పాదయాత్ర ఆపాలన్న పిటిషన్ పై విచారణ వాయిదా

పాదయాత్ర ఆపాలన్న పిటిషన్ పై విచారణ వాయిదా

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఆపేలా ఆదేశించాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. దీంతో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు మేరకు ప్రజా సంగ్రామ యాత్ర యాధావిధిగా కొనసాగనుంది. పాదయాత్ర ఆపాలంటూ పోలీసులు ఇచ్చిన నోటీసులపై గురువారం విచారణ జరిపిన సింగిల్ బెంచ్ ధర్మాసనం వాటిని సస్పెండ్ చేసింది. బండి సంజయ్ పాదయాత్ర కొనసాగించుకోవచ్చని చెప్పింది. 

సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై స్పందించిన ప్రభుత్వం బండి సంజయ్ పాదయాత్ర ఆపాలంటూ హైకోర్టులో అప్పీల్ చేసింది. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అప్పీల్ పై అత్యవసర విచారణ చేపట్టాలని ప్రభుత్వం సీజే ధర్మాసనాన్ని కోరింది.  ప్రభుత్వ అప్పీల్ పై మధ్యాహ్నం 1.15 గంటలకు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ తమకు అందలేదన్న న్యాయమూర్తి.. రిట్ అప్పీల్ నెంబర్ ఇంకా ఫైనల్ కాలేదని చెప్పారు. విచారణను మధ్యాహ్నం 2.30గంటలకు వాయిదా వేశారు. మధ్యాహ్నం పిటిషన్ పై మరోసారి విచారణ జరిపిన సీజే ధర్మాససం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.