కసారే ఉద్యోగ పోటీ పరీక్షలు
  •     మండలానికో జూనియర్‌ కాలేజీ
  •     ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు

అమరావతి, వెలుగుఏపీలో ప్రతి మండలానికో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తామని, వచ్చే మూడేళ్లలో కొత్త కాలేజీలను అందుబాటులోకి తెస్తామని సీఎం జగన్ ప్రకటించారు. హైస్కూళ్లను క్రమపద్ధతిలో ప్లస్‌‌‌‌ 2 వరకు పెంచాలని అధికారులను ఆదేశించారు. గవర్నమెంట్​హై స్కూళ్లలో జూనియర్ కాలేజీ స్థాయి సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. విద్యాశాఖపై ఏపీ సీఎం జగన్ బుధవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టిన నాడు–నేడు పథకం గురించి వివరించారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 44,512 స్కూళ్లను బాగు చేయనున్నట్లు అధికారులకు తెలిపారు. మొదటి విడతలో 15,410 స్కూళ్లలో 9 రకాల కనీస వసతులను ప్రభుత్వమే కల్పిస్తుందన్నారు. విద్యా ప్రమాణాలను మెరుగు పరిచేందుకు వచ్చే ఏడాది నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలోనే బోధన జరుగుతుందన్నారు. ఆ తరువాత ఏడాదిలో 9,10 తరగతులకూ ఇంగ్లీషు మీడియంను విస్తరిస్తామన్నారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 70 వేల మంది టీచర్లకు ఇంగ్లీషు బోధనలో శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. డైట్ కోర్సులో ఇంగ్లీషు బోధనపై శిక్షణ ఇచ్చేలా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో స్టూడెంట్ల సంఖ్యకు తగ్గట్లుగా టీచర్లను సర్దుబాటు చేయాలని ఆదేశించారు. అవసరమైన మేర ప్రతి ఏటా టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు ఏటా జనవరిలో మాత్రమే నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ప్రజా ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్

ఏపీలో ప్రజల నుంచి ఫిర్యాదులు, ప్రజా సమస్యల పరిష్కారానికి సూచనలు స్వీకరించేందుకు ప్రభుత్వం కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తుందని సీఎం తెలిపారు. 1902 నెంబర్​కు కాల్ చేసి ప్రభుత్వ సేవలు నేరుగా పొందే అవకాశం కల్పిస్తామన్నారు. అక్టోబర్ 2న ప్రారంభించే 11 వేలకు పైగా గ్రామ సచివాలయాల్లో కాల్ సెంటర్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వ పథకాలను దరఖాస్తు చేసిన 72 గంటల్లోగా లబ్ధిదారులకు అందిస్తామని ప్రకటించారు. సచివాలయాల్లో ఆధునిక, సేంద్రియ వ్యవసాయంపై రైతులకు వర్క్ షాపులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన రుణ అర్హత కార్డులు, వ్యవసాయ సేవలు గ్రామంలోనే అందిస్తామన్నారు. మీసేవ, ప్రభుత్వ శాఖల ద్వారా అందుతున్న 237 సర్వీసులు గ్రామ సచివాలయాల్లోనే అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.