పట్టణ ప్రగతిలో అందరూ పాల్గొనాలి

పట్టణ ప్రగతిలో అందరూ పాల్గొనాలి

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ వ్యాప్తంగా శుక్రవారం ‘పట్టణ ప్రగతి’  ప్రోగ్రామ్​ మొదలైంది. ఖైరతాబాద్​లోని ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్, బడా గణేష్ ఏరియాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సిటీలంటే ఒకప్పుడు చెన్నై, బెంగళూరు, ముంబై పేర్లే వినిపించేవని, ప్రస్తుతం అన్నిచోట్ల హైదరాబాద్​ పేరు వినిపిస్తుందన్నారు. నాలాల ఆక్రమణతోనే ముంపు సమస్య తలెత్తుతుందని, శాశ్వత పరిష్కారం దిశగా పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎమ్మెల్యే దానం నాగేందర్, బల్దియా కమిషనర్ లోకేశ్​కుమార్ ఉన్నారు. అలాగే జూబ్లీహిల్స్​ఎన్బీటీ నగర్​లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మేయర్​గద్వాల్  విజయలక్ష్మి ప్రారంభించారు. సమగ్ర నగర అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఆమె చెప్పారు. పట్టణ ప్రగతి, దోమల నివారణకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్​చేశారు. మేయర్ ​వెంట జోనల్ కమిషనర్ రవికిరణ్, చీఫ్ ఎంటమాలజీ డాక్టర్ రాంబాబు ఉన్నారు.

ప్రోగ్రామ్​ను బహిష్కరించిన బీజేపీ కార్పొరేటర్లు

టీఆర్ఎస్ ​లీడర్లు జనాలను తప్పుదారి పట్టించేందుకే పట్టణ ప్రగతి ప్రోగ్రామ్​ ను నిర్వహిస్తున్నారని గుడిమల్కాపూర్, మన్సురాబాద్ కార్పొరేటర్లు దేవర కరుణాకర్, కొప్పుల నర్సింహారెడ్డి ఆరోపించారు. ప్రత్యేక కార్యక్రమానికి ముందు ఫండ్స్ కేటాయించాలని డిమాండ్ ​చేశారు. అప్పటివరకు పట్టణప్రగతికి దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. డైలీ నిర్వహించే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లి ఫొటోలు దిగడం ఎందుకని ప్రశ్నించారు.
పద్మారావునగర్: బన్సీలాల్​పేట డివిజన్ పద్మారావునగర్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో సినీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల పాల్గొన్నారు.  పరిసరాల శుభ్రత, ప్రతిఒక్కరి బాధ్యతని ఆయన అన్నారు. కార్పొరేటర్ కుర్మ హేమలత, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.

కీసర: పట్టణ, పల్లె ప్రగతిలో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీశ్ హెచ్చరించారు. శుక్రవారం నాగారం మున్సిపాలిటీలో చేపట్టిన పనులను ఆయన పరిశీలించారు.అలాగే మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని సందర్శించారు. అడిషనల్ కలెక్టర్ శ్యాంసన్, నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి అధికారులు పాల్గొన్నారు. గండిపేట: రాజేంద్రనగర్, గండిపేట మండలాలు, బండ్లగూడ జాగీర్ మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ పరిధిలో శుక్రవారం పట్టణ ప్రగతి కార్యక్రమాలు మొదలయ్యాయి. మణికొండలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ సీడీఎంఏ డాక్టర్‌‌‌‌ ఎన్‌‌‌‌.సత్యనారాయణ, హైదరాబాద్‌‌‌‌ రీజియన్‌‌‌‌ ఆర్‌‌‌‌డీఎంఏ శ్రీనివాస్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. 

‘డబుల్’ ఇండ్లకు శంకుస్థాపన

సికింద్రాబాద్: కంటోన్మెంట్ సెగ్మెంట్​లోని రసూల్​పురా నారాయణ జొంపిడి కాలనీలో 296 డబుల్​బెడ్​రూమ్​ ఇండ్ల నిర్మాణానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. స్థానిక నిరుపేదల కోసం రూ.22.94 కోట్ల అంచనాతో ఇండ్లు నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్మే సాయన్న, కలెక్టర్ శర్మన్, బేవరేజ్ కార్పొరేషన్  చైర్మన్ నగేశ్ పాల్గొన్నారు.