పేదల తిరుపతి.. ఉద్దాల మహోత్సవం ప్రారంభం

 పేదల తిరుపతి.. ఉద్దాల మహోత్సవం ప్రారంభం

మహబూబ్ నగర్ జిల్లా చిన్న  చింతకుంట మండలం అమ్మపురం గ్రామం కురుమతి కొండల్లో కాంచన గుహలో వెలసిన పేదల తిరుపతిగా పిలవబడే శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతియేటా కార్తీకమాసంలో నెల రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి శ్రీ కురుమూర్తి స్వామిని దర్శించుకుంటారు. బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టలైన అలంకార మహోత్సవం, ఉద్దాల మహోత్సవం, అలంకర మహోత్సవం అమ్మపురం గ్రామానికి చెందిన ముక్కెర వంశీయులు బహూకరించిన కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలను ఆత్మకూర్ sbi బ్యాంకు లో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల అనంతరం భద్రపరుస్తారు. ఈ భద్రపరిచిన బంగారు ఆభరణాలను ఈనెల 9వ తేదీన ఆత్మకూరు sbi బ్యాంకు నుంచి భారీ ఊరేగింపుతో పోలీస్ బందోబస్తులతో కురుమూర్తి గిరులకు చేర్చి కాంచన గుహలో కొలువైన కురుమూర్తి స్వామివారికి అలంకరించారు.

అనంతరం 11 తేదీన ఉద్దాల మహోత్సవం జరుగుతుంది. వడ్డెమాన్ గ్రామంలో ఉద్దాల కర్మాగారంలో దళితులచే అత్యంత నియమనిష్టలతో తయారుచేసిన ఉద్దాలకు  ( పాదుకలు) ఆలయ అధికారులు పూజలు జరిపించి,  వడ్డెమాన్ నుంచి భారీ పోలీస్ బందోబస్తులతో కురుమూర్తి జాతరలో ఉన్న ఉద్దాల మండపానికి చేరుస్తారు, ఈ వేడుక అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ ఉద్దాల మహోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి, స్వామివారి ఉద్దాలను దర్శించుకుంటారు. ఈ ఉద్దాలతో తలపై కొట్టించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. శివసత్తుల పూనకాలతో గోవింద నామస్మరణలతో కురుమూర్తి గిరులు మారుమోగుతాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు కొత్త కుండలో పరమాన్నం ఉంచి పచ్చిపులుసుతో స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ వేడుకలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు.

ఇక్కడికి వచ్చి కురుమూర్తి స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుందని అనుకున్న కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ప్రతి ఏటా తప్పనిసరిగా స్వామివారిని దర్శించుకుంటామని భక్తులు చెబుతున్నారు. నెల రోజుల పాటు వంద ఎకరాల జాతర మైదానం ప్రాంగణమంతా రంగులరాట్నంలతో, చిన్న పిల్లల ఆట వస్తువుల తో తినుబండారాలతో రకరకాల దుకాణాలతో రోజూ వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది. చిరు వ్యాపారస్తులకు నెల రోజుల పాటు ఈ జాతరలో జీవనోపాధి కలుగుతుంది. పోయిన ఏడాది కరోనా కారణంగా అధికారులు ఆంక్షలు విధించడంతో భక్తులు తక్కువ సంఖ్యలో దర్శనమిచ్చారు. కానీ ఈసారి ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో అధికారులు జాతరలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.